Ananya Panday: పాతికేళ్లకే లగ్జరీ లైఫ్‌.. ఇప్పుడు ఓ ఇల్లూ కొనేసింది!

సొంత సంపాదనతో ఏ వస్తువు కొన్నా దాన్నెంతో అమూల్యంగా భావిస్తాం. దాని గురించి అందరితో పంచుకుంటూ మురిసిపోతుంటాం. బాలీవుడ్‌ లవ్లీ బ్యూటీ అనన్యా పాండే కూడా ప్రస్తుతం ఇదే ఆనందంలో మునిగి తేలుతోంది.

Published : 13 Nov 2023 13:03 IST

(Photos: Instagram)

సొంత సంపాదనతో ఏ వస్తువు కొన్నా దాన్నెంతో అమూల్యంగా భావిస్తాం. దాని గురించి అందరితో పంచుకుంటూ మురిసిపోతుంటాం. బాలీవుడ్‌ లవ్లీ బ్యూటీ అనన్యా పాండే కూడా ప్రస్తుతం ఇదే ఆనందంలో మునిగి తేలుతోంది. ఇంతకీ తనేం కొందనేగా మీ సందేహం? ఖరీదైన డ్రస్సో, బ్యాగో కాదు.. ఏకంగా ఓ ఇంటినే కొనేసిందీ ముద్దుగుమ్మ. ధంతేరస్‌ సందర్భంగా గృహ ప్రవేశం కూడా చేసేసింది. ఇలా తన బకెట్‌ లిస్ట్‌లో ఉన్న కోరికల్లో ఒకటి నెరవేరిందంటూ.. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలోనూ షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌తో తన ఆనందాన్ని పంచుకుంది. దీంతో ‘పాతికేళ్లకే ఇంటి యజమాని అయిపోయిందంటూ..’ అటు సెలబ్రిటీలు, ఇటు నెటిజన్లు అనన్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఇల్లే కాదు.. ఇంతకంటే ముందు అనన్య సొంతమైన ఖరీదైన వస్తువులు చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చంకీ పాండే, డిజైనర్‌ భావన పాండేల గారాలపట్టి అనన్య. 2019లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ తార.. స్వీయ ప్రతిభతో బాలీవుడ్‌లో రాణిస్తోంది. ‘ఖాలీ పీలీ’, ‘గెహ్రియాన్‌’, ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’, ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’.. వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘లైగర్‌’తో తెలుగు వారికీ దగ్గరైంది. ప్రస్తుతం మూడు సినిమాలు, ఒక వెబ్‌సిరీస్‌తో బిజీగా ఉన్న అనన్య.. సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కు ఎప్పుడూ చేరువలోనే ఉంటుంది.

నా డ్రీమ్‌ హోమ్!

తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విషయాలన్నీ సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటుంది అనన్య. తాజాగా తాను ముంబయిలో ఓ ఫ్లాట్‌ కొన్న విషయాన్నీ ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది. ఈ క్రమంలో గృహప్రవేశం, పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని ఇన్‌స్టాలో పంచుకున్న ఈ చిన్నది.. ‘నా బకెట్‌ లిస్ట్‌లో సొంతిల్లు ముందు వరుసలో ఉంటుంది. తాజాగా ఈ కోరిక నెరవేరింది. ఇదే నా డ్రీమ్‌ హోమ్‌. ధంతేరస్‌ సందర్భంగా గృహప్రవేశం చేసి కొత్తింట్లోకి అడుగుపెట్టా. ఈ కొత్త ప్రయాణంలో మీ ఆశీర్వాదాలు కావాలి..’ అంటూ మురిసిపోయింది. ఇలా పాతికేళ్లకే ఇంటి యజమానైపోయిన అనన్యకు అటు సెలబ్రిటీలు, ఇటు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది తల్లీ! ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లు!’ అంటూ అనన్య తల్లిదండ్రులు పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోయారు. మరోవైపు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ ఫరా ఖాన్‌ స్పందిస్తూ.. ‘వావ్‌.. ఇంత చిన్న వయసులో ఇల్లు కొనేశావ్‌గా! కొత్తింట్లో నీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..’ అంటూ కామెంట్‌ చేసింది. ఇలా మొత్తానికి పాతికేళ్లకే ఓ ఇంటి ఓనరైపోయింది అనన్య.


కార్‌ లవర్!

ఒక కారుంటే చాలనుకుంటారు చాలామంది. కానీ అనన్య అలా కాదు.. తనో కార్‌ లవర్‌. కొంతమంది గ్యాడ్జెట్స్‌ ఎలా ఇష్టపడతారో.. అనన్యకు కార్లంటే అంత మక్కువ మరి! ఇప్పటికే తన కార్‌ షెడ్‌లో నాలుగు లగ్జరీ కార్లున్నాయట! ‘బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ సెడాన్‌’, ‘రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌’, ‘మెర్సిడెస్‌ బెంజ్‌ ఇ-క్లాస్‌’, ‘స్కోడా కొడియాక్‌’.. వంటి ఖరీదైన కార్లను ఇప్పటికే కొనేసిన ఈ బ్యూటీ.. షూటింగ్స్‌ నుంచి కాస్త విరామం దొరికితే చాలు.. స్నేహితులతో కలిసి తన కార్లలో లాంగ్‌ డ్రైవ్స్‌కి చెక్కేస్తుందట! అంతేకాదు.. తన వ్యక్తిగత లక్ష్యాల్లో కార్లకే అత్యధిక ప్రాధాన్యమిస్తానంటోందీ బాలీవుడ్‌ బేబ్.


ఫ్యాషన్‌ ‘ఐకాన్’!

కొంతమంది సెలబ్రిటీలు ఆధునిక ఫ్యాషన్లను ఫాలో అయితే.. మరికొంతమంది తమదైన స్టైల్స్‌తో సరికొత్త ఫ్యాషన్లను సృష్టిస్తుంటారు. అనన్య కూడా తన ఫ్యాషన్‌ సెన్స్‌తో బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. ఫ్యాషన్‌ షోల దగ్గర్నుంచి, చిత్రోత్సవాలు, సెలబ్రిటీల పార్టీలు-పెళ్లిళ్లు-ఇతర వేడుకల్లో ఫ్యాషనబుల్‌గా మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ క్లోజెట్‌లో లేని ఫ్యాషన్‌ లేదంటే అతిశయోక్తి కాదు. వాటిలో కొన్ని ఖరీదైన దుస్తులూ ఉన్నాయి. గతంలో ఓ అవార్డ్‌ షోలో భాగంగా.. Bowie అనే డ్రస్‌లో మెరిసిపోయింది అనన్య. నలుపు రంగులో, వదులైన స్లీవ్స్‌తో రూపొందించిన ఈ బాడీహగ్గింగ్‌ డ్రస్‌కు థై-హై స్లిట్‌.. దాన్ని కవర్‌ చేసేలా పింక్‌ కలర్‌లో ఉన్న బౌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇజ్రాయెల్‌కు చెందిన డిజైనర్‌ గాలియా లహావ్‌ రూపొందించిన ఈ డ్రస్‌ ధర రూ. 2 లక్షలకు పైమాటేనట! ఇదొక్కటే కాదు.. దేశీయ, అంతర్జాతీయ డిజైనర్లు రూపొందించిన ఇలాంటి ఖరీదైన డ్రస్సులు అనన్య వార్డ్‌రోబ్‌లో లెక్కకు మిక్కిలేనట!


‘బంగారు’ బ్యాగ్!

ఫ్యాషన్‌ అంటే దుస్తులే కాదు.. ఖరీదైన యాక్సెసరీస్‌కీ తన వార్డ్‌రోబ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుందంటోందీ బాలీవుడ్‌ బ్యూటీ. అందులోనూ దుస్తులకు తగ్గ రేంజ్‌లోనే హ్యాండ్‌బ్యాగ్‌/హ్యాండ్‌క్లచ్‌లను ఎంచుకోవడానికీ ఆసక్తి చూపుతానంటోంది అనన్య. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైందామె. ఇందులో పింక్‌ కలర్‌ బ్లేజర్‌ డ్రస్‌లో దర్శనమిచ్చిన ఈ చిన్నది.. బకెట్‌ ఆకృతిలో ఉన్న బ్యాగ్‌తో ఆకట్టుకుంది. బంగారంతో డిజైన్‌ చేసిన ఈ బ్యాగ్‌పై అమర్చిన బంగారు నాణేలు అదనపు ఆకర్షణగా నిలిచాయని చెప్పచ్చు. అమెరికన్‌ లగ్జరీ బ్రాండ్‌ ‘జుదిత్‌ లీబెర్‌’ రూపొందించిన ఈ బ్యాగ్‌కు లోపలి వైపు మెటాలిక్‌ ఇంటీరియర్‌తో హంగులద్దారు. చూడ్డానికి ఎంతో లగ్జరీగా కనిపిస్తోన్న ఈ బ్యాగ్‌ ధర సుమారు రూ. 5 లక్షలట! ఇలా విభిన్న ప్రత్యేకతలతో కూడిన ఈ బ్యాగ్‌ అప్పట్లో తెగ వైరలైంది. అనన్య క్లోజెట్‌లో ఇలాంటి బ్యాగ్సే కాదు.. ఖరీదైన హీల్స్‌, స్టేట్‌మెంట్‌ జ్యుయలరీ వంటివీ ఉన్నాయట!


‘వెకేషన్‌’ మూడ్!

కాస్త ఖాళీ సమయం దొరికితే ఇంట్లో వాళ్లతో గడపడానికి ఆసక్తి చూపిస్తాం.. తాను మాత్రం వెకేషన్లకు చెక్కేస్తానంటోంది అనన్య. ప్రయాణాలంటే తనకు అంత ఇష్టం మరి! తన గర్ల్‌ గ్యాంగ్‌తో దేశవిదేశాల్లో పలు ప్రదేశాల్ని చుట్టొచ్చే ఈ ముద్దుగుమ్మ.. మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు వెళ్తానని చెబుతోంది. ఇప్పటికే న్యూయార్క్‌, అమెరికా, మాల్దీవులు.. వంటి దేశాల్ని చుట్టొచ్చిన ఈ చక్కనమ్మ.. ద్వీప దేశాలన్నా, బీచ్‌లన్నా తెగ ముచ్చటపడుతుందట! ఇలా వెకేషన్లతోనూ లగ్జరీగా జీవితాన్ని గడిపేస్తోన్న అనన్య.. ఆ ఫొటోల్ని తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోతుంది కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్