ఈ యూట్యూబ్‌ టీచరమ్మ ప్రత్యేకత అదే!

నాణ్యమైన విద్య కావాలంటే.. అత్యుత్తమ విద్యా సంస్థల్లో చేరాలి. అందుకోసం ఏటికేడు లక్షల కొద్దీ డొనేషన్లు, ఫీజులు కుమ్మరించాలి. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ కారణంతోనే చాలామంది నాణ్యమైన విద్యకు నోచుకోలేకపోతున్నారు. ఆర్థిక స్థోమత లేక మరికొంతమంది చదువుకు.....

Published : 26 Dec 2022 14:42 IST

(Photos: Instagram)

నాణ్యమైన విద్య కావాలంటే.. అత్యుత్తమ విద్యా సంస్థల్లో చేరాలి. అందుకోసం ఏటికేడు లక్షల కొద్దీ డొనేషన్లు, ఫీజులు కుమ్మరించాలి. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈ కారణంతోనే చాలామంది నాణ్యమైన విద్యకు నోచుకోలేకపోతున్నారు. ఆర్థిక స్థోమత లేక మరికొంతమంది చదువుకు దూరమవుతున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు ఆటంకాలుగా మారిన ఇలాంటి సమస్యల్ని అర్థం చేసుకుంది జార్ఖండ్‌కు చెందిన రోష్నీ ముఖర్జీ. ప్రతి ఒక్కరికీ ఉచితంగా, నాణ్యమైన విద్యను అందించాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనే పదేళ్ల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించేందుకు ఊతమిచ్చింది. ఇంతింతై అన్నట్లుగా తన సృజనాత్మక టీచింగ్‌ పద్ధతులతో ప్రస్తుతం రెండు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించుకొని.. ఎంతోమంది విద్యార్థుల అభిమాన టీచర్‌గా మారిపోయిన రోష్నీ స్ఫూర్తి గాథ మీరూ చదివేయండి!

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన రోష్నీ.. ఓ మధ్య తరగతి బెంగాలీ కుటుంబంలో పుట్టి పెరిగింది. చిన్నతనం నుంచే చదువులో మహా చురుకు. కెరీర్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రాధాన్యమిచ్చిన ఆమెను తల్లిదండ్రులు కూడా ఇదే దిశగా ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు తన ప్రతిభతో సైన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ అందుకున్న రోష్నీ.. దిల్లీ యూనివర్సిటీకి చెందిన హన్స్‌రాజ్ కళాశాలలో ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ పూర్తిచేసింది.

నాన్న చనిపోవడంతో..!

అయితే ఎమ్మెస్సీలో ఉండగానే తండ్రిని కోల్పోయింది రోష్నీ. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన ఆమె.. ఒక దశలో కుంగిపోయింది. కానీ ఆపై తేరుకొని ధైర్యం తెచ్చుకుంది. తిరిగి చదువుపై దృష్టి పెట్టి ఎమ్మెస్సీ పూర్తి చేసింది. టీచింగ్‌ వృత్తిపై విపరీతమైన ఆసక్తి ఉన్నా.. కుటుంబానికి అండగా నిలబడేందుకు కార్పొరేట్‌ ఉద్యోగాలవైపు మొగ్గుచూపిందామె. ఈ క్రమంలోనే ఎమ్మెస్సీలోనే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో విప్రోలో ఉద్యోగం సంపాదించింది. మూడేళ్లు అక్కడ పనిచేశాక హ్యులెట్‌ ప్యాకర్డ్‌ సంస్థలో సీనియర్‌ క్వాలిటీ అనలిస్ట్‌గా చేరింది. ఇలా కొన్ని నెలలు పనిచేశాక తిరిగి తన టీచింగ్‌ ఆసక్తిపై దృష్టి పెట్టింది రోష్నీ.

‘వివిధ కారణాల రీత్యా మన దేశంలో నాణ్యమైన విద్యే కరువైపోయింది. ఒకవేళ ఇలాంటి చదువు కావాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిందే! ఇది చాలామంది తల్లిదండ్రులకు తలకు మించిన భారమని చెప్పాలి. అందుకే నాణ్యమైన విద్యనే ఉచితంగా అందించాలనుకున్నా. మారుమూల ప్రాంతాల్లో ఉండే చిన్నారులకు చేరువ కావడంతో పాటు తల్లిదండ్రులూ తమ పిల్లల్ని చదువు విషయంలో ప్రోత్సహించాలనుకున్నా. వీటన్నింటికీ అంతర్జాలమే పరిష్కారమనిపించింది. ఇదే 2011లో ఎగ్జామ్‌ ఫియర్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించేందుకు దోహదం చేసింది..’ అంటూ తన ప్రయాణాన్ని ప్రారంభించిన తీరును వివరించిందీ టీచరమ్మ.

సృజనాత్మక టీచింగ్‌ పద్ధతులు..!

అటు ఉద్యోగం చేస్తూ.. ఇటు తన యూట్యూబ్‌ ఛానల్‌పై దృష్టి పెట్టిన రోష్నీ.. కొన్ని నెలల తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి టీచింగ్‌కే తన పూర్తి సమయం కేటాయించింది. ఈ క్రమంలో 9, 10 తరగతుల విద్యార్థులకు భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం, గణితం.. వంటి సబ్జెక్టుల్ని బోధించడం మొదలుపెట్టిందామె. కొన్నేళ్ల తర్వాత ఎగ్జామ్‌ ఫియర్‌గా ఉన్న తన యూట్యూబ్‌ ఛానల్‌ పేరును ‘లెర్నోహబ్‌’గా మార్చుకుంది. నిజ జీవితంలోని సంఘటనలు, యానిమేషన్స్‌-బొమ్మల రూపంలో.. ఇలా పలు సృజనాత్మక పద్ధతుల్లో ఆయా సబ్జెక్టుల్లోని పాఠాల్ని బోధిస్తోందామె. ఇక పాఠం పూర్తయ్యాక కాన్సెప్ట్‌లోని ముఖ్యాంశాల్ని మరోసారి పునశ్చరణ చేస్తూ.. అది మరింత సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేలా చేస్తోందీ టీచరమ్మ.

విద్యార్థుల ‘అభిమాన టీచర్‌’గా!

‘నా యూట్యూబ్‌ ఛానల్‌కు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోంది. 9, 10 తరగతుల్లో చదివే చాలామంది విద్యార్థులు ట్యూషన్లు, ప్రత్యేక తరగతుల పేరిట వేల కొద్దీ డబ్బు ఖర్చు పెడుతుంటారు. కొందరికి ఈ స్థోమత ఉండకపోవచ్చు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఎంతోమందికి నా యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా పాఠాలు చెబుతున్నందుకు, నాలో ఉన్న విద్యా సంపదను నలుగురికీ పంచుతున్నందుకు సంతోషంగా ఉంది. నేను బోధించే సృజనాత్మక పద్ధతులు, పాఠం పూర్తయ్యాక చేసే పునశ్చరణ, ప్రశ్న-జవాబు సెషన్‌.. వంటివి పిల్లలకు ఆయా కాన్సెప్టులు సులభంగా అర్థమయ్యేందుకు దోహదం చేస్తున్నాయి..’ అంటోన్న రోష్నీ దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులకు అభిమాన టీచర్‌గా మారిపోయింది.

జీవిత పాఠాలూ..!

సృజనాత్మక టీచింగ్‌ పద్ధతులతో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తూ.. ఎంతోమంది విద్యార్థులకు చేరువైన రోష్నీ యూట్యూబ్‌ ఛానల్‌కు ప్రస్తుతం రెండు మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ఆమె ఛానల్లో ఏడు వేలకు పైగా వీడియో పాఠాలున్నాయి. ఇలా యూబ్యూట్‌ వేదికగానే కాదు.. ‘లెర్నోహబ్‌’ పేరుతో వెబ్‌సైట్‌ను కూడా నిర్వహిస్తున్నారామె. మొన్నటివరకు ఇంగ్లిష్‌లోనే పాఠాలు బోధించిన రోష్నీ.. ఇప్పుడు హిందీలోనూ పాఠాల వీడియోలు రూపొందిస్తోంది. అలాగే ఆయా సబ్జెక్టులతో పాటు ఆంగ్ల వ్యాకరణం, సైన్స్‌ ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు, నీట్‌ వంటి పోటీ పరీక్షల గైడెన్స్‌ వీడియోలు, విద్యార్థులకు ఆయా అంశాల్లో సరైన గైడెన్స్‌ అందించేలా నిపుణుల సహాయంతో రూపొందించిన వీడియోలు.. కూడా ప్రస్తుతం తన ఛానల్‌, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయంటోందామె. ఇలా తన మంచి మనసుతో ఎంతోమంది చిన్నారులకు విద్యా దానం చేస్తోన్న రోష్నీ.. ‘ఎడ్యుట్యూబర్‌ ప్రెసిడెంట్‌ అవార్డు’, ‘100 విమెన్‌ అఛీవర్స్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారంతో పాటు ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు సంపాదించింది. ఇలా పాఠ్యాంశాలే కాదు.. టెడెక్స్‌ వంటి వేదికలపైనా జీవిత పాఠాలు చెబుతూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటుందీ టీచరమ్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్