డ్యాన్స్‌తో అదరగొడుతూ.. లక్షలు సంపాదిస్తోంది..!

ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది వీటిని ఉపయోగించుకొని పెడదారులు పడుతుంటే మరికొంతమంది మాత్రం వీటిని వేదికగా చేసుకొని తమ ప్రతిభను....

Published : 27 Apr 2023 12:36 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది వీటిని ఉపయోగించుకొని పెడదారులు పడుతుంటే మరికొంతమంది మాత్రం వీటిని వేదికగా చేసుకొని తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అంతేకాదు.. ఆదాయాన్నీ గడిస్తున్నారు. ఈ జాబితాలో భారత సంతతకి చెందిన 13 ఏళ్ల హర్నిద్‌ కౌర్ ముందు వరుసలో ఉంటుంది. హర్నిద్‌ తన డ్యాన్స్‌ వీడియోలతో అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా.. చిన్న వయసులోనే లక్షల్లో ఆదాయం ఆర్జిస్తోంది. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

పంజాబ్‌ టు దుబాయ్...

హర్నిద్‌ది పంజాబీ కుటుంబం. ఆమె తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం దుబాయ్లో స్థిరపడ్డారు. దాంతో హర్నిద్ దుబాయ్లోనే పెరిగింది. అయినా పంజాబీ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడుతుంటుంది. హర్నిద్‌కు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే మక్కువ. దాంతో ఆమె తల్లిదండ్రులు ప్రత్యేకంగా డ్యాన్స్ మాస్టర్‌ దగ్గర శిక్షణ ఇప్పించారు. కొద్ది రోజులకే డ్యాన్స్‌లో మెలకువలను ఒంటబట్టించుకున్న ఈ అమ్మాయి ఇంటి దగ్గర పలు పాటలకు స్టెప్పులేసేది. హర్నిద్‌ ప్రతిభను గుర్తించిన ఆమె తల్లి డ్యాన్స్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయమని సలహా ఇచ్చింది. అలా రెండేళ్ల క్రితం ‘beatswithharnidh’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరిచింది. పలు బాలీవుడ్‌ చిత్రాలకు సంబంధించిన పాటలకు డ్యాన్స్ చేసి.. ఆ వీడియోలను పోస్ట్‌ చేయడం ప్రారంభించింది.

ఏడాదిలోనే లక్ష మంది..!

హర్నిద్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరచిన ఏడాదిలోనే లక్ష మంది ఫాలోయర్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో దుబాయ్లోని యంగెస్ట్‌ సోషల్‌ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ల జాబితాలో స్థానం సంపాదించింది. అలాగే ‘బెస్ట్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (జూనియర్‌)’ కేటగిరిలో ‘గల్ఫ్ ఎఛీవర్స్‌ అవార్డ్‌’నూ దక్కించుకుంది. హర్నిద్‌ కేవలం డ్యాన్స్ వీడియోలు చేయడమే కాకుండా మోటివేషనల్‌ స్పీకర్‌గా కూడా రాణిస్తోంది. ఈక్రమంలో- వివిధ ఉత్పత్తుల ప్రచారకర్తగా లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. డ్యాన్స్ వీడియోలు చేయడంలో బిజీగా ఉండే హర్నిద్‌ చదువులోనూ ముందే ఉంటుంది. ఈ క్రమంలో పరీక్షల్లో 90 శాతం పైగా మార్కులు సాధిస్తుండడం గమనార్హం. ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత వ్యాపారవేత్తగా మారి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తానని ధీమాగా చెబుతోంది హర్నిద్.

వైరలవుతున్న వీడియోలు..!

హర్నిద్‌ తన డ్యాన్స్ వీడియోలకు సొంతంగా కొరియోగ్రఫీ చేస్తుందట. హర్నిద్‌ పోస్ట్ చేసిన పలు వీడియోలకు అభిమానుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. RRR లోని 'నాటు నాటు'.. అలాగే కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ చిత్రంలోని ‘లండన్ తుమ్కడా’.. ఇలా ఎన్నో పాటలకు హర్నిద్ చేసే డ్యాన్స్ వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. డ్యాన్స్ బాగుందంటూ ఎంతోమంది హర్నిద్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా తనదైన నాట్య ప్రతిభతో హర్నిద్ చిన్న వయసులోనే కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్