సముద్ర నాచు.. తినిపిస్తోంది!

సాగర జలాలపై తేలుతూ, తీరాన రాళ్లపై పరుచుకున్న పచ్చదనంతో నాచు చూడటానికి ఎంతో బాగుంటుంది. దాన్ని రుచి చూడాలని ఎప్పుడైనా అనిపించిందా? ముఖం చిట్లించి అలా చూడకండి.

Published : 01 Mar 2023 00:05 IST

సాగర జలాలపై తేలుతూ, తీరాన రాళ్లపై పరుచుకున్న పచ్చదనంతో నాచు చూడటానికి ఎంతో బాగుంటుంది. దాన్ని రుచి చూడాలని ఎప్పుడైనా అనిపించిందా? ముఖం చిట్లించి అలా చూడకండి. గాబ్రియేలా డిక్రూజ్‌ వ్యాపారమే అది. ఆమెవరో.. తన వ్యాపార సంగతేంటో చూద్దాం రండి.

‘నాచు.. తినడం అనగానే ఒకలా చూస్తారు కానీ.. రోజువారీగా దాన్ని ఏదో రూపంలో మనం తీసుకుంటూనే ఉంటాం. టూత్‌పేస్ట్‌, ఐస్‌క్రీమ్‌లు, కొన్ని ఆహార పదార్థాల్లో సుగంధ ద్రవ్యాలు.. ఇలా ఎన్నింటి తయారీలోనో దీన్ని ఉపయోగిస్తారు. నేను రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చుకోమంటున్నా అంతే! ఇది తాజా ధోరణి కూడా కాదు. ఎన్నో దేశాలు దీన్ని ఆహారంగా తీసుకుంటున్నాయి. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో సముద్ర తీరాన ఉన్న యూరప్‌ దేశాలు ఆహార కొరత ఏర్పడినప్పుడు దీన్నే తిన్నారు. బోలెడు పోషకాలుంటాయి దీనిలో’ అంటుంది గాబ్రియేలా. ఈమెది గోవా. సముద్ర జీవులు, వాటి పరిరక్షణపై పనిచేసే కన్జర్వేషనిస్ట్‌ తను. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి బయోడైవర్సిటీ కన్జర్వేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ పూర్తిచేసింది. మంచి ఉద్యోగావకాశాలూ వచ్చాయి. కానీ వ్యాపారం.. అదీ పర్యావరణానికి హాని కలిగించనిది చేయాలన్నది ఆమె కల. 2015లో తమిళనాడులోని కోస్టల్‌ ప్రాంతంలో పరిశోధన చేస్తున్నప్పుడు సముద్ర నాచు విలువ తెలిసిందామెకు. సముద్ర జలాలను పరిరక్షించడంతోపాటు స్థానికులకూ ఉపాధి కలిగించొచ్చన్నది అర్థమయ్యాక దీన్నే వ్యాపారంగా ఎంచుకుని ‘ద గుడ్‌ ఓషన్‌’ ప్రారంభించింది.

‘అయిదేళ్లపాటు పరిశోధన చేశా. నాచు, దాని పెంపకం, పోషకాలు మొదలైనవన్నీ తెలుసుకున్నాక దీన్ని ఆహారంలో భాగం చేయడంపై అవగాహన కల్పించాలనుకున్నా. దేశంలో అయోడిన్‌ లోపం ఉన్నవారెందరో! సముద్ర తీరాల్లోని వారిలో పోషకాహార లోపాన్నీ గమనించా. ఈ కొరతలను నాచు తీర్చగలదు. అందుకే దీనిపై అవగాహన కల్పించడం ప్రారంభించా. తీరప్రాంతాల్లోని మహిళలను ఎంచుకొని నాచు సంరక్షణ, సేకరణపై అవగాహన కల్పించా. మామూలు వ్యవసాయంలా కాదిది. వీటి పెంపకంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సముద్ర జీవులకు హాని కలిగించకుండా సేకరించాలి. ప్రస్తుతం గోవా, ముంబయిల్లోని రెస్టరెంట్లు, డిస్టిల్లరీస్‌, బ్యూటీ సంస్థలతోపాటు చైనా, కొరియా, జపాన్‌ దేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలన్నది కల’ అని చెబుతోంది గాబ్రియేలా. నాచుతో సముద్ర నీరు, దానిలోని జీవుల సంరక్షణపై తన పరిశోధనలకు ఎన్నో పురస్కారాలూ అందుకుంది. 2021 బీబీసీ గ్లోబల్‌ యూత్‌ ఛాంపియన్‌. విమెన్‌ క్లైమేట్‌ కలెక్టివ్‌ ఎంపిక చేసిన 16 మంది కన్జర్వేటర్లలో తనూ ఒకరు. ‘వ్యాపారంలో లాభాల మోజులో పడి పర్యావరణ రక్షణను ఉపేక్షించే వారే ఎక్కువ. ఆ బాటలో నడవొద్దని ముందే నిర్ణయించుకున్నా. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే.. ఆరోగ్యాన్ని అందిస్తుండటం చాలా ఆనందంగా ఉంది’ అంటోన్న తన ఆలోచన నిజంగానే బాగుంది కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్