వంటింట్లో ఇవి ఉండాల్సిందే!

ఇంట్లో ఎక్కువ చిందర వందరగా ఉండే గది ఏదంటే కిచెన్‌ అనే చెప్తారంతా! ఎక్కువ వస్తువులు ఉండడం, రోజూ సర్దుకునే సమయం లేక ఎక్కడివక్కడే వదిలేయడం వల్ల వంటగది ఇలా కనిపిస్తుంటుంది.

Published : 22 Nov 2023 11:53 IST

ఇంట్లో ఎక్కువ చిందర వందరగా ఉండే గది ఏదంటే కిచెన్‌ అనే చెప్తారంతా! ఎక్కువ వస్తువులు ఉండడం, రోజూ సర్దుకునే సమయం లేక ఎక్కడివక్కడే వదిలేయడం వల్ల వంటగది ఇలా కనిపిస్తుంటుంది. అయితే కొన్ని రకాల వస్తువుల్ని వంటగదిలో ఏర్పాటుచేసుకుంటే రోజూ సర్దకపోయినా.. కిచెన్‌ను నీట్‌గా, పరిశుభ్రంగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏంటవి? తెలుసుకుందాం రండి..

స్టోరేజీ కోసం..!

వంటగదిలో నిత్యావసరాల్ని నిల్వ చేసుకోవడానికి చాలామంది తమ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ డబ్బాలు, స్టీలు కంటెయినర్లను ఉపయోగిస్తుంటారు. నిజానికి దీనివల్ల ఒక్కోసారి ఏ వస్తువు ఎక్కడ పెట్టామో అర్థం కాదు. మీరు ఇంట్లో లేనప్పుడు ఇతర కుటుంబ సభ్యులు కూడా వాటిని వెతుక్కోలేరు. కాబట్టి ఈ సమస్యను దూరం చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల స్టోరేజ్‌ కంటెయినర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాల పప్పులు, మసాలాలు, స్నాక్స్‌.. ఇలా వేటికవే ఒకే కంటెయినర్లో అమర్చుకునేలా సెపరేట్‌ ర్యాక్స్‌ ఉన్నవి కూడా దొరుకుతున్నాయి. వంటగదిలో స్థలాన్ని ఆదా చేసేలా వాల్‌మౌంటెడ్‌ తరహావీ లభ్యమవుతున్నాయి. కాబట్టి మీ అవసరాల్ని బట్టి ఆయా స్టోరేజీ కంటెయినర్లను ఎంచుకోవచ్చు. పైగా వీటిని పదే పదే సర్దాల్సిన పని కూడా ఉండదు. తద్వారా వంటగది కూడా నీట్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది.

వాటిని తగిలించుకోవడానికి..!

మనం వంట చేసే క్రమంలో ఆప్రాన్స్‌, గ్లౌజులు, అవెన్‌ గ్లౌజులు, కిచెన్‌ టవల్స్‌, న్యాప్‌కిన్స్‌.. ఇలా ఎన్నెన్నో వస్తువులు ఉపయోగిస్తాం. తీరా వంట పూర్తయ్యాక వాటిని ఎక్కడివక్కడే వదిలేస్తుంటాం. తద్వారా వంటగది చిందరవందరగా కనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే వంటగదిలో ఓ గోడకు ‘కిచెన్‌ లినెన్‌ హోల్డర్‌’ను అమర్చుకుంటే సరి. దానికి ఉండే హుక్స్‌కి ఈ వస్తువులన్నీ తగిలిస్తే నీట్‌గా ఉంటుంది. అలాగే వాడిన వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు.

అవన్నీ ఒకే చోట..!

వంట గదిలో కత్తులు, స్పూన్లు, గరిటెలు, ఫోర్క్‌లు.. ఎక్కువగా వాడుతుంటాం. ఇక వీటి స్టోరేజ్‌ విషయానికొస్తే.. ఏ ర్యాక్‌లోనో, స్టాండ్‌లోనో, కడిగాక డిష్‌ డ్రెయినర్‌లోనో వేసేస్తుంటాం. సమయానికి అవి దొరకవు.. ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల ఒక్కోసారి అవి మిస్సవుతుంటాయి కూడా! ఈ సమస్యకు ‘కౌంటర్‌ ఆర్గనైజర్‌’ చక్కటి పరిష్కారం అని చెప్పచ్చు. విభిన్న మోడల్స్‌లో దొరికే వీటిలో విడివిడిగా ర్యాక్‌లుంటాయి. వాటిలో ఒక దాంట్లో స్పూన్లు, మరో దాంట్లో ఫోర్క్‌లు, ఇంకోదాంట్లో కత్తులు.. ఇలా అమర్చుకుంటే సులభంగా దొరుకుతాయి. కిచెన్‌ కూడా నీట్‌గా ఉంటుంది. అలాగే వీటిలోనూ కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై అమర్చుకునేవి కాకుండా గోడకు వేలాడదీసేవి (వాల్‌ మౌంటెడ్‌ తరహాలో) కూడా లభిస్తున్నాయి.

లైనర్స్‌తో మేలు!

వంటగదిలో అరల్ని శుభ్రం చేయడమంటే పెద్ద పని. ఎందుకంటే వంట చేసే క్రమంలో జిడ్డు అరల్లో పేరుకుపోతుంది. అది దుమ్మును త్వరగా ఆకర్షించి.. తక్కువ సమయంలోనే అవి మురికిగా మారిపోతాయి. ‘షెల్ఫ్‌ లైనర్స్‌’తో ఈ సమస్య ఉండదని చెప్పచ్చు. షీట్‌ మాదిరిగా ఉండే వీటిని అరల సైజును బట్టి కత్తిరించి అమర్చితే.. చూడ్డానికి అందంగా కనిపిస్తుంది.. అలాగే దుమ్ము పేరుకుపోయినా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్