బ్రా వేసుకోకపోతే వక్షోజాలు సాగుతాయా?

వక్షోజాల్ని తీరైన ఆకృతిలో కనిపించేలా చేయడంలో బ్రా పాత్ర కీలకం! అయితే వీటిని ధరించే విషయంలో కొంతమందిలో కొన్ని రకాల సందేహాలుంటాయి. బ్రా వేసుకోకపోతే వక్షోజాలు సాగుతాయని, వేసుకుంటే వీటి పెరుగుదల ఆగిపోతుందని, కొన్ని రకాల బ్రాలు రొమ్ము.....

Published : 08 Nov 2022 13:21 IST

వక్షోజాల్ని తీరైన ఆకృతిలో కనిపించేలా చేయడంలో బ్రా పాత్ర కీలకం! అయితే వీటిని ధరించే విషయంలో కొంతమందిలో కొన్ని రకాల సందేహాలుంటాయి. బ్రా వేసుకోకపోతే వక్షోజాలు సాగుతాయని, వేసుకుంటే వీటి పెరుగుదల ఆగిపోతుందని, కొన్ని రకాల బ్రాలు రొమ్ము క్యాన్సర్‌కు కారణమవుతాయని.. ఇలా ఒక్కొక్కరి మనసులో ఒక్కో రకమైన ప్రశ్న తలెత్తుతుంటుంది. మరి, వీటిలో నిజమెంత? తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి!

నలుపు రంగు బ్రా వల్ల క్యాన్సరొస్తుంది!

కొంతమంది నలుపు రంగును ఇష్టపడరు. ఎందుకంటే ఈ రంగు సూర్మరశ్మిని ఎక్కువగా ఆకర్షించి ఆరోగ్య, చర్మ సమస్యల్ని తెచ్చిపెడుతుందేమోనని భయపడుతుంటారు. బ్రా విషయంలోనూ వారిలో ఇలాంటి సందేహమే ఉంటుంది. నలుపుతో పాటు ముదురు రంగు బ్రాలు ధరించడం వల్ల వేడి ఎక్కువగా శోషించుకొని.. తద్వారా రొమ్ము క్యాన్సర్‌ బారిన పడతామేమోనని భయపడుతుంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని చెబుతున్నారు నిపుణులు. బ్రా రంగుకు, రొమ్ము క్యాన్సర్‌కు సంబంధం ఉందన్న విషయం ఎక్కడా నిరూపితం కాలేదంటున్నారు పరిశోధకులు. ఇవే కాదు.. బిగుతుగా ఉండేవి, అండర్‌వైర్‌ బ్రాలు, ఇవి ధరించి నిద్ర పోవడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్‌ వస్తుందనేది అపోహే అంటున్నారు. కాబట్టి నిజానిజాలు తెలుసుకోకుండా అనవసరంగా ఆందోళన చెందడం మాని.. సౌకర్యవంతమైన బ్రాలు ధరించడం అన్ని విధాలా మంచిదంటున్నారు నిపుణులు.

బ్రా వేసుకోకపోతే వక్షోజాలు సాగుతాయి!

రొమ్ము కణజాలం సహజసిద్ధంగానే సాగే గుణం కలిగి ఉంటుంది. అందుకే గర్భం ధరించినప్పుడు, పాలిచ్చే సమయంలో ఈ కణజాలం సాగి వక్షోజాలు పెద్దవిగా కనిపిస్తాయి. అదే మిగతా సమయాల్లో సాధారణ స్థితికి చేరుకుంటాయి. అయితే ఈ విషయంలో సరైన అవగాహన లేని వారు బ్రా వేసుకోకపోతే వక్షోజాలు సాగుతాయని, మరింత పెద్దవిగా కనిపిస్తాయని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదని చెబుతున్నారు నిపుణులు. బ్రా ధరించడానికి, రొమ్ముల పరిమాణం పెరగడానికి సంబంధం లేదని, ఈ లోదుస్తులు ధరించడం-ధరించకపోవడం అనేది వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇక బరువు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు వీటి పరిమాణాల్లో హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలూ లేకపోలేదంటున్నారు.

బ్రాకు, నడుం నొప్పికి సంబంధం ఉంది!

వక్షోజాల ఆకృతికే కాదు.. బ్రా ధరించడం వల్ల శరీర భంగిమ మెరుగుపడి నడుం నొప్పి రాకుండా జాగ్రత్తపడచ్చనుకుంటారు చాలామంది. అయితే ఇది కూడా అపోహే అంటున్నారు నిపుణులు. బ్రా వేసుకోవడం వల్ల శరీర భంగిమలో ఎలాంటి మార్పులు రావని, నడుం నొప్పి రాదన్నది కూడా పూర్తిగా అవాస్తవమేనని ఓ పరిశోధనలో భాగంగా నిపుణులు తేల్చారు. అంతేకాదు.. సరైన సైజు బ్రా సౌకర్యాన్నిస్తుందే తప్ప దీన్ని ధరించడం వల్ల నడుం నొప్పి రాకుండా అడ్డుకోవచ్చన్న ఆధారాలేవీ లేవంటున్నారు. ఒకవేళ బ్రా కారణంగా నడుం నొప్పి వస్తే మీరు మీ వక్షోజాల ఆకృతికి సరిపడే సైజు బ్రా ధరించలేదని అర్థమంటున్నారు. కాబట్టి ఇది పూర్తిగా వక్షోజాల ఆకృతి, సౌందర్యాన్ని ఇనుమడింపజేసేందుకే ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అన్ని వేళలా బ్రా ధరించాలి!

రోజంతా నిరంతరాయంగా బ్రా ధరించడం వల్ల వక్షోజాల్ని తీరైన ఆకృతిలో కనిపించేలా చేయచ్చనుకుంటారు చాలామంది. అయితే దీనివల్ల వక్షోజాల ఆకృతేమో గానీ అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. అసౌకర్యంగానూ అనిపిస్తుందంటున్నారు. ముఖ్యంగా రోజంతా బ్రా ధరించడం వల్ల వక్షోజాలకు గాలి తగలదు. తద్వారా అక్కడ చెమట ఎక్కువగా వస్తుంది. తద్వారా చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. ఆ భాగంలో అలర్జీ, దురద, మృతకణాలు ఏర్పడడం.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి అన్ని వేళలా బ్రా ధరించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అలాగే రాత్రి పడుకునేటప్పుడు కూడా బ్రా లేకుండా నిద్ర పోవడమే వక్షోజాల ఆరోగ్యానికి మేలని చెబుతున్నారు.

వీటితో పాటు వక్షోజాల ఆకృతి, సైజును బట్టి సరైన సైజు బ్రా ఎంచుకోవడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి. అప్పుడే బ్రా వేసుకుంటే సౌకర్యంగా ఉండడంతో పాటు ఇతర ఇబ్బందులు ఎదురవకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్