చిన్న వయసులోనే జాబ్ కొట్టేశారా?

చిన్న వయసులో ఉద్యోగమొస్తే ఆ సంతృప్తే వేరు. ఈ క్రమంలో 20-25 ఏళ్లకే తమకు ఆర్థిక స్వేచ్ఛ లభించిందని, ఎవరిపైనా ఆధారపడకుండా తమ కనీస అవసరాలు తీర్చుకోవచ్చని సంబరపడిపోతుంటారు చాలామంది. ఈ అత్యుత్సాహంతో తెలిసోతెలియకో కొన్ని పొరపాట్లు కూడా చేస్తుంటారు....

Published : 24 Feb 2024 12:45 IST

చిన్న వయసులో ఉద్యోగమొస్తే ఆ సంతృప్తే వేరు. ఈ క్రమంలో 20-25 ఏళ్లకే తమకు ఆర్థిక స్వేచ్ఛ లభించిందని, ఎవరిపైనా ఆధారపడకుండా తమ కనీస అవసరాలు తీర్చుకోవచ్చని సంబరపడిపోతుంటారు చాలామంది. ఈ అత్యుత్సాహంతో తెలిసోతెలియకో కొన్ని పొరపాట్లు కూడా చేస్తుంటారు. ఫలితంగా భవిష్యత్తులో తమ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. అలా జరగకూడదంటే ఆ పొరపాట్లేంటో తెలుసుకొని సరిదిద్దుకోమంటున్నారు.

వీటిలో మీరు ఏ టైపు?
కొంతమందికి ఇటు చదువు పూర్తి కాగానే.. అటు ఉద్యోగమొచ్చేస్తుంటుంది. ఇలా చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించిన వారిలో రెండు రకాలుంటారు. మొదటి రకం వాళ్లు - అతిగా అంకితభావం ప్రదర్శిస్తూ అన్ని పనులు తామే పూర్తిచేస్తామన్న అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. రెండో రకం వ్యక్తులు - వచ్చిన ఉద్యోగాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడంలో నిమగ్నమైపోయి కెరీర్‌ అభివృద్ధిని విస్మరిస్తుంటారు. నిజానికి ఈ రెండూ పొరపాటే అంటున్నారు నిపుణులు. కాబట్టి అత్యుత్సాహం మాని.. మనకు అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేయడం, ఇటు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. అటు కొత్త అవకాశాల్ని అందుకోవడం.. ఇలా రెండూ బ్యాలన్స్‌ చేసినప్పుడే చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చినందుకు పూర్తి సార్థకత దక్కుతుందంటున్నారు నిపుణులు. మరోవైపు ఉద్యోగంలోనూ ఉన్నతి సాధించచ్చంటున్నారు.

అయినా.. అవకాశాన్ని వదులుకోవద్దు!
పలు కారణాల రీత్యా చిన్న వయసులో ఏదో ఒక ఉద్యోగంలో చేరే వారు కొందరైతే.. తాము లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగం సాధిస్తుంటారు మరికొందరు. దీంతో ‘నేను అనుకున్న ఉద్యోగం వచ్చింది.. ప్యాకేజీ బాగానే వస్తుంది.. ఈ జీవితానికి ఇది చాలు’ అంటూ అక్కడితోనే సంతృప్తి పడుతుంటారు. దాంతో ముందు ముందు మంచి అవకాశాలు వచ్చినా వదులుకునే వారూ లేకపోలేదు. ఇలా అందివచ్చిన అవకాశాన్ని కాదనుకుంటే.. కెరీర్‌లో అభివృద్ధి సాధించలేమంటున్నారు నిపుణులు. కాబట్టి నిత్య విద్యార్థిగా ఉంటూ.. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు కొత్త అవకాశాల్ని అందుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలంటున్నారు. అప్పుడే కెరీర్‌లో ఉన్నతి సాధించచ్చు.

ఆ రుజువులుండాల్సిందే!
చిన్న వయసులో ఉద్యోగం రావడంతో పాటు జాబ్‌లో చేరిన కొత్తలో.. కెరీర్‌కు సంబంధించిన పూర్తి అవగాహన చాలామందిలో ఉండకపోవచ్చు. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా తమ సృజనాత్మక ఆలోచనలు, పనితీరు, చేరుకున్న లక్ష్యాలకు సంబంధించిన వివరాలన్నీ.. తమ బృంద సభ్యులు, బాస్‌కు వివరిస్తుంటారు. అయితే ఇలా నోటి మాటగా చెప్పడం కంటే ప్రతిదీ ఈ-మెయిల్‌ రూపంలో వారికి పంపించడం, వాటికి సంబంధించిన సాఫ్ట్‌కాపీలు భద్రపరుచుకోవడం.. వంటివి చేస్తే మిమ్మల్ని మీరు నిరూపించుకోవచ్చు. ప్రతికూల సమయం ఎదురైనప్పుడు, పనికి తగ్గ ప్రతిఫలం దక్కకపోయినా ఈ రుజువులే మీ ఉద్యోగానికి భరోసా కల్పిస్తాయి. పైగా మీరు ఇలా సిన్సియర్‌గా పనిచేస్తే.. భవిష్యత్తులో ఉన్నత అవకాశాలూ మీ తలుపు తడతాయి.

పొదుపు మంత్రం!
చిన్న వయసులో ఉద్యోగం వచ్చిన వారిలో చాలామందికి ఒక రకమైన సంతోషం, సంతృప్తి ఉంటాయి. దీనికి కారణం ఆర్థిక స్వేచ్ఛ. తాము డబ్బు సంపాదిస్తున్నాం.. ఎంత ఖర్చు పెట్టినా అడిగేవారు ఎవరూ ఉండరన్న అత్యుత్సాహంతో వృథా ఖర్చులు చేస్తుంటారు కొందరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. ఈ ఆలోచన మానుకొని.. వచ్చే ఆదాయంలో నుంచి ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఈ క్రమంలో చిన్న వయసులో ఉద్యోగంలో చేరడం వల్ల.. ఆ వయసులో ఇతర బాధ్యతలేవీ ఉండవు కాబట్టి పొదుపు-మదుపు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ముందు నుంచే ఇలాంటి సేవింగ్స్‌ చేయడం, అత్యవసర నిధి సమకూర్చుకోవడం.. వంటివి చేస్తే భవిష్యత్తుపై భరోసా ఉంటుంది. ఇలా డబ్బు నిర్వహణ బాధ్యతలు పెరిగితే.. ఆటోమేటిక్‌గా కెరీర్ అభివృద్ధి పైనా దృష్టి సారించగలుగుతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్