ఇరవైల్లో.. ఇవి ముఖ్యం!

జీవితంలో ప్రతి దశా ప్రత్యేకమైనదే! ముఖ్యంగా 20-29 ఏళ్ల వయసులో కొన్ని కీలక సంఘటనలు జరుగుతుంటాయి. చదువు, ఉద్యోగం, వివాహం.. మరికొందరైతే పిల్లల్ని కూడా కంటుంటారు. అయితే ఇరవైల్లో ఉన్న వారు కొన్ని అంశాల్లో మాత్రం ఆచితూచి అడుగేయాలంటున్నారు నిపుణులు.

Published : 15 Dec 2023 12:25 IST

జీవితంలో ప్రతి దశా ప్రత్యేకమైనదే! ముఖ్యంగా 20-29 ఏళ్ల వయసులో కొన్ని కీలక సంఘటనలు జరుగుతుంటాయి. చదువు, ఉద్యోగం, వివాహం.. మరికొందరైతే పిల్లల్ని కూడా కంటుంటారు. అయితే ఇరవైల్లో ఉన్న వారు కొన్ని అంశాల్లో మాత్రం ఆచితూచి అడుగేయాలంటున్నారు నిపుణులు.

పొదుపు తప్పనిసరి..

ప్రస్తుతం ఇరవైల్లో ఉన్నప్పుడే చాలామందికి ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతో చిన్న వయసులోనే జీవితంలో స్థిరపడుతున్నారు. అయితే కొంతమంది ‘ఇప్పట్నుంచే డబ్బు పొదుపేంటి? కొన్నాళ్లు ఎంజాయ్ చేద్దాం..’ అన్న ఆలోచనతో పొదుపును పక్కన పెట్టేస్తుంటారు. ఈ నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చంటున్నారు నిపుణులు. అందుకే ఇరవైల్లో ఉన్నప్పుడే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవితంపై పూర్తి అవగాహన వస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యల్లేకుండా జాగ్రత్తపడచ్చు.

ఇలాంటి స్నేహితులు!

ఉద్యోగాల పేరుతో ఇరవైల్లోనే జీవితంలో స్థిరపడే సరికి కొత్త అనుభూతి పొందుతుంటారు చాలామంది. ఈ క్రమంలో ఆఫీస్‌లో, కెరీర్‌ పరంగా కొత్త వ్యక్తులు పరిచయమవుతుంటారు. వారితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఈ స్నేహాలు మనల్ని సానుకూలంగా ముందుకు నడిపించేవైతే పర్లేదు. కానీ మనల్ని తప్పుదోవ పట్టించేవైతే ఆదిలోనే జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. అదేవిధంగా మీ బలాబలాలు, బలహీనతలు, మంచిచెడ్డలు.. తదితర విషయాల గురించి ఆలోచించే వారితో స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటే వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రేమా? ఆకర్షణా?

ఇరవైల్లోనే చాలామంది ప్రేమలో పడుతుంటారు. అది ప్రేమో, ఆకర్షణో తెలియక తప్పటడుగు వేసే వారూ లేకపోలేదు. కాబట్టి ఈ విషయంలో అవగాహన పెంచుకోవడం ముఖ్యం. అలాగే కొంతమంది ప్రేమ విషయంలో పలు సమస్యలు ఎదురైనా.. వారితోనే జీవితం కొనసాగించడానికి ఆసక్తి చూపుతుంటారు. ‘పెళ్లయ్యాక వాళ్లే మారతారులే!’ అన్న ఆలోచనతో వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటారు. ఇలాంటి తప్పటడుగులే వేయద్దంటున్నారు నిపుణులు. ఇలాంటి చెడు నిర్ణయాల వల్ల జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. అందుకే ఇలాంటి చేటు చేసే బంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటి వాళ్లనే కాదు.. వాళ్ల జ్ఞాపకాల్నీ మదిలో నుంచి తొలగిస్తే జీవితంలో పాజిటివిటీతో ముందుకెళ్లచ్చు.

ఆసక్తికి ప్రాధాన్యం!

కొంతమందికి ఇరవైల్లో ఉన్నప్పుడు తమకు ఆసక్తి ఉన్న రంగంలోకి అడుగు పెట్టాలా? లేక డబ్బు ఎక్కువగా సంపాదించగలిగే రంగంలోకి వెళ్లాలా? అన్న సందేహం కలుగుతుంటుంది. ఈ క్రమంలో డబ్బుకు ఓటేసేవారే ఎక్కువ మంది ఉండచ్చు. కానీ డబ్బు వస్తుంది కదా.. అని ప్రస్తుతం ఆ కెరీర్‌ని ఎంచుకున్నా.. భవిష్యత్తులో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. చేసే ఉద్యోగంపై ఆసక్తీ తగ్గచ్చు. కాబట్టి అత్యాశకు పోకుండా, ఆర్జనతో సంబంధం లేకుండా.. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుంటే కెరీర్‌లో దూసుకుపోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్