ఈ చెట్టు తెలుసా?

మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్ద చెట్ల గురించి చెప్పండి. గుర్తుకు రావడం లేదు కదూ! నగరాల్లో నివసించే వారికైతే... అసలు ఉన్నాయా అన్న సందేహమూ కలుగుతుంది. ఇంత చిన్నవిషయమే తెలియకపోతే... పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో మాత్రం ఎలా తెలుస్తుంది అంటారు అశ్వతి జీరోమ్‌.

Published : 05 Jun 2024 14:10 IST

మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పెద్ద చెట్ల గురించి చెప్పండి. గుర్తుకు రావడం లేదు కదూ! నగరాల్లో నివసించే వారికైతే... అసలు ఉన్నాయా అన్న సందేహమూ కలుగుతుంది. ఇంత చిన్నవిషయమే తెలియకపోతే... పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో మాత్రం ఎలా తెలుస్తుంది అంటారు అశ్వతి జీరోమ్‌. తను ఆ జాబితాను తయారు చేయడమే కాదు... పిల్లలకీ, పెద్దవాళ్లకీ ప్రకృతిని పరిచయం చేస్తున్నారామె. ఎలాగంటే...

చిన్నప్పటి నుంచీ పచ్చని మొక్కల మధ్యే పెరిగారు అశ్వతి. ఆ వయసులోనే మొక్కల పేర్లు వాటి శాస్త్రీయనామాలతో సహా చెప్పగలిగేవారట. వాళ్లమ్మ బోటనీ గ్రాడ్యుయేట్‌. ప్రతి మొక్క గురించీ ఆమె కథలుగా చెప్పేవారట. ఇక సెలవులకు అమ్మమ్మ వాళ్ల ఊరెళితే ఆవిడ పిల్లలందరికీ ఒక్కో చెట్టు బాధ్యత అప్పగించేవారట. దాని పెంపకంలో జాగ్రత్తలన్నీ అర్థమయ్యేలా చెప్పేవారట. అలా అశ్వతికి పచ్చదనంపై ప్రేమ ఏర్పడింది. ఈమెది కొచ్చి. హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌లో పీజీ చేసి, కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. 2018లో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫిఫ్టీట్రీస్‌’ పేరుతో ఒక ఛాలెంజ్‌ చూశారామె. ఇందులో చెట్లతో ఫొటో దిగి, వాటి గురించి కొన్ని వాక్యాలు రాయాలి. అది ఆమెను బాగా ఆకట్టుకుంది. పైగా పరిచయం ఉన్న పనే. ఎక్కడ చెట్టు కనిపించినా ఫొటో దిగి, పోస్ట్‌ చేసేవారు. తెలియని వాటి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడమే కాదు, ఒక్కో కాలంలో వాటిలో వచ్చే మార్పులు, ఏ కాలాల్లో పూలు పూస్తాయో, కాయలు కాస్తాయో కూడా తెలుసుకునేవారు.

ఓరోజు తన దగ్గరున్న సమాచారానికి ఆమే ఆశ్చర్యపోయారట. పుస్తకాలు నిండిపోవడమే కాదు, ల్యాప్‌టాప్‌లోనూ బోలెడు ఫైళ్లు, ఫొటోలు. ఈ సమాచారం అందరికీ అందించాలి అనుకున్నారామె. దీంతో లాక్‌డౌన్‌లో ‘ట్రీస్‌ ఆఫ్‌ కొచ్చిన్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పేజీ ఏర్పాటు చేసి, ఆ వివరాలను అందులో ఉంచుతున్నారు. కొచ్చిలో ఉన్న ప్రతి చెట్టు గురించీ ఆమె చెప్పేయగలరు. అంతేకాదు, అవి ఎక్కడ్నుంచి వచ్చాయో, వాటి చరిత్రనూ సేకరించి చెబుతారీమె. మొక్కలు, పర్యావరణంపై అవగాహన కలిగించడానికి ‘నో యువర్‌ నైబర్‌హుడ్‌’, ట్రీ వాక్, పార్క్‌ వాక్‌ వంటివీ నిర్వహిస్తున్నారు అశ్వతి. పిల్లలు, పెద్దలను అలా ప్రకృతిలోకి తీసుకెళ్లి మొక్కలు, చెట్ల వివరాలను చెబుతారు. ప్రకృతిలో సేదదీరేలా చేస్తున్నారు. ‘నేను ముంబయిలో పనిచేశా. అయిదేళ్ల తరవాత కొచ్చికి వస్తే, నగర రూపమే మారిపోయింది. చెట్లు, వృక్షాల స్థానంలో రోడ్లు, బిల్డింగులు, వంతెనలు వగైరా వచ్చాయి. అభివృద్ధి మంచిదే కానీ... అలా చెట్లను నరుకుతూ పోతే కాలుష్యం పెరిగి, మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. దీనిపై అవగాహన ప్రతి ఒక్కరిలోనూ వచ్చినప్పుడే మార్పు సాధ్యమవుతుంది అనిపించింది. అందుకే వాక్‌లు నిర్వహిస్తున్నా’ అంటోన్న అశ్వతి ప్రయత్నం అభినందనీయమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్