Jasmine Larsen: జుట్టుతో కోట్లు సంపాదిస్తోంది!

మంచి చదువు, ఉన్నతోద్యోగం, లక్షల కొద్దీ జీతం.. కెరీర్‌లో ఇంతకంటే ఇంకేమీ కోరుకోం. అయితే ఇలా ఉద్యోగం చేసుకుంటూనే సౌందర్య పరిరక్షణపై దృష్టి పెట్టడం మనలో చాలామందికి అలవాటు. కానీ కేశ సంరక్షణ కోసం ఏకంగా లక్షలు ఆర్జించే....

Published : 25 May 2023 17:02 IST

(Photos: Instagram)

మంచి చదువు, ఉన్నతోద్యోగం, లక్షల కొద్దీ జీతం.. కెరీర్‌లో ఇంతకంటే ఇంకేమీ కోరుకోం. అయితే ఇలా ఉద్యోగం చేసుకుంటూనే సౌందర్య పరిరక్షణపై దృష్టి పెట్టడం మనలో చాలామందికి అలవాటు. కానీ కేశ సంరక్షణ కోసం ఏకంగా లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే తృణ ప్రాయంగా వదిలేసుకుందో అమ్మాయి. ‘ఇదేం పైత్యం?’ అనుకోకండి.. ఎందుకంటే ఏ జుట్టు కోసం తాను బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలేసుకుందో అప్పుడు అదే జుట్టుతో కోట్లు సంపాదిస్తోంది. వ్యాపారవేత్తగా, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అదెంతలా అంటే.. తన జుట్టు సౌందర్యానికి ముగ్ధులై.. అందమైన అబ్బాయిలెందరో పెళ్లి ప్రతిపాదనలతో క్యూ కట్టేంతగా! మరి, ఇంతకీ ఎవరామె? అసలు ఆమె జుట్టుకు ఎందుకంత పాపులారిటీ? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

జాస్మిన్‌ లార్సెన్‌ది ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ నగరం. ‘లండన్స్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ’లో బయోకెమిస్ట్రీలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. కొన్నేళ్ల పాటు ఎడిటర్‌గా పనిచేసింది. నచ్చిన ఉద్యోగం, నెల తిరిగే సరికి లక్షల కొద్దీ జీతం.. అందుకున్నప్పటికీ తన కేశ సంరక్షణ పైనే ఎక్కువ దృష్టి పెట్టేదామె. ఎందుకంటే తన జుట్టంటే తనకు అంత ఇష్టం మరి! 2017 నుంచి కట్‌ చేయకుండా తన జుట్టును పెంచుతోందామె. ప్రస్తుతం 4’3’’ పొడవుతో, ఒత్తుగా, ఎరుపు రంగులో సిల్కీగా ఉన్న తన జుట్టు కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది జాస్మిన్.

అప్పుడు బాధపడేదాన్ని!

‘నా జుట్టు చిన్నప్పట్నుంచీ పొడవుగా, ఒత్తుగా ఉండేది. అందుకే నా జుట్టంటే నాకు చాలా ఇష్టం. అయితే ఒక్కోసారి జుట్టు చివర్లు కట్ చేసేటప్పుడు బాధగా అనిపించేది. ఇక పెరిగే కొద్దీ కేశ సంరక్షణపై మరింత దృష్టి పెట్టాను. 2017 తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా నా జుట్టును కట్‌ చేయలేదు. అయితే నా ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకున్న ప్రతిసారీ ‘జుట్టు బాగుందం’టూ కామెంట్లు వచ్చేవి. నా హెయిర్‌కేర్‌ టిప్స్‌ తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపేవారు. ఈ ఆలోచనే నేను ఉద్యోగం వదిలి జుట్టు సంరక్షణపై దృష్టి పెట్టేందుకు కారణమైంది. పూర్తి స్థాయి హెయిర్‌ ఇన్ఫ్లుయెన్సర్‌గా మారదామన్న ఉద్దేశంతోనే ఉద్యోగం వదిలేశా. నా జుట్టు సంరక్షణకు సంబంధించిన వీడియోలు, హెయిర్‌స్టైల్‌ వీడియోలు.. వంటివి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో పాటు.. 2020లో ‘లార్స్‌ హెయిర్‌కేర్‌’ పేరుతో ఓ హెయిర్‌ యాక్సెసరీస్‌ సంస్థనూ ప్రారంభించా. ఇందులో భాగంగా యాక్సెసరీస్‌తో పాటు జుట్టు సంరక్షణ ఉత్పత్తులు, జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడే సిల్క్‌/సిల్కీ శాటిన్‌ పిల్లో కవర్లు.. వంటివెన్నో అందుబాటులోకి తెస్తున్నాం. కేశ సంరక్షణే లక్ష్యంగా ఈ బ్రాండ్‌ని ప్రారంభించా..’ అంటూ చెప్పుకొచ్చింది జాస్మిన్.

అమ్మ వల్లే.. ఇంత పొడవు!

అయితే తన జుట్టు ఇంత పొడవుగా, ఒత్తుగా పెరగడానికి తాను తీసుకొనే జాగ్రత్తలే కాదు.. చిన్నతనంలో తన తల్లి కూడా ఈ విషయంలో పలు చిట్కాలు పాటించేదని చెబుతోంది జాస్మిన్‌. ‘నా చిన్నతనంలో స్కూలుకు జుట్టు వదిలేసుకొని వెళ్లాలన్న కోరిక ఉండేది.. అప్పుడప్పుడూ కొన్ని రకాల హెయిర్‌స్టైల్స్‌ వేయమని అమ్మను కోరేదాన్ని. కానీ తాను మాత్రం ఎప్పుడూ ఒకే రకమైన హెయిర్‌స్టైల్‌ వేసేది. అదే ఇంగ్లిష్‌ బ్రెయిడ్‌/స్టెప్‌ జడ. ఎందుకిలా అని అమ్మనడిగితే.. జుట్టు ఆరోగ్యానికి ఇదే మంచిదని చెప్పేది. కొన్నాళ్లకు అదే నా ఫేవరెట్‌ హెయిర్‌స్టైల్‌గా మారిపోయింది. బహుశా.. అప్పుడు అమ్మ పాటించిన ఆ చిట్కాల వల్లే ఇప్పుడు నా జుట్టు ఇంత పొడవుగా, ఒత్తుగా ఉందేమో అనిపిస్తుంటుంది. ఇక నా జుట్టు సంరక్షణ కోసం సిలికాన్‌ రహిత హెయిర్‌ ఆయిల్‌ వాడుతున్నా. అలాగే హెయిర్‌మాస్క్‌ వేసుకోవడం, వారానికోసారి లేదా రెండుసార్లు తలస్నానం చేయడం, కండిషనర్‌ రాసుకోవడం, స్టైలింగ్‌ చికిత్సలు.. వంటివన్నీ నా హెయిర్‌కేర్‌ రొటీన్‌లో భాగమే! ఇక మైక్రోఫైబర్‌ టవల్‌, స్కాల్ప్‌ మసాజర్‌.. వంటివి నా కుదుళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నాయి..’ అంటూ తన పొడవాటి జుట్టు వెనకున్న రహస్యాల్ని పంచుకుందీ ఇంగ్లండ్ రూపంజెల్.

పెళ్లి సంబంధాలొస్తున్నాయ్‌.. కానీ!

తన పొడవాటి జుట్టుతో ఇన్‌స్టాలో లక్ష మందికి పైగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న జాస్మిన్.. ఎంతోమంది అబ్బాయిల నుంచి పెళ్లి ప్రతిపాదనలు కూడా వస్తున్నాయంటోంది.

‘నేను జుట్టు సంరక్షణ కోసం ఉద్యోగం వదులుకున్న తొలినాళ్లలో చాలామంది నుంచి విమర్శలు ఎదుర్కొన్నా. అయితే అప్పుడలా అన్న వారే ఇప్పుడు కేశ సంరక్షణ గురించిన చిట్కాలు, సలహాలు అడుగుతుంటే సంతోషంగా అనిపిస్తోంది. పొడవాటి జుట్టు మన ఆరోగ్యాన్ని, అందాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకే ఉద్యోగం వదులుకున్నా నేను బాధపడలేదు. పైగా ఇప్పుడు అంతకంటే ఎక్కువగా సంపాదిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా చాలామంది నా జుట్టు సంరక్షణ రహస్యాలు అడుగుతుంటారు. మరికొంతమంది నా జుట్టు రంగు గురించి ప్రశ్నిస్తుంటారు. అలాంటివారందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నా కేశ సంరక్షణ కోసం నేను వాడే ప్రతి ఉత్పత్తి సహజసిద్ధమైనదే! అలాగే నా జుట్టు రంగు కూడా సహజసిద్ధంగా వచ్చిందే! నా సోషల్‌ మీడియా ఫాలోవర్లలో అబ్బాయిలూ ఎక్కువే! నా జుట్టు అందానికి ముగ్ధులైన వారు నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదిస్తున్నారు. మరికొంతమంది.. నా జుట్టు కత్తిరించి వారికి పంపమని డబ్బు కూడా ఆఫర్‌ చేస్తున్నారు. ఇవేవీ నేను పట్టించుకోవట్లేదు.. ప్రస్తుతం నా దృష్టంతా నా జుట్టు సంరక్షణ, నా వ్యాపారం పైనే పెట్టాను..’ అంటోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్