అందుకే చిన్న వయసులోనే ‘హీరో’లయ్యారు..!

పర్యావరణ పరిరక్షణ.. ఈ అంశం తెరమీదకొచ్చిన ప్రతిసారీ మాటలతోనే సరిపెట్టుకుంటారు చాలామంది. కానీ చేతల్లో చూపినప్పుడే ఇది సాధ్యమవుతుందంటున్నారు కొందరు యువ హీరోలు.

Published : 19 Aug 2023 12:10 IST

(Photos: Instagram)

పర్యావరణ పరిరక్షణ.. ఈ అంశం తెరమీదకొచ్చిన ప్రతిసారీ మాటలతోనే సరిపెట్టుకుంటారు చాలామంది. కానీ చేతల్లో చూపినప్పుడే ఇది సాధ్యమవుతుందంటున్నారు కొందరు యువ హీరోలు. బడికెళ్లే వయసులోనే ప్రకృతిని, పచ్చదనాన్ని కాపాడుతూ.. తర్వాతి తరాల వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ ముందు చూపే వీరిని ఈ ఏడాది ‘అంతర్జాతీయ యువ ఎకో-హీరో అవార్డు’ గెలుచుకునేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డుకు ఎంపికైన 17 మంది యువ ఎకో వారియర్స్‌లో ఐదుగురు భారతీయులున్నారు. వారిలో ముగ్గురు అమ్మాయిలు కావడం విశేషం. మరి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీరు చేస్తోన్న కృషి ఏంటో తెలుసుకుందాం రండి..

పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తోన్న 8-16 ఏళ్ల వయసున్న బాలబాలికలు, యువతీయువకుల్ని గుర్తించి.. ఏటా ‘అంతర్జాతీయ యువ ఎకో-హీరో అవార్డులు’ అందిస్తుంటుంది ‘యాక్షన్‌ ఫర్‌ నేచర్‌’ అనే స్వచ్ఛంద సంస్థ. అమెరికాకు చెందిన ఈ ఎన్జీవో ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 17 మందిని ఈ పురస్కారం కోసం ఎంపిక చేసింది. వారిలో మన దేశం నుంచి ఐదుగురు చోటు దక్కించుకోగా.. అందులో ముగ్గురు అమ్మాయిలున్నారు.


మొక్కల ప్రేమికురాలు

నాలుగేళ్ల వయసున్న చిన్నారులు బొమ్మల్ని ఇష్టపడతారు. కానీ మీరట్‌కు చెందిన ఐహా దీక్షిత్‌ ఇదే వయసులో మొక్కలకు ఆకర్షితురాలైంది. అప్పట్నుంచి మొక్కలు నాటడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఐహా.. మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమంటోంది. ఇలా తన ఇంటి చుట్టూ, స్కూల్లో మొక్కలు నాటుతూ ఎంతోమంది చిన్నారుల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈ క్రమంలోనే మరికొందరు పిల్లలు ఆమెతో కలిసి మొక్కలు నాటడానికి ముందుకు రావడంతో.. ‘గ్రీన్‌ ఐహా స్మైల్‌ ఫౌండేషన్‌’ను స్థాపించిందామె. ఈ వేదికగా ప్రతి ఆదివారం తన బృందంతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతోన్న ఐహా.. ఇప్పటివరకు 275 ఆదివారాల్లో సుమారు 20 వేలకు పైగా మొక్కలు నాటింది. ఈ మొక్కలన్నీ చెట్లుగా పెరిగాయి.. చిన్న సైజు అడవుల్లా, పార్కులుగా విస్తరించాయి. అంతేకాదు.. పండ్ల గింజల్ని కంపోస్ట్‌, మట్టి, కోకోపీట్‌తో కలిపి సీడ్‌ బాల్స్‌గా తయారుచేస్తోంది ఐహా బృందం. ఈ బాల్స్‌ని ఎండబెట్టి అడవులు, ఖాళీ ప్రదేశాల్లోకి విసురుతోంది. తద్వారా వర్షాకాలంలో అవి మొక్కలుగా ఎదుగుతాయనేది ఆమె ఆలోచన. ఇక మరోవైపు మొక్కల్ని ఉచితంగా పంపిణీ చేయడం, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ని సేకరించి.. వాటిని ప్లాంట్‌ హోల్డర్స్‌గా తయారుచేస్తోంది.

‘మొక్కల్లో ఉన్న ఔషధ గుణాలు ఎన్నో అనారోగ్యాల్ని దూరం చేస్తాయి. అందుకే కొన్ని స్కూళ్లలో ఔషధ మొక్కల్ని కూడా నాటుతున్నా. మరోవైపు మా బృందం ఆయా పాఠశాలల్లో నీటి సంరక్షణ చర్యలూ చేపడుతోంది. పర్యావరణాన్ని కాపాడితే.. మన పరిసరాలూ అందంగా మారతాయి. అందుకే జీవితాంతం ఇదే లక్ష్యంతో ముందుకు సాగాలని సంకల్పించుకున్నా..’ అంటోన్న ఐహా.. 2019లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘జాతీయ బాల పురస్కారం’, కేంద్ర నీటి పారుదల శాఖ నుంచి ‘వాటర్‌ హీరో అవార్డు’ అందుకుంది. ఇక గతేడాది ‘ప్రపంచ శాంతి సదస్సు’ వేదికగా ప్రసంగించిన ఈ ఎకో హీరో.. ప్రస్తుతం ‘Mission 100 Crore Tree’, ‘Clean and Green India’ అనే ప్రచార కార్యక్రమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతోంది.


రచనలతో అవగాహన!

‘ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు..’ అని కాకుండా వ్యక్తిగతంగా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలంటోంది పదమూడేళ్ల మాన్య హర్ష. చిన్న వయసులోనే తల్లిదండ్రులతో కలిసి వివిధ పర్యటక ప్రదేశాల్ని సందర్శించిన ఈ చిన్నారి.. మన రోజువారీ పనులతో పర్యావరణం ఎంతలా కలుషితమవుతుందో తెలుసుకుంది. ఈ సమస్యను తగ్గించాలంటే.. ముందు పర్యావరణ పరిరక్షణపై అందరిలో అవగాహన పెంచాలనుకుంది మాన్య. ఈ ఆలోచనతోనే పద్యాలు, కవితలు రాయడం ప్రారంభించింది. పర్యావరణానికి సంబంధించి ఇప్పటికే ఏడు పుస్తకాలు కూడా రాసిన మాన్య.. ‘ది లిటిల్ ఎన్విరాన్‌మెంటలిస్ట్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌, వెబ్‌సైట్‌ ప్రారంభించి.. ఈ వేదికగానూ పర్యావరణ పరిక్షణపై అవగాహన పెంచుతోంది. అంతేకాదు.. చిన్నారుల కోసం ‘సన్‌షైన్‌’ పేరుతో మాస పత్రికను ప్రచురిస్తున్న మాన్య.. పచ్చదనాన్ని పరిరక్షించాలంటే పసి వయసు నుంచే చిన్నారుల్లో అవగాహన పెంచాలంటోంది.

ఇలా మాటలతోనే కాదు.. వాకథాన్స్‌ నిర్వహించడం, మొక్కలు నాటడం, సీడ్‌బాల్స్‌ పంపిణీ చేయడం, క్లాత్‌ బ్యాగ్స్‌ను ఉచితంగా అందించడం, నదులు- సముద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం, కూరగాయల తొక్కల్ని రీసైక్లింగ్‌ చేసి పేపర్‌ తయారుచేయడం.. పర్యావరణాన్ని కాపాడడంలో తన వంతుగా కృషి చేస్తోంది.

ఇన్ని చేస్తున్నా.. ‘మన పూర్వీకులు మనకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించారు.. అలాగే మన తర్వాతి తరాల వారికి పచ్చటి పర్యావరణాన్ని అందించే బాధ్యత మనపై ఉంది. ఇందులో నేను చేస్తోంది చాలా చిన్న పని..’ అంటూ తన నిరాడంబరతను చాటుకుంటోందీ బెంగళూరు టీన్‌. తన రచనలకు పలు అవార్డులు-రివార్డులు అందుకున్న మాన్యను.. ‘ది వారియర్‌ ఆఫ్‌ ఛేంజ్‌ - 2021’, ‘హ్యుమానిటేరియన్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు - 2021’.. వంటి పురస్కారాలూ వరించాయి.


నీటి సమస్యకు పరిష్కారం!

ప్రస్తుతం ఎక్కడ చూసినా నీటి కొరత తాండవిస్తోంది. అయితే మన ఇళ్లలో కొన్ని పనులకు ఉపయోగించిన నీటిని రీసైక్లింగ్‌ చేసి తిరిగి ఉపయోగించుకోవడం వల్ల వేల కొద్దీ లీటర్ల మంచి నీటిని ఆదా చేయచ్చంటోంది దిల్లీ టీన్‌ మన్నత్‌ కౌన్‌. నీటి కొరతను తగ్గించాలన్న ఆలోచనతోనే ‘గ్రే వాటర్‌ హోమ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాన్‌’ను అభివృద్ధి చేసిందామె. ఇంటి అవసరాల కోసం ఉపయోగించిన నీటిని శుద్ధి చేసే వ్యవస్థ ఇది. ఇంట్లో ఏర్పాటుచేసిన ప్లంబింగ్‌ వ్యవస్థకు అనుసంధానించేలా దీన్ని రూపొందించింది మన్నత్.

‘మన దేశంలో నీటి కొరత ఎక్కువగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే.. మన అవసరాల కోసం ఉపయోగించుకునే నీటిని రీసైక్లింగ్‌ చేసుకోవాలి. ఈ క్రమంలో స్నానం, గిన్నెలు తోమడం, బట్టలుతకడానికి ఉపయోగించిన నీటిని శుద్ధి చేసి.. తిరిగి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నేను అభివృద్ధి చేసిన రెండు పరికరాలు సమర్థంగా పనిచేస్తాయి. వీటిని 20 శాతం ఇళ్లలో వాడినా వేల కొద్దీ లీటర్ల మంచి నీటిని ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు.. మురుగునీటిని శుద్ధి చేయడానికయ్యే ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు.. పైగా నీటిని ఆదా చేయడం పర్యావరణహితం కూడా! భవిష్యత్తులోనూ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసే ఇలాంటి సరికొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నా..’ అంటోన్న మన్నత్‌.. ‘గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ ఫీల్డ్‌ ట్రిప్‌’లో భాగంగా.. నీటి సంరక్షణ, రీసైక్లింగ్‌ పద్ధతుల గురించి ప్రసంగించింది. ‘హెచ్‌పీ గర్ల్స్‌ సేవ్‌ ది వరల్డ్‌ ప్రైజ్‌’ టాప్‌-10 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచిన ఈ ఎకో టీన్‌.. పలు సదస్సుల్లోనూ పాల్గొని.. పర్యావరణ పరిరక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల పాత్ర.. వంటి అంశాలపై ప్రసంగించింది.

వీరితో పాటు భారత సంతతికి చెందిన సాత్వికా అయ్యర్‌ (ఆహార వృథాను అరికట్టడం, మొక్కల ఆధారిత ఆహారంలో ఉన్న పోషక విలువలపై అవగాహన కల్పించడం); అనుష్క గొడంబే (మొక్కలు పెంచడం, వివిధ స్కూళ్లకు వాటిని పంపిణీ చేయడం); నిత్యా జక్కా (ఆహార వృథాను అరికట్టి.. వీగన్‌ ఆహార పద్ధతిపై అవగాహన పెంచడం).. మొదలైన వారు కూడా ఈ ఏడాది ‘అంతర్జాతీయ యువ ఎకో-హీరో అవార్డు’కు ఎంపికయ్యారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్