పెళ్లైన కొత్తలో ఆందోళన.. ఎందుకిలా?!

ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెడతాం.. కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కొత్త బాధ్యతలకూ అలవాటుపడడానికి సిద్ధమవుతాం. అయితే పెళ్లికి ముందు మనం ఊహించిన దానికి.. పెళ్లి తర్వాత రియాల్టీకి మధ్య చాలా తేడాలుండచ్చు.. కొన్నిసార్లు మనం అనుకోని పరిణామాలు....

Published : 16 Feb 2023 13:08 IST

ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెడతాం.. కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కొత్త బాధ్యతలకూ అలవాటుపడడానికి సిద్ధమవుతాం. అయితే పెళ్లికి ముందు మనం ఊహించిన దానికి.. పెళ్లి తర్వాత రియాల్టీకి మధ్య చాలా తేడాలుండచ్చు.. కొన్నిసార్లు మనం అనుకోని పరిణామాలు కూడా చోటుచేసుకోవచ్చు. ఇదిగో ఇలాంటి విషయాలే పెళ్లి తర్వాత చాలామంది అమ్మాయిల్లో ఒత్తిడి, ఆందోళనల్ని పెంచుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. దీనికి తోడు వందలో 53 శాతం మంది పెళ్లి తర్వాత వివిధ రకాలుగా హింసను ఎదుర్కొంటూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నట్లు ఓ జాతీయ సర్వేలో కూడా వెల్లడైంది. మరి, ఇంతకీ పెళ్లి తర్వాత అమ్మాయిలు ప్రశాంతతకు ఎందుకు దూరమవుతున్నారు? దానివల్ల అనుబంధంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇలాంటి మానసిక సమస్యల్ని దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం రండి..

అవే కారణమా?

మన దేశంలో పెళ్లి తర్వాత వివిధ కారణాల రీత్యా మానసిక సమస్యల బారిన పడుతోన్న అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. దీన్నే ‘పోస్ట్‌ మ్యారేజ్‌ డిప్రెషన్‌’గా పేర్కొంటున్నారు నిపుణులు. ఇందుకు పలు అంశాలు కారణమవుతున్నాయంటున్నారు. అవేంటంటే..!

పెళ్లికి ముందు వరకు బ్యాచిలర్‌గా గడిపిన అమ్మాయిలు.. పెళ్లయ్యాక అంత స్వేచ్ఛగా ఉండలేరు. కుటుంబ బాధ్యతలు, అత్తమామల్ని చూసుకోవడం.. వంటి కొత్త బాధ్యతల్ని భుజాలకెత్తుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఆయా బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తామో, లేదోనని ఆందోళన చెందుతుంటారట చాలామంది.

కొంతమంది పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండాల్సి రావచ్చు. ఈ క్రమంలో వాళ్లందరి మనస్తత్వాలు వేరుగా ఉండచ్చు.. తద్వారా ఆ వాతావరణంలో ఇమడలేకపోవచ్చు. ఈ క్రమంలో అన్ని విషయాల్లో వారిని సంతృప్తిపరచలేక, రాజీ పడలేక.. ఒక రకమైన అసహనం ఆవహిస్తుంది. ఇది ఒత్తిడికి గురిచేస్తుంది.

పెళ్లి తర్వాత ఉద్యోగాలు కొనసాగించే వారు మరింత ఒత్తిడి, ఆందోళనలకు గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటు ఇంటి పనులు, బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే.. అటు ఆఫీస్‌ పనులు చేయాలంటే కత్తి మీద సామే అని చెప్పాలి.

పెళ్లి తర్వాత డిప్రెషన్‌కు ఆర్థిక విషయాలు కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు. అప్పటిదాకా తమ సంపాదనను స్వేచ్ఛగా ఖర్చు పెట్టడం, పొదుపు చేసుకోవడం.. వంటివి చేసిన తమకు పెళ్లయ్యాక అంత స్వేచ్ఛ దొరక్కపోవచ్చని, పైగా తమ సంపాదన భాగస్వామి/అత్తింటి వారి చేతుల్లోకి వెళ్తుందేమోనన్న ఆందోళన చాలామందిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుందంటున్నారు.

బాడీ షేమింగ్‌ విషయంలోనూ పలువురు మహిళలు పెళ్లి తర్వాత ఆందోళన చెందుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ‘లావుగా ఉన్నావ’ని, ‘సన్నగా ఉన్నావ’ని, ‘పెళ్లికి ముందులా అందంగా లేవ’ని.. ఇలా భాగస్వామి, అత్తింటి వారి నుంచి ఎదురయ్యే మాటలు చాలామంది అమ్మాయిల మనసును గాయపరుస్తున్నాయట!

పెళ్లి తర్వాత ఉద్యోగం కొనసాగించడానికి ముందు ఒప్పుకొని.. పెళ్లి తర్వాత తమ భార్యలతో బలవంతంగా మాన్పిస్తుంటారు కొందరు భర్తలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ మహిళలు మానసికంగా కుంగిపోతున్నారంటున్నారు నిపుణులు.

పెళ్లికి ముందు సంతోషమైనా, బాధైనా.. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే అమ్మాయిలకు.. పెళ్లయ్యాక ఆ ఆప్షన్‌ ఉండచ్చు.. ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కొంతమంది ఈ విషయంలో మొహమాటపడుతుంటారు. ఇది కూడా కొత్త పెళ్లికూతుళ్లను మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుందట!

ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతల రీత్యా.. ఒక్కోసారి భాగస్వామి తగిన సమయం కేటాయించలేకపోవచ్చు.. అయితే ఇంత చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ.. ‘కొత్తలోనే ఇలా నిర్లక్ష్యం చేస్తే.. ఇక ముందు ఎలా ఉంటారో’నని అనవసరంగా ఆందోళన చెందుతూ కొంతమంది అమ్మాయిలు బాధపడుతున్నారట!

పెళ్లైన కొత్తలో భాగస్వామితో రొమాంటిక్‌గా గడపాలని, తమ మనసులోని కోరికలు, ఫ్యాంటసీలు తనతో పంచుకోవాలని ఉన్నా.. కొంతమందికి మొహమాటం, భయం అడ్డొస్తాయి. మరికొందరు.. ‘ఇంత పారదర్శకంగా ఉంటే అవతలి వారు ఏమనుకుంటారో’నని సందేహిస్తూ ఉంటారు. దీనివల్ల మనసులోని విషయం భాగస్వామికి వ్యక్తపరచలేరు.. పైగా మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

అర్థం చేసుకోవాలి!

కేవలం అమ్మాయిలే కాదు.. అబ్బాయిలూ వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా పలు కారణాల రీత్యా ఇలాంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నారట! ఏదేమైనా పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన ఈ దూరాన్ని ఎంత త్వరగా దూరం చేసుకుంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

పెళ్లి తర్వాత ఒకరితో ఒకరు ఎలా మెలగాలని పెళ్లికి ముందు బాస చేసుకున్నారో.. పెళ్లయ్యాక మాట తప్పకుండా భాగస్వామికి తగిన ప్రాధాన్యమివ్వాలి. వారి ఇష్టాయిష్టాలకు, నిర్ణయాలకు విలువిచ్చేలా నడుచుకుంటే పెళ్లి తర్వాత జీవితంపై వారికీ ఓ భరోసా కల్పించినవారవుతారు. ఈ నమ్మకం ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచుతుంది.

భాగస్వామి అంటే పెత్తనం/ఈర్ష్యాద్వేషాలు కాదు.. ఒక ఫ్రెండ్‌లా వారికి తోడుండాలి. ఈక్రమంలో వారి సుఖాల్నే కాదు.. కష్టాల్నీ పంచుకుంటూ.. సమస్యల్ని కలిసి పరిష్కరించుకుంటే పెళ్లి తర్వాత ఒంటరితనానికి, మానసిక సమస్యలకు తావుండదు.

పెళ్లి తర్వాత పొరపచ్ఛాలు రాకూడదంటే.. పెళ్లికి ముందే ఆయా విషయాల్లో కాబోయే భార్యాభర్తలిద్దరూ స్పష్టత తెచ్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో ఈ స్పష్టత ఉంటే పెళ్లయ్యాక అటు మానసిక ఒత్తిళ్లూ ఉండవు.. ఇటు ఇద్దరి మధ్య గొడవలూ జరగవు.

పెళ్లైన కొత్తలో కొన్ని విషయాల్లో ఒకరికొకరు సర్దుకుపోలేరు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడం సహజం. అయితే వాటిని తెగే దాకా లాగకుండా.. మాట్లాడుకొని పరిష్కరించుకుంటే.. అన్యోన్యంగా ముందుకు సాగచ్చు.

వివాహం తర్వాత భాగస్వామి ఎప్పుడూ తనతోనే సమయం గడపాలనుకోవడం పొరపాటు! అటు వాళ్లకూ కాస్త ప్రైవసీనివ్వడంతో పాటు మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకుంటే మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటే, గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.

వైవాహిక జీవితంలో శృంగారం పాత్ర కీలకం! అయితే పెళ్లైన కొత్తలో మొహమాటం, భయం కారణంగా ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం, భాగస్వామిని దూరం పెట్టడం.. వంటివి చేస్తే ఇద్దరికీ మానసిక ఒత్తిళ్లు తప్పవు.. దీని ప్రభావం అనుబంధం పైనా పడుతుంది. కాబట్టి ఈ సమస్యలేవైనా ఉంటే కలిసి పరిష్కరించుకోవడం, లేదంటే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెళ్లైన కొత్తలో జంటల్లో ఆందోళన, ఒత్తిళ్లు సహజమే అయినా.. అవి అనుబంధంపై ప్రభావం చూపకముందే జాగ్రత్తపడమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో స్వయంగా పరిష్కరించుకోలేని సమస్యలేవైనా ఉంటే.. కౌన్సెలింగ్‌ నిపుణుల సహాయం తీసుకోవడం మరీ మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్