Published : 05/02/2023 11:26 IST

ఇంట్లోనే జిమ్‌.. ఇలా!

ఫిట్‌నెస్‌ సాధించాలంటే జిమ్‌కే వెళ్లాలా? వేల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టుకొని శిక్షణలో చేరాలా? అంటే.. ఆ అవసరం లేదంటున్నారు నిపుణులు. తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఓ మినీ జిమ్‌ను ఏర్పాటుచేసుకోవచ్చంటున్నారు. తద్వారా జిమ్‌ తరహా అనుభూతిని పొందడంతో పాటు ఖర్చునూ అదుపు చేసుకోవచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఇంట్లోనే జిమ్‌ను ఏర్పాటుచేసుకోవాలంటే ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. ఇంట్లో ఎంత ఖాళీ ప్రదేశం ఉందని! దీనికోసం ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించగలరా? లేదంటే బాల్కనీలో ఏర్పాటుచేసుకుంటారా? అనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే ఆ ప్రదేశాన్ని బట్టి జిమ్‌ను ఏర్పాటుచేసుకోవడం సులువవుతుంది.

జిమ్‌ సెంటర్లో మాదిరిగా ఇంట్లోనూ అన్ని రకాల ఫిట్‌నెస్‌ మెషినరీ ఉండాల్సిన అవసరం లేదు. దానివల్ల ఇంట్లో ప్రదేశం, డబ్బు.. రెండూ వృథా! కాబట్టి మీరు చేరుకోవాల్సిన ఫిట్‌నెస్‌ లక్ష్యమేంటో ముందు నిర్ణయించుకోండి.. అందుకు ఉపయోగపడే జిమ్‌ మెషినరీ గురించి నిపుణుల్ని అడిగి తెలుసుకుంటే.. దాన్నే ఇంట్లో ఏర్పాటుచేసుకోవచ్చు. దీంతో పాటు ఒక యోగా మ్యాట్‌ తీసుకుంటే.. పులప్స్‌, పుషప్స్‌.. వంటి నేలపై చేసే వ్యాయామాలకు అనువుగా ఉంటుంది.

జిమ్‌ మెషినరీపై డబ్బు వృథా ఎందుకు అనుకునే వారు.. ఇంట్లో ఉండే కొన్ని రకాల వస్తువుల్నీ వ్యాయామాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు.. బరువైన వస్తువుల్ని వెయిట్‌ లిఫ్టింగ్‌ కోసం, పుషప్స్‌ కోసం బాస్కెట్‌ బాల్‌, జంపింగ్‌ కోసం స్కిప్పింగ్‌ రోప్‌, కార్డియో వ్యాయామాల కోసం మెట్లనూ ఉపయోగించచ్చు.

ఫిట్‌నెస్‌ మెషినరీని ఎంచుకునే వారు.. ఒకే మెషీన్‌తో విభిన్న రకాల వ్యాయామాలు చేయగలిగేలా మల్టీపర్పస్‌ మెషీన్స్‌ని ఎంచుకుంటే ఇంట్లో స్థలం, డబ్బు.. రెండూ ఆదా అవుతాయి. ఉదాహరణకు.. స్టెబిలిటీ బాల్‌తో కోర్‌ వ్యాయామాలు, యోగా.. వంటివి సాధన చేయచ్చు.

ఇంట్లో బడ్జెట్‌-ఫ్రెండ్లీ జిమ్‌ను ఏర్పాటుచేసుకోవాలనుకునే వారి కోసం.. ఆయా జిమ్‌ మెషినరీపై మార్కెట్లో ప్రత్యేక రాయితీలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా సెకండ్‌ హ్యాండ్‌ మెషినరీని ఎంచుకున్నా.. కొంతవరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఇంట్లో జిమ్‌ను ఏర్పాటుచేసుకోవాలనుకునే వారు.. ఆ ప్రదేశంలో వెలుతురు, గాలి ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. వ్యాయామం చేసే క్రమంలో శరీరం చెమటలు కక్కుతుంది. ఇలాంటప్పుడు గాలి తగలకపోయినా చిరాగ్గా అనిపిస్తుంటుంది. అలాగే సహజసిద్ధంగా బయటి నుంచి వచ్చే వెలుతురు మనసును ఉత్తేజితం చేస్తుంది.

సొంతంగా చేసే వ్యాయామాలే కాదు.. నిపుణుల ఆధ్వర్యంలో చేసే వర్కవుట్లు కొన్నుంటాయి. వాటి కోసం ఆన్‌లైన్‌ తరగతుల్ని ఫాలో అయితే ఖర్చు తగ్గుతుంది. ఈ క్రమంలో సంబంధిత జిమ్‌ మెషినరీని ఇంట్లో ఏర్పాటుచేసుకోవడం తప్పనిసరి.

కొంతమంది ఇంట్లో గార్డెన్‌ ఉంటుంది. అలాంటి వారు తమ జిమ్‌ మెషినరీని ఆ పచ్చటి చెట్ల మధ్యలో ఏర్పాటుచేసుకోగలిగితే.. ఇటు మానసికోల్లాసం, అటు ఇంట్లో స్థలం కూడా ఆదా అవుతుంది. ఇక ఈ సదుపాయం లేని వారు.. తాము ఏర్పాటుచేసుకున్న జిమ్‌ ప్రదేశంలో ఇండోర్‌ ప్లాంట్స్‌ అమర్చుకోవచ్చు. మానసికోల్లాసం కోసం ఆ ప్రదేశాన్ని తమకు నచ్చినట్లుగా అలంకరించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని