అలాంటివారి ఉచ్చులో చిక్కకుండా..!

ముందు మంచిగా నటిస్తూ.. వెనక గోతులు తవ్వేవారు మన చుట్టూ కొంతమంది ఉంటారు. అంతెందుకు.. మన ప్రాణ స్నేహితులు అనుకునే వారే మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల నైజం బయటపడినప్పుడు జాగ్రత్తపడకపోతే నలుగురిలో మనం నవ్వుల పాలవక తప్పదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు....

Published : 31 Mar 2024 10:38 IST

ముందు మంచిగా నటిస్తూ.. వెనక గోతులు తవ్వేవారు మన చుట్టూ కొంతమంది ఉంటారు. అంతెందుకు.. మన ప్రాణ స్నేహితులు అనుకునే వారే మనకు తెలియకుండా మనల్ని మోసం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ల నైజం బయటపడినప్పుడు జాగ్రత్తపడకపోతే నలుగురిలో మనం నవ్వుల పాలవక తప్పదంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అందుకే ఇలాంటి వాళ్లతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూనే స్నేహాన్ని కొనసాగించడం వల్ల అవతలి వారి ఉచ్చులో మనం చిక్కకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలియాలంటే ఇది చదివేయండి!

ఇకనైనా దూరం పెట్టండి!
స్నేహమంటే ఓ నమ్మకం. అందుకే మన విషయాలన్నీ పూసగుచ్చినట్లుగా మన ప్రాణ స్నేహితులతో పంచుకుంటాం.. కష్టాలొస్తే చెప్పుకుంటాం.. అయితే మనకు తెలియకుండా మన గురించి నలుగురికీ చెడుగా చెప్పే స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. వాళ్లు అలాంటి వారని తెలిశాక.. చాలావరకు దూరం పెట్టడమే మంచిదంటున్నారు. వాళ్లతో పంచుకునే విషయాలకూ పరిమితి విధించడం ఉత్తమం. ఉదాహరణకు.. మన ఆఫీస్‌ కొలీగ్స్‌ ఇలా చేస్తున్నారనుకుంటే.. వాళ్లతో పనికి సంబంధించిన విషయాల గురించే మాట్లాడాలి. ఇక ఈ మధ్యలో వ్యక్తిగత విషయాలకు తావివ్వకుండా.. పని ప్రదేశంలో వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మన ప్రైవసీని మనం కాపాడుకున్న వారమవుతాం.. తద్వారా మన గురించి నలుగురితో చెడుగా చెప్పే అవకాశం వారికి దొరకదు కూడా!

నిజమెంతో తెలుసుకోండి!
చిన్న చిన్న అపార్థాలే అప్పుడప్పుడూ అనుబంధాలను దెబ్బతీస్తుంటాయి. అందుకే వాటిలో నిజమెంతో తెలుసుకున్నాకే ఎదుటివారి విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్‌ సర్కిల్‌లో ఒకరు.. మీకు, మీ ప్రాణ స్నేహితురాలికి మధ్య అనుబంధాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారనుకోండి.. ఈ క్రమంలో మీ గురించి వారికి, వారి గురించి మీకు చెడుగా చెప్పారనుకోండి. అలాంటప్పుడు క్షణికావేశంలో కోపంతో వాళ్ల దగ్గరికెళ్లి నిలదీయడం, కోప్పడడం.. వంటివి చేస్తే మీ స్నేహానికే ముప్పు! దీని ద్వారా ఇది సృష్టించిన వారు మీ వెనక సంతోషపడతారు. అదే మీరు ఒక్క క్షణం ఆలోచించి.. ఇందులో నిజమెంతుందో తెలుసుకోవడానికి మీ ప్రాణ స్నేహితురాలితో మాట్లాడితే.. తప్పెవరిదో అర్థమైపోతుంది. దీనివల్ల మీ వెనక గోతులు తవ్వాలనుకునే వారి స్వభావమేంటో ఇతర స్నేహితులందరికీ అర్థమవుతుంది. తద్వారా వాళ్లూ అలాంటి వారితో ఇకపై జాగ్రత్తపడే వీలు కలుగుతుంది.

భయపడకుండా..
‘ఒకమ్మాయి.. అబ్బాయి కాస్త క్లోజ్‌గా ఉంటే చాలు.. వాళ్లిద్దరికీ లవ్ ఎఫైర్‌ ఉందట.. అందుకే వాళ్లిద్దరూ కలిసే కాలేజ్‌ బంక్‌ కొడుతున్నారు..’ ఇలాంటి రూమర్స్‌ కళాశాలలు, ఆఫీసుల్లో కామన్‌! నిజానికి అందులో మన ప్రమేయం కానీ, మన తప్పు కానీ ఏదీ ఉండదు.. మరొకరితో ఎఫైర్‌ కూడా ఉండదు.. అయినా ఇలాంటి రూమర్స్‌ వ్యాప్తి చేస్తూ మన వ్యక్తిత్వాన్ని నలుగురిలో పలుచన చేస్తుంటారు.. వెనక రాక్షసానందం పొందుతుంటారు. అయితే ఇలాంటప్పుడు భయపడిపోకుండా.. ఈ విషయం మీకు ఎవరి ద్వారానైతే తెలిసిందో వారిని, ఇందుకు కారకులైన వారిని.. ఇలా అందరినీ ఒక్క చోట చేర్చి.. ఇందులో నిజమెంతుందో కనుక్కునే ప్రయత్నం చేయండి. మీతో మంచిగా ఉంటూనే.. మీ వెనక గోతులు తవ్వాల్సిన అవసరం వారికి ఎందుకు కలిగిందో చెప్పమని నిలదీయండి. ఇలా అందరి సమక్షంలో అడిగితే పొరపాటు చేసిన వారు తప్పు ఒప్పుకుంటారు. తద్వారా మీ నిజాయతీ నిగ్గు తేలడంతో పాటు అలాంటి విషపూరిత వ్యక్తుల పట్ల ఇకపై అందరూ జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.

మర్చిపోలేకపోతున్నారా?
మన వెనక గోతులు తవ్వే వారికి దూరంగా ఎలా ఉండాలో ఇన్ని విషయాలు చెప్పుకున్నాం.. కానీ ఇదివరకే వాళ్లు మన గురించి వ్యాప్తి చేసిన రూమర్స్‌ వల్ల మానసికంగా ఎంతో కొంత బాధ కలుగుతుంది. ఒక్కోసారి వాటిని మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేక ఒత్తిడి, డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదమూ లేకపోలేదు. అలా జరగకుండా ఉండాలంటే.. ఇలాంటి విషపూరిత వ్యక్తులకు దూరంగా ఉంటూనే.. మీకు నచ్చిన వారికి దగ్గరగా గడపడం మంచిదంటున్నారు నిపుణులు. అది మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, భర్త.. ఇలా ఎవరైనా కావచ్చు.. మీ బాధను దూరం చేసి పాజిటివిటీని దగ్గర చేసే వ్యక్తులతో నిరంతరం సమయం గడిపితే.. ఆ నెగెటివిటీ నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అవసరమైతే నిపుణుల సలహాలు, కౌన్సెలింగ్‌.. వంటివీ మేలు చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్