Summer Tips: పాలు విరిగిపోకుండా ఉండాలంటే..!
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేసవిలో వేడికి పాలు విరిగిపోవడం కామన్. ఒక్కోసారి ఫ్రిజ్‌లో నుంచి తీసిన పాలు వేడి చేస్తున్నప్పుడు కూడా ఇలా జరగడం చూస్తుంటాం. పాలలోని పీహెచ్ స్థాయులు తగ్గడమే ఇందుకు....
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేసవిలో వేడికి పాలు విరిగిపోవడం కామన్. ఒక్కోసారి ఫ్రిజ్‌లో నుంచి తీసిన పాలు వేడి చేస్తున్నప్పుడు కూడా ఇలా జరగడం చూస్తుంటాం. పాలలోని పీహెచ్ స్థాయులు తగ్గడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. ఏదేమైనా పాలు విరిగిపోకుండా ఉండాలంటే వాటిని వేడి చేసే విషయంలో, నిల్వ చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
⚛ పిండిన పాలను వేడి చేయకుండా ఎక్కువసేపు గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినా పాలు త్వరగా విరిగిపోతాయి. కాబట్టి ఇంటికి తెచ్చిన వెంటనే వాటిని మరిగించి పక్కన పెట్టడం మంచిది.
⚛ ఎక్కువ మొత్తంలో పాలు తీసుకున్నప్పుడు.. అవి ఒకట్రెండు రోజుల పాటు తాజాగా నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు వేడి చేసి చల్లార్చిన పాలను గాజు, స్టీల్ పాత్రల్లో నిల్వ చేస్తే అవి విరిగిపోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.
⚛ వేడి చేయకుండా ఎక్కువసేపు ఉంచిన పాలు విరిగిపోతాయనుకుంటే.. వేడి చేసే ముందు అందులో చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఆపై మరిగిస్తే ఫలితం ఉంటుంది.
⚛ ఫ్రిజ్‌లో వెనక వైపు, కింది అరల్లో, ఫ్రీజర్‌కి దగ్గరగా బాగా చల్లటి వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రదేశాల్లో పాలను నిల్వ ఉంచడం వల్ల అవి పాడవకుండా/విరిగిపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఫ్రిజ్ డోర్ వద్ద వీటిని అస్సలు నిల్వ చేయకూడదు.
వీటన్నింటితో పాటు ఆయా కాలాలకు అనుగుణంగా ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రతను మార్చుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల బయటి వాతావరణానికి అనుగుణంగా ఫ్రిజ్‌లో ఉష్ణోగ్రతలు మారుతూ పాలు, ఇతర ఆహార పదార్థాలు చెడిపోకుండా జాగ్రత్తపడచ్చు.
ఒకవేళ పాలు విరిగిపోయినప్పటికీ వాటిని పడేయకుండా.. కలాకండ్, రస్‌మలై, కోవా.. వంటి స్వీట్స్‌తో పాటు పనీర్ కూడా తయారుచేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.