మా సంక్రాంతులు ఇలా...

పెద్ద పండగ, పొంగల్‌, మకర సంక్రాంతి, లోహ్రీ, సుగ్గీ హబ్బా.. దేశవ్యాప్తంగా సంక్రాంతికి ఎన్ని పేర్లో! పంటలు చేతికొచ్చే సమయమిది. పాత ఆలోచనలు తొలగి కొత్త ఆశలు చిగురించాలని కోరుకుంటూ పూజలు, రంగవల్లికలు, పిండివంటలతో సంబరాలు చేసుకుంటాం.

Updated : 14 Jan 2023 08:11 IST

పెద్ద పండగ, పొంగల్‌, మకర సంక్రాంతి, లోహ్రీ, సుగ్గీ హబ్బా.. దేశవ్యాప్తంగా సంక్రాంతికి ఎన్ని పేర్లో! పంటలు చేతికొచ్చే సమయమిది. పాత ఆలోచనలు తొలగి కొత్త ఆశలు చిగురించాలని కోరుకుంటూ పూజలు, రంగవల్లికలు, పిండివంటలతో సంబరాలు చేసుకుంటాం. దేశమంతా నిర్వహించుకునే ఈ పండగ రోజును కొందరు తారలు ఎలా గడుపుతారో వారి మాటల్లోనే..


పండగంటే ఫ్యామిలీతోనే...

సంక్రాంతి వచ్చిందంటే ఒంగోలు అమ్మమ్మవాళ్లింటికి వెళ్లిపోతా. తాతయ్య, అమ్మ, అన్నయ్యలతో సరదాగా గడిపేస్తా. అమ్మ స్వర్ణలా డాక్టరునవ్వాలి, భరతనాట్య కళాకారిణినవ్వాలనేవి చిన్నప్పటి నుంచి నా లక్ష్యాలు. ఈ రెండింటితోపాటు అనుకోకుండా వచ్చింది వెండితెర అవకాశం. ఈ సంక్రాంతి నాకెన్నో కొత్త అవకాశాలను అందించింది. అందుకే ఇది నాకు మరింత ప్రత్యేకం. సినిమాల గురించికన్నా చిన్నప్పటి నుంచి అన్నయ్యలు, నేను చేసిన కోతి పనులన్నింటినీ అందరం గుర్తుకు తెచ్చుకొని నవ్వుకుంటాం. పండగకు ఇల్లంతా పూలతో అలంకరించడం, దేవుడి మందిరాన్ని అందంగా తీర్చిదిద్దడం వంటివి నాకు చాలా ఇష్టం. అందుకే ఆ బాధ్యతలను అమ్మ నాకే అప్పగిస్తుంది. తలస్నానం చేశాక అమ్మ సాంబ్రాణి పొగవేస్తే ఎంత బాగుంటుందో. నాకు సొంతంగా దుస్తులు కొనుక్కొనే అలవాటు లేదు. అమ్మ, అమ్మమ్మ కొనిచ్చే చీర లేదా లంగా ఓణీ వేసుకొని ఇల్లంతా కలియ తిరిగేస్తా. ఆడపిల్ల మహాలక్ష్మి అని నాతో తీపి చేయించడం మా ఇంట్లో ఆనవాయితీ. ప్రతి పండక్కీ పది, పదిహేను మందికి వండి, వడ్డించడం అలవాటు.. అమ్మ నేర్పిన పద్ధతి ఇది. నా వంటల్ని అందరూ లొట్టలేసుకొని మరీ తింటారు. ప్రతి సంక్రాంతికీ ఒక కొత్త వంట నేర్చుకుంటుంటా. ప్రసాదాలు దాదాపు 10రకాలకుపైగా చేసుకుంటాం. వాటిలో పల్లీలెక్కువగా వేసి అమ్మ చేసే చింతకాయ పులిహోరంటే పిచ్చి ఇష్టం. అలాగే దద్దోజనం, వడ, పాయసం, మోదకాలు వంటివి ఉంటే చాలు.. నా కళ్లు వేరే రకాలవైపు చూడవు. పులిహోరవైపు నేను చూస్తుంటే దేవుడికి పెట్టాలి, ప్రసాదం వైపు అలా చూడకే అని అమ్మ తిడుతుంటుంది. రేపు తినబోయే పులిహోర గుర్తుకు వస్తే.. ఇప్పుడే నోరూరుతోంది. ఇక అందరెదుట నా డ్యాన్స్‌ తప్పనిసరి. మధ్యలో అమ్మమ్మతో కూడా డ్యాన్స్‌ చేయిస్తా. ఈ రోజున పూజ చేసి ప్రసాదాలు తిని ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడపమని అందరికీ చెబుతా. పండగంటే ఫ్యామిలీతోనే అనుకోవాలి. ఆ జ్ఞాపకాలతో ఏడాదంతా బిజీగా గడిపేయొచ్చు. అనుకున్న లక్ష్యాల్ని చేరుకోవచ్చు.

శ్రీలీల సూరపనేని


గాలిపటాలు గుర్తొస్తాయ్‌

పంటల పండగ సంక్రాంతి అంటే నాకు గాలిపటాలే గుర్తొస్తాయి. కేరళ అమ్మాయిని.. మా దగ్గరా మకర సంక్రాంతి గానే నిర్వహించుకుంటాం. ఉదయాన్నే లేచి చక్కగా నలుగు పెట్టుకుని, తలారా స్నానం చేసి సూర్యుడికి నీళ్లు, పువ్వులు సమర్పిస్తాం. ఆపై పాలు పొంగించి, పరమాన్నం చేస్తాం. ఇవన్నీ అమ్మ చూసుకునేది. నేను మాత్రం స్కూల్లో ఉన్నప్పటి నుంచీ స్నేహితులను ఇంటికి పిలవడం అలవాటు. వాళ్లతో కబుర్లు, ఆటల్లో పడిపోయే దాన్ని. అందరం కలిసి రంగురంగుల గాలి పటాలు ఎగురవేస్తాం. అమ్మ రకరకాల వంటలు చేస్తుంది. అసలు రోజెలా గడిచిందో కూడా తెలియదు. మా దగ్గర కంటే తెలుగునాట దీన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక్కడి వేడుకలను చూడటానికే ఎక్కువ ఇష్టపడతా. వీలైతే తెలుగు స్నేహితుల ఇళ్లకు వెళ్లి సంబరాల్లో పాలుపంచుకుంటా. నా తొలి చిత్రం శతమానం భవతి సంక్రాంతికే విడుదలై విజయం సాధించింది. అందువల్ల ఇది నాకు లక్కీ పండగ.

అనుపమ పరమేశ్వరన్‌


జల్లికట్టు చూడటం ఇష్టం

ధురై అమ్మాయిని. మాకూ పొంగల్‌ పెద్ద పండగే! సంబరాలు తెల్లవారుజామునే మొదలవుతాయి. ఇంటిముందు అమ్మ పెద్ద రంగవల్లి వేస్తుంది. ఉదయాన్నే తలస్నానం చేసి, పొంగల్‌ వండి, దేవుడికి ప్రసాదంగా పెడతాం. బంధువులంతా ఒకచోట చేరతాం. ఎక్కడెక్కడి వాళ్లైనా ఈ పండక్కి ఒకచోట చేరాల్సిందే. ఎన్నిరకాల పిండి వంటలు చేస్తారో! అందరం కలిసి భోజనం చేస్తాం. పెద్దవాళ్ల కాళ్లకు దణ్ణం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. అప్పుడు బోలెడు డబ్బులు, గిఫ్ట్‌లు వస్తాయి. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా.. దండం పెట్టేసి డబ్బులు తెచ్చేసుకుందామా అని ఎదురు చూసేవాళ్లం. మా దగ్గర సంక్రాంతి వేళ జల్లికట్టు నిర్వహిస్తారు. నాన్న, బాబాయిలు అందరూ పాల్గొనేవాళ్లు. ఎవరికైనా దెబ్బలు తగులుతాయేమో అన్న భయం ఉన్నా.. దాన్ని చూడటం ఓ సరదా. భోజనాలు అయిపోగానే అందరం అక్కడికెళ్లిపోయే వాళ్లం. సంప్రదాయ వేడుక కదా.. దాన్ని చూడటం ఇప్పటికీ అదో సరదా!

నివేదా పేతురాజ్‌


ఈసారి మరింత ప్రత్యేకం

సినిమాల్లోకి వచ్చాక సంక్రాంతిని ఎక్కువగా సెట్లలోనే చేసుకున్నా. అందరికీ స్వీట్లు పంచడం.. కలిసి భోజనం చేయడం.. చాలా సరదాగా ఉండేది. సంక్రాంతి రుచులూ బాగా ఆస్వాదించేదాన్ని. దీన్నే మా పంజాబీలు ‘లోహ్రీ’గా నిర్వహించుకుంటాం. సాయంత్రం వేళ మంట వేసి, కుటుంబ సభ్యులమంతా దాని చుట్టూ తిరుగుతూ బెల్లం, నువ్వులు, పల్లీలు, మరమరాలు అగ్నికి సమర్పిస్తాం. అమ్మ ఇంట్లో పూజ చేస్తుంది. బెల్లం, నువ్వులు, మరమరాలతో బోలెడు వంటలు చేస్తుంది. ఆరోజు అందరం కలిసి భోజనం చేస్తాం, కబుర్లు చెప్పుకోవడం.. డోలు వాద్యాలకు నృత్యాలు వంటివి చేస్తాం. పెళ్లయ్యాక పుట్లిల్లు, మెట్టినిల్లు.. రెండు కుటుంబాలతో కలిసి చేసుకోవడం కొత్త అనుభూతి. మూడేళ్లలో సంక్రాంతి సమయంలో నా జీవితంలో ఎన్నో మార్పులు. పెళ్లి సంబరాలు, నా బాబు నీల్‌ కడుపులో పడటంతో సంక్రాంతికి కొత్త ఆనందాలు తోడయ్యాయి. బాబుతో తొలి సంక్రాంతి... అందుకే ఇది మరింత ప్రత్యేకం!

కాజల్‌ అగర్వాల్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్