Aishwarya Paatapati: అమ్మమ్మ మాటతో... అందాల పోటీకి

అందం, సేవ ఒక్క వేదికపై మెరిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఐశ్వర్య పాతపాటిలా తళుక్కుమంటుంది. పేదలకు సేవ చేయాలని తపించి డాక్టరైన ఐశ్వర్య.

Updated : 17 Feb 2023 04:27 IST

అందం, సేవ ఒక్క వేదికపై మెరిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఐశ్వర్య పాతపాటిలా తళుక్కుమంటుంది. పేదలకు సేవ చేయాలని తపించి డాక్టరైన ఐశ్వర్య... తాజాగా మన దేశం తరఫున ‘టాప్‌ మోడల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా-2023’ పోటీల్లో విజేతగా నిలిచింది. త్వరలో ప్రపంచ వేదికపై మెరవనున్న ఆమె వసుంధరతో తన మనసులోని మాటను పంచుకుంది...

మ్మ అపర్ణ గృహిణి. నాన్న అప్పలరాజు వ్యాపారి. చెల్లి అనిమిష. స్కూల్లో లెక్కలంటే ప్రాణం పెట్టేదాన్ని. మార్కులూ అలానే వచ్చేవి. దాంతో అంతా నన్ను రామానుజం అంటూ సరదాగా పిలిచేవారు. మా అమ్మమ్మకు డయాబెటిస్‌ ఉండేది. ఆమెకు మాత్రలు నేనే ఇచ్చేదాన్ని. అలా ఇచ్చినప్పుడల్లా ఆమె నన్ను ‘డాక్టరుగారూ..’ అని నవ్వుతూ పిలిచేది. ‘నువ్వు పెద్దయ్యాక డాక్టరై, పేదవాళ్లకు వైద్యం చేయాలి’ అని అనేది. మా అమ్మకూ నన్ను వైద్యురాలిగా చూడాలన్నదే కల. అలా నాకూ వైద్యవృత్తిపై ఆసక్తి పెరిగింది. డాక్టరై అమ్మమ్మను బాగా చూసుకోవాలనుకునేదాన్ని. ఆ కోరికతోనే ఇంటర్‌లో బైపీసీలో చేరాలనుకున్నప్పుడు నాన్న అభ్యంతరం చెబితే అమ్మ ఒప్పించింది. అలా ఎంబీబీఎస్‌ అయ్యాక న్యూట్రిషన్‌, డెర్మటాలజీ కోర్సులు పూర్తి చేశా. ప్రస్తుతం జనరల్‌ సర్జన్‌గా ఎమ్మెన్నార్‌ మెడికల్‌ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నా. భవిష్యత్తులో కాస్మొటిక్‌ సర్జరీ కోర్సులు చేయాలన్నది నా కోరిక.   

మోడలింగ్‌తో..

‘ఆడపిల్లకు మంచి చదువుతో పాటు అందం, ఆరోగ్యం అవసరం. అవి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయ’నేది అమ్మమ్మ. ఆమె మంచి అందగత్తె. నాక్కూడా అందాన్ని కాపాడుకోవడానికీ, మొటిమలు, మచ్చలు రాకుండా ఉండటానికీ బోలెడు చిట్కాలు చెప్పేది. అమ్మమ్మ మాటలు నా మనసులో బాగా నాటుకున్నాయి. పెద్దైన తర్వాత అందాల పోటీల్లో పాల్గొనాలనుకునేదాన్ని. ఎంబీబీఎస్‌ తర్వాత ఇన్‌స్టాలో పొడవు జుట్టుతో నా ఫొటోలు చూసి ఒక యాడ్‌ ఏజెన్సీ మోడలింగ్‌ చేయమని అడిగింది. మోడలింగ్‌ అంటే ఇంట్లో ఒప్పుకొంటారో లేదోనని సందేహించాను. అందుకే ఎవరికీ చెప్పకుండా మోడలింగ్‌ చేశా. మిస్‌ ఇండియా ఫెమినా పోటీలకూ వెళ్లాను. కానీ తగినంత శిక్షణ లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. కానీ అవకాశాలు అందరికీ రావుగా అందుకే ఈ సారి నా కలని ఎలా అయినా నెరవేర్చుకోవాలనుకున్నా. శిక్షణ తీసుకొని.. గత డిసెంబరులో ‘టాప్‌ మోడల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ ఇండియా - 2023’ పోటీలకు అప్లై చేశా. అనేక వడపోతలూ, ఇంటర్వ్యూల తర్వాత వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మందిని ఎంపిక చేశారు. తుది జాబితాలో 12 మంది ఉన్నాం. జనవరిలో దిల్లీలో పలుదశల తర్వాత విజేతగా నన్ను ప్రకటించారు. ఇందులో గెలిచిన వారు మిస్‌ ఎర్త్‌, మిస్‌ గ్లోబ్‌ పోటీలకూ హాజరుకావొచ్చు. నాన్నకు ఎంతో నచ్చచెబితే ముంబయి వచ్చారు. అందాల కిరీటాన్ని అందుకోవడం చూసిన తర్వాత నాన్న ముఖంలో సంతోషం చూశా. త్వరలో ఈజిప్టులో జరగనున్న ‘టాప్‌ మోడల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ పోటీకి మన దేశం తరఫున హాజరవుతున్నా. దీనిలో 60 దేశాల అందగత్తెలతో పోటీపడాల్సి ఉంటుంది.


వైద్య సేవలో...

మొదటిసారి ఆపరేషన్‌ థియేటర్‌లో లైపోమా సర్జరీ చేశా. ప్రాణాపాయంతో వచ్చిన ఓ వ్యక్తికి ఎనిమిదిగంటలపాటు నలుగురు వైద్యులం కలిసి ఒక అత్యవసర చికిత్స చేశాం. అతను నవ్వుతూ ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు వైద్యురాలిని అయినందుకు సంతోషంగా, గర్వంగా అనిపించింది. కొన్నిసార్లు నిరంతరాయంగా 36 గంటలపాటు పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోగుల ముఖాల్లో కనిపించే నవ్వుతో ఆ కష్టమంతా మాయమైపోతుంది. కానీ నేను డాక్టరవ్వాలని కలలుకన్న అమ్మమ్మ నా చదువు పూర్తికాకుండానే చనిపోయినప్పుడూ, కొవిడ్‌లో తాతయ్య చనిపోయినప్పుడూ చాలా బాధపడ్డా. భవిష్యత్తులో షూటింగ్‌ నేర్చుకోవాలని ఉంది.


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్