‘రోబోటిక్స్‌’తో ప్రయోగాత్మక బోధన.. అదే ఈ అక్కచెల్లెళ్ల లక్ష్యం!

చెవులతో విన్న దాని కంటే కళ్లతో చూసిందే మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పిల్లలూ చిన్నతనం నుంచే ఇలాంటి ప్రయోగాత్మక పద్ధతుల్లో పాఠాలు వింటే ఆ కాన్సెప్ట్‌ను ఇక వారు మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక...

Updated : 03 Mar 2023 20:08 IST

(Photos: Twitter)

చెవులతో విన్న దాని కంటే కళ్లతో చూసిందే మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పిల్లలూ చిన్నతనం నుంచే ఇలాంటి ప్రయోగాత్మక పద్ధతుల్లో పాఠాలు వింటే ఆ కాన్సెప్ట్‌ను ఇక వారు మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా పిల్లలకు పాఠాలు చెబుతున్నారు చెన్నైకి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు అదితి, దీప్తి. శాస్త్రసాంకేతిక రంగాల్లో (STEM) అమ్మాయిల ప్రాతినిథ్యం పెంచడానికి.. పాఠశాల దశ నుంచే బాలికల్లో ఈ దిశగా ఆసక్తి రేకెత్తించేందుకు ఏకంగా ఓ సంస్థనే నెలకొల్పారు. ఈ వేదికగా అక్కడి స్కూళ్లలో విభిన్న బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది బాలికల ఉన్నత భవిత కోసం పాటు పడుతున్నారీ సోదరీమణులు. ఇంటా, బయటా టెక్నాలజీని వేదికగా చేసుకుంటే అమ్మాయిలు తమ సమస్యల్ని పరిష్కరించుకోవడం సులభమవుతుందంటోన్న ఈ టెకీ సిస్టర్స్‌ గురించి ‘మహిళా దినోత్సవం’ నేపథ్యంలో మీకోసం..!

‘పైకి విసిరిన బంతి తిరిగి కిందే ఎందుకు పడుతుంది?’, ‘నీళ్లు పల్లానికే ఎందుకు ప్రవహిస్తాయి?’, ‘విమానం ఆకాశంలో ఎలా ఎగరగలుగుతుంది?’.. మనలో చాలామందికి చిన్న వయసులో ఇలాంటి ప్రశ్నలు తలెత్తే ఉంటాయి. వీటికి వివరణాత్మక సమాధానం తప్ప ప్రయోగాత్మక సమాధానం దొరికింది మనలో చాలా తక్కువమందికే అని చెప్పచ్చు. కానీ తన తండ్రి ప్రోత్సాహంతో అదితి, దీప్తి మాత్రం ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ప్రయోగాత్మకంగా సమాధానం తెలుసుకోగలిగారు. తద్వారా విషయ పరిజ్ఞానమే కాదు.. శాస్త్రసాంకేతికత పైనా పట్టు పెంచుకోగలిగారు.

ఆ చర్చలే బీజం వేశాయి!

ఎంచుకున్న కెరీర్‌లో రాణించాలంటే.. పాఠశాల దశలోనే దానికి సంబంధించిన బీజం పడాలంటున్నారు అదితి, దీప్తి. ‘చిన్న వయసులో ఏ సందేహమొచ్చినా నాన్న మాకు ప్రయోగాత్మకంగా వివరించేవారు. ఇక వారాంతాల్లో పత్రికల్లో వచ్చిన వార్తల గురించి మరింత లోతుగా చర్చించేవాళ్లం. దీనివల్ల చుట్టూ ఉన్న ప్రపంచం గురించి సమగ్ర అవగాహన ఏర్పడింది. ఈ ఆసక్తితోనే ప్రతి అంశం గురించి లోతుగా పరిశోధించి తెలుసుకునే వాళ్లం..’ అంటున్నారీ అక్కచెల్లెళ్లు. ఇలా తండ్రి ప్రోత్సాహంతో తమకు నచ్చిన రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించారీ ఇద్దరు సోదరీమణులు. ఈ క్రమంలో ‘నార్త్‌ కరోలినా చాపెల్‌ హిల్‌ యూనివర్సిటీ’ నుంచి న్యూరోసైన్స్ విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన దీప్తి.. ఆపై కొన్నాళ్ల పాటు న్యూరోసైన్స్‌ టెక్నాలజీకి సంబంధించిన పలు స్టార్టప్స్‌లో పనిచేసింది. ఇక ‘సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీ’ నుంచి పబ్లిక్‌ పాలసీ విభాగంలో మాస్టర్స్‌ పూర్తిచేసిన అదితి.. కొన్నేళ్ల పాటు లీగల్‌ ఇంటర్న్‌గా, రీసెర్చ్‌ ఫెలోగా కొనసాగింది.

బాలికల బంగారు భవితకు..!

విదేశాల్లో చదువు పూర్తిచేసి, ఉద్యోగాలు చేసే క్రమంలో.. అక్కడి విద్యా విధానాలకు, మన దేశంలోని విద్యా విధానానికి ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు అదితి, దీప్తి. దీనికి తోడు మన దేశంలో శాస్త్రసాంకేతిక రంగాల్లో అమ్మాయిలు బాగా వెనకబడి ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఎలాగైనా ఈ గ్యాప్‌ని తగ్గించాలనుకున్నారు. ఈ క్రమంలోనే తాము చిన్నతనం నుంచి నేర్చుకున్న ప్రయోగాత్మక పద్ధతుల్ని ఈ తరం పిల్లలపై అప్లై చేయాలనుకున్నారీ అక్కచెల్లెళ్లు.

‘నిరక్షరాస్యత, ఆర్థిక పరిస్థితులు సహకరించక.. ఇలా పలు కారణాల రీత్యా మన దేశంలో చాలామంది బాలికలు ఉన్నత చదువులకు నోచుకోలేకపోతున్నారు. దీనికి తోడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమ్మాయిల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. కానీ భవిష్యత్తంతా ఈ రంగాలదే! కాబట్టి వారిలో సృజనాత్మక, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంచడం చాలా ముఖ్యం. తద్వారా వారిలో విషయ పరిజ్ఞానం పెరగడమే కాదు.. కెరీర్‌లోనూ ఉన్నత అవకాశాలు అందుకోగలుగుతారు. ఈ ఆలోచనతోనే ‘రోబోటిక్స్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌’ పేరుతో ఓ విద్యా సంస్థను ప్రారంభించాం..’ అంటూ చెప్పుకొచ్చారీ సోదరీమణులు.

విద్యా బోధన అలా!

తమ సంస్థ వేదికగా అక్కడి స్కూళ్లు, అనాథాశ్రమాల్లో బాలికల కోసం కోడింగ్‌, రోబోటిక్స్‌కు సంబంధించిన ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు అదితి, దీప్తి.

‘గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద పిల్లలకు విద్య, ఉద్యోగాల అవసరం ఎంతో ఉంటుంది. కానీ అక్కడ వాళ్లు చదువుకోవడానికి తగిన వనరులు, సదుపాయాలు లేకపోవడం మనం చూస్తుంటాం. అందుకే అలాంటి ప్రాంతాల పైనే దృష్టి సారించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం నిర్వహించే తరగతుల్లో భాగంగా కోడింగ్‌, రోబోటిక్స్‌.. వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలపై బాలికల్లో సమగ్ర అవగాహన తీసుకొస్తున్నాం. బొమ్మలు, డ్రోన్స్‌, బ్లాక్స్‌.. వంటి పరికరాల్ని/వస్తువుల్ని ఉపయోగించి విద్యా బోధన చేస్తున్నాం. ఇలాంటి వస్తువులు, పరికరాలు పిల్లల్ని ఇట్టే ఆకట్టుకోవడంతో పాటు వారిలో ఏకాగ్రతనూ పెంచుతాయి. అలాగే ఈ తరగతుల వల్ల చిన్నారుల్లో సృజనాత్మక, విశ్లేషణాత్మక, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలూ మెరుగవుతాయి. ఇలా ఈ 13 ఏళ్లలో సుమారు 30 వేల మందికి పైగా పిల్లలు ఆయా అంశాల్లో పూర్తి నైపుణ్యాలు సంపాదించుకోగలిగారు. అలాగే మరికొంతమంది ఈ రంగాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. భవిష్యత్తులో అమ్మాయిలకు ఈ రంగాల్లో ఇంటర్‌్ఉషిప్స్‌, ఉద్యోగావకాశాలు అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం.. తద్వారా శాస్త్రసాంకేతిక రంగాల్లో అమ్మాయిల ప్రాతినిథ్యం పెంచడమే మా లక్ష్యం..’ అంటున్నారీ అక్కచెల్లెళ్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్