Guinness Record: వామ్మో! ఇది స్ప్రింగా? శరీరమా?

యోగా చేసేటప్పుడు కాస్త కష్టమైన ఆసనం వేయాల్సి వస్తే ఇబ్బంది పడిపోతాం. అలాంటిది శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచుతూ, మెలికలు తిప్పుతూ.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలెన్నో అలవోకగా చేసేస్తోంది యూకేలోని పీటర్స్‌బర్గ్‌కు చెందిన లిబర్టీ బారోస్‌. తన అబ్బురపరిచే విన్యాసాలతో చూపు తిప్పుకోనివ్వని...

Published : 11 Oct 2022 12:33 IST

(Photos: Instagram)

యోగా చేసేటప్పుడు కాస్త కష్టమైన ఆసనం వేయాల్సి వస్తే ఇబ్బంది పడిపోతాం. అలాంటిది శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచుతూ, మెలికలు తిప్పుతూ.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలెన్నో అలవోకగా చేసేస్తోంది యూకేలోని పీటర్స్‌బర్గ్‌కు చెందిన లిబర్టీ బారోస్‌. తన అబ్బురపరిచే విన్యాసాలతో చూపు తిప్పుకోనివ్వని ఈ టీనేజర్ ‘ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్‌ అమ్మాయి’గా పేరు సంపాదించుకుంది. ఇక ఇటీవలే మరో కఠినమైన భంగిమతో గిన్నిస్‌ బుక్లోనూ చోటు దక్కించుకుంది లిబర్టీ. మరి, ఇదంతా తనకు ఎలా సాధ్యమైంది? రండి.. తెలుసుకుందాం!

ప్రస్తుతం 14 ఏళ్లున్న లిబర్టీ చిన్న వయసు నుంచే చదువులో, ఆటల్లో మహా చురుకు. ముఖ్యంగా డ్యాన్స్‌ అంటే తనకు ప్రాణం. స్కూల్లో తన డ్యాన్స్‌ మెలకువలతో అందరినీ కట్టిపడేసే లిబర్టీకి.. తోటి పిల్లలకు డ్యాన్స్‌ నైపుణ్యాలు నేర్పడమంటే ఇష్టమట!

స్ప్రింగ్‌లా తిప్పేస్తూ..!

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక నైపుణ్యం దాగుంటుంది.. ఏదో ఒక దశలో దాన్ని గుర్తిస్తుంటాం. అలా తన ఫ్లెక్సిబిలిటీని 2017లో గుర్తించానంటోంది లిబర్టీ. పదేళ్ల వయసులో అమెరికన్‌ తార రిహాన్నా ‘అంబ్రెల్లా’ వీడియో చూసి స్ఫూర్తి పొందిన ఆమె.. అప్పట్నుంచి తన శారీరక విన్యాసాలపై దృష్టి పెడుతూ, వాటికి మరింత సానపెడుతూ.. మెరికలా మారిపోయింది. కాళ్లను వెనక నుంచి ముందుకు వంచి నేలకు ఆనించడం.. అలాగే ముందుకు నడుస్తూ ఇతర పనులు చేయడం, వ్యాయామాలు చేయడం, ఆటలాడడం.. ఇవన్నీ సాధారణంగా నిల్చున్నప్పుడు చేసినట్లే సునాయాసంగా చేసేస్తోంది. ఇక కాళ్లను సమాంతరంగా చాపడం, వాటినే చేతుల్లా రాడ్‌కు వేలాడదీసి విన్యాసాలు చేయడం.. ఇలా ఒకటా, రెండా.. లిబర్టీ తన శరీరంతో చేయని భంగిమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఇందుకు ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలే ప్రత్యక్ష సాక్ష్యం!

ఆ భంగిమకు ‘గిన్నిస్‌’ రికార్డు!

ఇప్పటికే తన యూట్యూబ్‌ వీడియోలు, ఇన్‌స్టా పోస్టులతో పాపులారిటీ సంపాదించుకున్న లిబర్టీ.. ‘స్పెయిన్స్‌ గాట్‌ ట్యాలెంట్‌’లోనూ సత్తా చాటింది. ఇక తన జిమ్నాస్టిక్‌ నైపుణ్యాల్ని ప్రదర్శించి ఇటీవలే గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు సంపాదించుకుందీ ఫ్లెక్సిబుల్‌ గర్ల్‌. ఈ క్రమంలో ఛాతీని నేలకు ఆనించి.. కాళ్లను వెనక్కి వంచి.. వాటి మధ్యలో తలను ఉంచడం (బ్యాక్‌ బెండ్స్‌/స్పైన్‌ బెండింగ్‌ ట్విస్ట్‌).. ఈ భంగిమను అర నిమిషంలో పదకొండున్నర సార్లు చేసి.. ఈ అరుదైన రికార్డు నెలకొల్పిందామె. ఈ భంగిమకు ‘ది లిబర్టీ లోడౌన్‌’గా నామకరణం కూడా చేసిందామె. ‘ఇది నా జీవితంలో నేను సాధించిన అత్యద్భుతమైన విజయం. ఇది నా జీవితాన్ని మరో అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. ఇక్కడితో ఆగకుండా.. నా నైపుణ్యాలకు మరింత సానపెట్టాలనుకుంటున్నా. భవిష్యత్తులో యాక్షన్‌ చిత్రాల్లో నటించాలనేది నా కల.. గతంలో నా ఈ ట్యాలెంట్‌తో నిధులు సమీకరించి ఎన్‌హెచ్‌ఎస్‌కు విరాళమిచ్చేదాన్ని.. ఇకపైనా ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు సమీకరించాలనుకుంటున్నా..’ అంటోందీ ట్యాలెంటెడ్‌ గర్ల్‌. ఇలా తనలోని అరుదైన నైపుణ్యాలతో ‘ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్‌ గర్ల్‌’గా పేరుగాంచిన లిబర్టీ విజయానికి ఆమె తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. పిల్లల్ని తమకు నచ్చిన అంశాల్లో ప్రోత్సహిస్తే ఫలితాలూ అంతే అద్భుతంగా వస్తాయని చెప్పకనే చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్