Sania Mirza: ఆరేళ్ల వయసులోనే ఆ కల కన్నా!

‘అమ్మాయిలు ఆటల్లో రాణించలేరు!’ అన్న సామాజిక అపోహల మధ్యే రాకెట్‌ పట్టుకుందామె. తన ఆటతీరు, దూకుడుతో విజయాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. క్రీడల్లో అమ్మాయిలకున్న అవరోధాలు తొలగించడమే కాదు.. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. భారత మహిళల టెన్నిస్‌కు ఆది, పునాదిగా....

Updated : 23 Feb 2023 17:28 IST

(Photos: Instagram)

‘అమ్మాయిలు ఆటల్లో రాణించలేరు!’ అన్న సామాజిక అపోహల మధ్యే రాకెట్‌ పట్టుకుందామె. తన ఆటతీరు, దూకుడుతో విజయాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. క్రీడల్లో అమ్మాయిలకున్న అవరోధాలు తొలగించడమే కాదు.. ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. భారత మహిళల టెన్నిస్‌కు ఆది, పునాదిగా మారిన సానియా మీర్జా.. తన మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌కు తాజాగా వీడ్కోలు పలికింది. ఆరేళ్ల వయసులో వింబుల్డన్‌ ఆడాలని కలలు కన్న ఆమె.. ఏకంగా ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు అందుకుంది.. ఒకానొక సమయంలో మహిళల డబుల్స్‌ విభాగంలో ప్రపంచ నం.1గానూ నిలిచింది. ‘భారత మహిళల టెన్నిస్‌ అంటే సానియా.. సానియా అంటే భారత మహిళల టెన్నిస్‌’ అనేంతగా దేశ క్రీడా చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఈ హైదరాబాదీ స్టార్ రిటైర్మెంట్ నేపథ్యంలో.. ఆమె ఆటను ఇకపై చూడలేకపోవచ్చు.. కానీ తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌ గురించి పలు సందర్భాల్లో ఆమె పంచుకున్న విషయాలు మనందరిలో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!

ఈత కోసమని వెళ్లి..!

చాలామంది ఆటల్ని వ్యాపకంగానే పరిగణిస్తారు. కానీ ఆటలకు అంతకుమించి ప్రాధాన్యమిచ్చే కుటుంబంలో పుట్టాను నేను. నాన్న తన నాలుగేళ్ల వయసు నుంచే ఆటలపై మక్కువ చూపేవారట! ఇక మా దూరపు బంధువులు కూడా క్రికెట్‌లో రాణించారు. వీళ్లను చూస్తూ పెరిగిన నాకూ క్రీడలపై ఆసక్తి ఏర్పడింది. నా ఆరేళ్ల వయసులో వేసవి సెలవుల్లో అమ్మ నన్ను స్విమ్మింగ్‌ క్లాసులకు తీసుకెళ్లింది. ఈ క్రమంలో టెన్నిస్‌ కోర్టుల్ని దాటుకుంటూ వెళ్లేవాళ్లం. ఆ సమయంలోనే టెన్నిస్‌ నాకు పరిచయమైంది. అమ్మ కూడా ‘నువ్వు టెన్నిస్‌ ఎందుకు ఆడకూడదు?!’ అంటూ ఈ క్రీడపై నాలో ఆసక్తిని రేకెత్తించింది. అలా ఆ వేసవి సెలవుల్లో నా దృష్టి ఈత నుంచి టెన్నిస్‌ పైకి మళ్లింది. ఆలస్యం చేయకుండా అమ్మతో కలిసి నిజాం క్లబ్‌ టెన్నిస్‌ కోర్టుకు వెళ్లా. అక్కడ కోచ్‌ను కలిసి శిక్షణ ఇవ్వమని కోరా. ‘నువ్వు ఇంకా చాలా చిన్నదానివి!’ అంటూ నిరాకరించే ప్రయత్నం చేశారు. కానీ నేను గొడవ పడి మరీ శిక్షణలో చేరాను. ఓసారి టీవీలో వింబుల్డన్‌ టోర్నీ చూసి.. నేనూ ఎప్పటికైనా వింబుల్డన్‌ ఆడాలని కలలు కన్నా. కానీ పెద్దయ్యాక అదే నిజమవుతుందని అప్పుడు ఊహించలేదు.

సవాళ్లను ప్రేమించా..!

నా ఆరేళ్ల వయసులో.. అంటే అప్పుడు టెన్నిస్‌ క్రీడకు సంబంధించి కనీస సౌకర్యాలు కూడా లేవు. ఆవు పేడతో చదునుగా అలికి, రంగులు పూసిన కోర్టుల్లోనే ఆడాల్సి వచ్చేది. మరోవైపు.. ఇంట్లో వాళ్లు నన్ను ప్రోత్సహించినా.. ‘ఆడపిల్లలు ఆటల్లో రాణించలేర’న్న అపోహ అప్పట్లో ఉండేది. అయినా వీటన్నింటికీ నా ఆటతోనే సమాధానం చెప్పాలనుకున్నా. నేను ఒక్కో టోర్నీ గెలుస్తుంటే.. సమాజం తన దృష్టి కోణాన్నీ మార్చుకుంటూ వచ్చింది. ఎనిమిదేళ్ల వయసులో నాకంటే రెట్టింపు వయసున్న అమ్మాయితో పోటీపడి అండర్‌-16 రాష్ట్ర ఛాంపియన్‌గా అవతరించిన సమయంలో ఒకప్పుడు విమర్శించిన వారే ప్రశంసిస్తుంటే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఇక చిన్న వయసు నుంచే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడం, కష్టతరమైన మ్యాచుల్లో తలపడడాన్నే ఎంజాయ్‌ చేసేదాన్ని. ఎందుకంటే ఇలాంటి మ్యాచుల్లో గెలిస్తేనే మన సత్తా ఏంటో మనకు అర్థమవుతుంది.. మనల్ని మనం ఎక్కడ మెరుగుపరచుకోవాలో తెలుస్తుంది. బహుశా ఈ ఆలోచనా ధోరణే నన్ను ఈ క్రీడలో ప్రత్యేకంగా నిలబెట్టిందేమో అనిపిస్తుంది. ఈ మూడు దశాబ్దాల కెరీర్‌లో ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికే ఇష్టపడ్డా. ఇలా దక్కిన విజయం ఎప్పటికీ మర్చిపోలేను.

కోర్టు వెలుపలా పోరాడా!

మన దేశంలో మహిళలు ఆయా రంగాల్లో విజయం సాధించాలంటే.. ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగానూ పోరాడాల్సి వస్తోంది. క్రీడల్నే తీసుకుంటే.. విజయం సాధించాలంటే ప్రత్యర్థితో మైదానంలో పోరాటం చేయడంతో పాటు.. మైదానం వెలుపల సమాజంతోనూ పోరాడాల్సి వస్తోంది. ఇందుకు కారణం ఆడపిల్లలపై సమాజంలో ఉన్న మూసధోరణులు, అపోహలే! ఈక్రమంలో చాలామంది అమ్మాయిల వేషధారణ, వాళ్లు ఎంచుకునే అరుదైన క్రీడలు.. తదితర విషయాల్లో విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఇలా కెరీర్ పరంగానే కాదు.. పెళ్లి, పిల్లలు, ఆపై కెరీర్‌ను కొనసాగించడం.. తదితర విషయాల్లోనూ మరికొంతమంది మహిళలు సమాజం నుంచి మాటలు పడాల్సి వస్తోంది. నా జీవితంలోనూ ఇలాంటి అనుభవాలున్నాయి. అయితే ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే.. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కొక్కరి ఆలోచనలు, అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయన్న విషయాన్ని గుర్తెరగాలి. అప్పుడే తోటి వారిని విమర్శించకుండా, మన ఆలోచనల్ని వారిపై రుద్దకుండా జాగ్రత్తపడచ్చు. ఇలాంటి రోజు వచ్చినప్పుడే.. ఆడపిల్లల్ని చూసే దృష్టి కోణంలో సామాజిక మార్పు మొదలవుతుంది.

అమ్మైనా ఆగక్కర్లేదు!

ఏ రంగంలో ఉన్నా చాలామంది మహిళల కెరీర్‌ పెళ్లి, పిల్లలతో ముగుస్తుందనుకుంటారు. ఇక ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే క్రీడా రంగంలో ఈ అపోహ మరింత బలంగా ఉంది. కానీ నేను దీంతో ఏకీభవించను. ఇది నిరూపించడానికే తల్లయ్యాక కూడా తిరిగి నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టా. బరువు తగ్గా.. ఫిట్‌నెస్‌ సాధించా. నేను నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలిగా. అయితే అమ్మయ్యాక మన ప్రాధాన్యాలు మారతాయి. బిడ్డకే అధిక సమయం కేటాయించాలనిపిస్తుంది. కానీ ఈ మార్పుల్ని ఆస్వాదిస్తూనే.. మనల్ని మనం ఉత్తమ వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడం, పిల్లలకు రోల్‌ మోడల్‌గా మారడమూ ముఖ్యమే! కాబట్టి అటు బాధ్యతల్ని, ఇటు కెరీర్‌నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇది సాధ్యం కావాలంటే ఇంట్లో వాళ్ల సపోర్ట్‌ చాలా అవసరం. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలినని చెప్పాలి.

టెన్నిసే జీవితం కాదు!

మనలో ఏదైనా సాధించాలన్న పట్టుదల, స్వీయ నమ్మకంతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. క్రీడలకూ ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఆటలో ఓడిపోయినా.. పడిలేచిన కెరటంలా మళ్లీ ప్రయత్నిస్తాం.. జీవితంలోనూ ఇదే సూత్రాన్ని అమలు చేయాలి. సవాళ్లకు వెరవకుండా, కష్టాలకు కుంగిపోకుండా మరో ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే పోరాడేతత్వం మనకు అలవడుతుంది. టెన్నిస్‌ నాకు ఇదే నేర్పింది. నన్నో యోధురాలిగా మార్చింది. ఈ మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో టెన్నిస్‌ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా.. అలాగని టెన్నిసే నా జీవితం కాదు.. అది నా జీవితంలో ఓ కీలక భాగం మాత్రమే! మనలోని ప్రత్యేకతలపై నమ్మకముంచితే జీవితంలో ఎప్పుడూ ఓడిపోం. నా సుదీర్ఘ కెరీర్‌లో నేను నమ్మిన సూత్రమిదే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్