కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!

కిచెన్‌ అంటేనే ఘుమఘుమలకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే వంటగదిలో సింక్‌ సరిగ్గా శుభ్రపరచకపోవడం, మిగిలిన పదార్థాలను డస్ట్‌బిన్‌లో ఎలా పడితే అలా పడేయడం.. ఇలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వంటగదిలోంచి దుర్వాసనలు వెలువడుతుంటాయి.

Published : 06 May 2024 12:44 IST

కిచెన్‌ అంటేనే ఘుమఘుమలకు కేరాఫ్‌ అడ్రస్‌. అయితే వంటగదిలో సింక్‌ సరిగ్గా శుభ్రపరచకపోవడం, మిగిలిన పదార్థాలను డస్ట్‌బిన్‌లో ఎలా పడితే అలా పడేయడం.. ఇలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల వంటగదిలోంచి దుర్వాసనలు వెలువడుతుంటాయి. మరి, అలాంటి వాసనలను పోగొట్టాలన్నా, అలా జరగకుండా ముందుగానే జాగ్రత్తపడాలన్నా కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం రండి..

కమలా తొక్కలతో..

డస్ట్‌బిన్‌లోని చెత్తను పారేసినా కొన్నిసార్లు దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి సందర్భాలలో ఒక గిన్నెలో నీరు పోసి దానిలో కాస్త దాల్చినచెక్క, కొన్ని కమలా తొక్కలు వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు వేడి చేయాలి. ఆ గిన్నెను అలాగే ఉంచేస్తే.. దుర్వాసన పోయి.. వంటగది పరిమళభరితం అవుతుంది.

వెనిగర్‌తో..

మాంసాహారం వండినప్పుడు వెలువడే నీచు వాసనను పోగొట్టాలంటే వెనిగర్‌ని ఉపయోగించాల్సిందే. దీనికోసం మూడు గిన్నెల్లో వెనిగర్‌ని పోసి కిచెన్‌లో మూడు చోట్ల ఉంచాలి. 10 నుంచి 15 నిమిషాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉన్నట్లైతే.. వెడల్పాటి గిన్నెలో నీరు, వెనిగర్‌ తీసుకోవాలి. వీటిలో కొన్ని నిమ్మతొక్కలు కూడా వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పొయ్యిపై ఉంచి సువాసనలు వెదజల్లేంత వరకు సన్నని సెగపై వేడి చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్‌ చేసి అలా ఉంచేస్తే కాసేపటికి కిచెన్‌లో దుర్వాసన పోతుంది.

నిమ్మతో స్ప్రే..

కిచెన్‌లో చేపల వాసనను పోగట్టడానికి నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. గిన్నెలో వేడి నీరు తీసుకోవాలి. దానిలో నిమ్మరసం పిండి.. తొక్కలను కూడా నీటిలోనే వేయాలి. దీన్ని ఒక స్ప్రే డబ్బాలో పోసి వంటగదిలో స్ప్రే చేస్తే వాసన పోతుంది.

రూమ్‌ ఫ్రెష్‌నర్‌గా..

యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క.. లాంటి సువాసన వెదజల్లే మసాలా దినుసులను తీసుకొని వాటిని నీటిలో వేసి బాగా వేడిచేయాలి. దీనివల్ల వంటగదిలో సువాసనలు వ్యాపిస్తాయి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఇది రూమ్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా పనికొస్తుంది.

బేకింగ్‌ సోడాతో..

వంట చేసే క్రమంలో పొరపాటున కూర మాడిపోయినప్పుడు వెలువడే వాసన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీన్ని పోగొట్టడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం బేకింగ్‌ సోడాను ఒక గిన్నెలో వేసి స్టౌ పక్కన లేదా కిచెన్‌ ప్లాట్‌ఫాంపై పెడితే సరిపోతుంది. వంట చేసేటప్పుడు విడుదలయ్యే ఎలాంటి వాసననైనా ఇది పీల్చేసుకుంటుంది.

ఒక గిన్నెలో ఓట్స్‌ వేసి కిచెన్‌లో ఎక్కడ ఉంచినా వంట చేసేటప్పుడు వెలువడే వాసనలన్నింటినీ పీల్చేసుకుంటుంది.

అలాగే కిచెన్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, వంటగదిలోకి గాలి ధారాళంగా ప్రవేశించే ఏర్పాటు చేసుకోవడం కూడా ముఖ్యమే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్