ఆఫీస్‌లో ఇలా పని చేస్తే ఆనందమే!

రోజులో మనం ఇంట్లో ఎంత సమయం గడుపుతామో.. ఆఫీస్‌లోనూ అంతే సమయం కేటాయిస్తాం. ఇక ఇంట్లో ఎంత హడావిడి ఉన్నా.. ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసుకుంటాం.. కాబట్టే సంతోషంగా ఉండగలుగుతాం. అయితే ఈ నియమం ఆఫీస్‌కీ వర్తిస్తుందంటున్నారు.....

Updated : 23 Nov 2022 21:11 IST

రోజులో మనం ఇంట్లో ఎంత సమయం గడుపుతామో.. ఆఫీస్‌లోనూ అంతే సమయం కేటాయిస్తాం. ఇక ఇంట్లో ఎంత హడావిడి ఉన్నా.. ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసుకుంటాం.. కాబట్టే సంతోషంగా ఉండగలుగుతాం. అయితే ఈ నియమం ఆఫీస్‌కీ వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మనం పనిచేసే వాతావరణాన్ని ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా మార్చుకున్నప్పుడే.. అటు సంస్థకు చక్కటి ఉత్పాదకతను అందించచ్చు.. మరోవైపు మన కెరియర్‌నూ అభివృద్ధి చేసుకోవచ్చు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఆ స్పష్టత ముఖ్యం!

చాలామంది ఆఫీస్‌ అనగానే గాబరా పడిపోతుంటారు. ‘ఈ రోజు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది..’ అంటూ నీరసించిపోతారు. అంతేకానీ.. ‘ఈరోజు ఆఫీస్‌ పని ఎంతో సంతృప్తిగా గడిచింది..’ అనే వారిని అరుదుగా చూస్తుంటాం. అయితే ఉద్యోగులు ఇలా ఒత్తిడికి గురి కావడానికి రెండు కారణాలున్నాయంటున్నారు నిపుణులు. ఒకటి.. ఆ రోజు పనులకు సంబంధించి సరైన ప్రణాళిక వేసుకోకపోవడం, రెండోది.. తమకు సాధ్యమయ్యే పనులు కాకుండా అదనపు భారాన్ని నెత్తిన వేసుకోవడం. నిజానికి దీనివల్ల మనం చేయాలనుకున్న పనులు కూడా చేయలేకపోతాం. కాబట్టి ఏ రోజుకారోజు చేయాల్సిన పనుల్ని వాటి ప్రాధాన్యతను బట్టి చక్కటి ప్రణాళిక వేసుకోవడంతో పాటు మన సాధ్యాసాధ్యాల్ని బట్టి పనుల విషయంలో ఓ స్పష్టత తెచ్చుకుంటే.. అటు పని వాతావరణమూ ప్రశాంతంగా ఉంటుంది.. ఇటు మన ఉత్పాదకతా మెరుగుపడుతుంది.

పారదర్శకత ఉందా?

అనుబంధాన్ని దృఢం చేసుకోవడానికి కుటుంబ సభ్యుల మధ్య పారదర్శకత ఎంత ముఖ్యమో.. ఆఫీస్‌ పనులు సజావుగా సాగడానికి ఉద్యోగుల మధ్య సఖ్యత, పారదర్శకత అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. ఏ ప్రాజెక్టయినా సరే బృందంతో కలిసి పని చేయాల్సిందే! కాబట్టి నా పని నేను చేసుకుపోతాను.. ఇతరులతో నాకేం సంబంధం లేదంటే కుదరదు.. అందుకే బృంద సభ్యులతో చెలిమి పెంచుకోవడం, మీకొచ్చిన సృజనాత్మక ఆలోచనల్ని వారితో పంచుకోవడం, వారి ఆలోచనల్ని వినడం, సహోద్యోగి చెప్పే మార్పుల్ని సానుకూలంగా తీసుకోవడం, స్వార్థం-అసూయాద్వేషాలకు తావివ్వకపోవడం.. ఆఫీస్‌ వాతావరణం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇవన్నీ కీలకమే! ప్రతి ఉద్యోగి పైవిషయాలన్నీ పాటిస్తేనే ఇది సాధ్యమవుతుంది.

అడ్జస్ట్ అవగలరా?

ఉద్యోగాలు మారే క్రమంలో మనం వివిధ సంస్థల్లో పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో అన్ని సంస్థల్లో ఒకే రకమైన పని వాతావరణం ఉండకపోవచ్చు. అలాగని ఇంతకుముందున్న సంస్థలో ఉన్నట్లే ఇక్కడ కూడా అలాగే ప్రవర్తిస్తామంటే అందుకు ఆ సంస్థ నిబంధనలు ఒప్పుకోవు. పైగా మీరు ఇలా మొండిగా ఉంటే, అక్కడ ఇమడలేకపోతే.. నష్టం మీకే! కాబట్టి ఉద్యోగం మారడం ఎంత ముఖ్యమో.. ఆయా సంస్థల్లోని నియమనిబంధనల్ని అర్థం చేసుకొని.. అక్కడి పని వాతావరణానికి తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవడం కూడా అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. తద్వారా ఆఫీస్‌ వాతావరణం సానుకూలంగా ఉంటుంది.. చక్కటి ఉత్పాదకతనూ అందించగలుగుతాం.

ఎక్కడివక్కడే..!

ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పలు సమస్యలుంటాయి. అయితే చాలామంది ఆఫీస్‌ ఒత్తిళ్లను ఇంటికి, ఇంట్లో ఉన్న సమస్యల్ని ఆఫీస్‌కి తీసుకెళ్తుంటారు. తద్వారా ఇంట్లో కుటుంబ సభ్యులు/భాగస్వామితో గొడవలు.. ఇలా మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇక ఆఫీస్‌కు ఇంటి సమస్యల్ని మోసుకొస్తే.. ఆ రోజంతా మనసు కుదురుగా ఉండదు. దీని ప్రభావం పనిపై పడుతుంది. కాబట్టి అటు ఇంట్లో, ఇటు ఆఫీస్‌లో ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోవాలంటే.. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అటు ఇంట్లో వాళ్ల సహాయం తీసుకోవచ్చు.. ఇటు సహోద్యోగుల సలహాలూ పాటించచ్చు.

సంస్థలు కూడా..!

పని ప్రదేశాన్ని ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మార్చడంలో సంస్థలూ కృషి చేయాలంటున్నారు నిపుణులు.

⚛ పని, ఆఫీస్‌ వాతావరణానికి సంబంధించి తరచూ ఉద్యోగుల వద్ద నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం, అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం, వారికేమైనా వృత్తిపరమైన సమస్యలుంటే సత్వరం పరిష్కరించడం.. వంటివి ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది.

⚛ ఎప్పుడూ పని పని అంటూ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురాకుండా.. వారి మధ్య చెలిమి పెంచేలా.. సందర్భాన్ని బట్టి పలు సాంస్కృతిక కార్యక్రమాలు, టీమ్‌ లంచ్‌లు.. వంటివి ఏర్పాటుచేయచ్చు.

⚛ ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. ప్రమోషన్లు, ప్రోత్సాహకాల రూపంలో వారికి గుర్తింపునిస్తే.. వాళ్లూ ఎంతో ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. తద్వారా సంస్థ ఉత్పాదకతా మెరుగుపడుతుంది.

⚛ ఆకర్షణీయమైన ఆఫీస్‌ డిజైన్‌ ఉద్యోగుల్ని 33 శాతం వరకు సంతోషంగా ఉంచగలదని ఓ అధ్యయనం చెబుతోంది. అందుకే ఆఫీస్‌ డిజైన్‌ విషయంలో సంస్థలు మరింత ముందుచూపుతో వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్ల అవసరం మేరకు కూర్చొని, నిల్చొని.. ఇలా రెండు విధాలుగా పని చేసుకునేందుకు వీలుగా స్టాండింగ్‌ డెస్క్స్‌ సదుపాయం కల్పించాలి. అలాగే సౌకర్యవంతంగా ఉండే కుర్చీలూ ఏర్పాటుచేయాలి.

⚛ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక కారణంతో మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు ఉద్యోగుల్లో సహజమే! ఇలాంటప్పుడూ సంస్థలు వారికి అండగా నిలవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆయా సంస్థలు ఉద్యోగుల సమస్యలు వినడం, అవసరమైతే వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించడం చేస్తే.. సంస్థ మా వెంటే ఉందన్న ధీమా వారికి ఉంటుంది. తద్వారా మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్