ఆ కోరికలకు కళ్లెం వేయాల్సిందే..!

డబ్బు విషయంలో మన కోరికలకు పట్టపగ్గాలుండవు.. ‘నా సంపాదన.. నా ఇష్టం..’ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. అవసరం ఉన్నా, లేకపోయినా నచ్చింది కొనేస్తుంటారు.. విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు.

Published : 02 May 2024 12:45 IST

డబ్బు విషయంలో మన కోరికలకు పట్టపగ్గాలుండవు.. ‘నా సంపాదన.. నా ఇష్టం..’ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. అవసరం ఉన్నా, లేకపోయినా నచ్చింది కొనేస్తుంటారు.. విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఈ కాలం అమ్మాయిల్ని ఎవరిని చూసినా దాదాపుగా ఇదే వైఖరి! అయితే సంపాదన ఎంతైనా.. ఖర్చుల విషయంలో మాత్రం ఈ అతి ప్రవర్తన తగదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ విలాసాలు అప్పటికప్పుడు సంతోషాన్నిచ్చినా.. భవిష్యత్తులో డబ్బు పరంగా పలు సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ఆది నుంచే విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయమంటున్నారు. ఇందుకోసం కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఆలోచనలు అదుపులో..!

చేతి నిండా డబ్బుంటే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంటుంది. నిత్యావసరాల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళ్లి.. అవసరమైన వాటి కంటే అనవసరమైనవే బాస్కెట్లో వేసేస్తుంటాం. బయటికెళ్లకపోయినా ఆన్‌లైన్లో ఆర్డర్ పెట్టినా అనవసరమైనవి కూడా కొనేసేవాళ్లు ఎంతోమంది! అవసరం ఉన్నా, లేకపోయినా ఇంట్లో అలా పడుంటాయన్న ఉద్దేశంతో కొన్ని రకాల గృహోపకరణాల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించే వారూ లేకపోలేదు. అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. వీటిలో మనకు ఉపయోగకరం అనిపించే ఖర్చు ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. అలాంటప్పుడు తెలిసి తెలిసి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకంటున్నారు నిపుణులు. కాబట్టి చేతి నిండా డబ్బుందన్న అతి విశ్వాసంతో.. మనసులో తలెత్తే ఇలాంటి ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తే.. వృథా ఖర్చుల్ని చాలావరకు తగ్గించచ్చంటున్నారు. అలాగని ప్రతి విషయంలో రాజీ పడమని కాదు.. లగ్జరీ అన్న పదాన్ని పక్కన పెట్టి.. ఉన్నదాంట్లోనే మన ఆలోచనలకు తగ్గట్లుగా ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకున్నా సంతృప్తి చెందగలుగుతామంటున్నారు.

ఆటో పేమెంట్స్‌.. ఉత్తమం!

ప్రస్తుతం డబ్బుకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆన్‌లైన్లోనే సునాయాసంగా చేసేస్తున్నారు చాలామంది. నీళ్ల బిల్లు దగ్గర్నుంచి కరెంట్‌ బిల్లు, సిలిండర్‌ కొనుగోలు, ఆయా వస్తువులకు నెలనెలా ఈఎంఐ కట్టడం, గృహ రుణ చెల్లింపులు.. వంటివన్నీ దీని కిందకే వస్తాయి. అయితే కొంతమంది వీటిని తామే స్వయంగా చెల్లించేలా ఆప్షన్‌ పెట్టుకుంటే.. మరికొంతమంది ఒక నిర్ణీత సమయంలో ఆటో పేమెంట్‌ అయ్యేలా ఆప్షన్‌ సెట్‌ చేసుకుంటారు. డబ్బు విషయంలో విలాసవంతమైన ఆలోచనలు చేస్తూ వృథా ఖర్చులు చేసే వారికి ఈ రెండో తరహా పద్ధతే ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే నెలనెలా ఒక నిర్ణీత సమయంలో ఆయా చెల్లింపుల కోసం డబ్బు ఆటోమేటిక్‌గా కట్‌ అయిపోతుందన్న ఆలోచన ఉన్నప్పుడు.. అకౌంట్లో చెల్లింపులకు సరిపడినంత డబ్బును ఉంచేలా వీళ్లు జాగ్రత్తపడతారని.. తద్వారా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే పద్ధతికి క్రమంగా కళ్లెం వేయచ్చంటున్నారు. ఇక అది కూడా చెల్లింపు తేదీలు నెల మొదటి వారంలో కాకుండా.. చివరి వారంలో ఉండేలా చూసుకుంటే.. అనవసర ఖర్చులు చాలావరకు తగ్గుతాయంటున్నారు.

‘రీటైల్‌ థెరపీ’.. వద్దు!

ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నప్పుడు.. మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు.. ఏదో ఒకటి చేసి ఆ సమస్య నుంచి ఉపశమనం పొందాలనుకుంటాం. ఈ క్రమంలో తమ మనసుకు నచ్చిన పనులు చేయడం చాలామందికి అలవాటు! ఇందులో భాగంగా షాపింగ్‌ చేసే వారూ లేకపోలేదు. ఇలా షాపింగ్‌తో తమ ఒత్తిళ్లను దూరం చేసుకోవడాన్నే ‘రీటైల్‌ థెరపీ’ అంటారు. అయితే ఇదీ ఒక రకమైన వృథా ఖర్చే అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ క్రమంలో మానసిక సంతృప్తి కోసం అనారోగ్యకరమైన ఆహార పదార్థాల్ని కొనుక్కొని తిన్నా.. దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. కాబట్టి మానసిక సమస్యల్ని రీటైల్‌ థెరపీతో ముడిపెట్టి డబ్బు వృథా చేసుకోకుండా.. దీనికి ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించడం మేలంటున్నారు.

50/30/20 రూల్‌.. పాటిస్తున్నారా?

డబ్బు సంపాదించడంతోనే సరిపోదు.. ఆర్థికంగా మనకున్న బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించినప్పుడే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చు. ఈక్రమంలో విలాసవంతమైన ఖర్చుల్ని అదుపు చేసుకోవడానికి 50/30/20 రూల్‌ పాటించడం ఉత్తమ మార్గం అంటున్నారు నిపుణులు. అంటే.. మనకొచ్చిన జీతంలో నుంచి 50 శాతం డబ్బును.. ఇంటి అద్దె/గృహ రుణం, బీమా పథకాలు, ఇతర నెలవారీ చెల్లింపుల కోసం వినియోగించాలి. ఇక నెలనెలా అయ్యే నిత్యావసర ఖర్చుల్నీ ఇందులో నుంచే ఎడ్జస్ట్‌ చేసుకునేలా ప్రణాళిక వేసుకోవాలి. ఇక 30 శాతం డబ్బును మన వ్యక్తిగత అవసరాలు/కోరికల కోసం వెచ్చించేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఈ క్రమంలో సినిమాలు, షికార్లు, షాపింగ్‌, డైనింగ్‌.. వంటి ఖర్చులన్నీ ఈ మొత్తంలో నుంచి కవరయ్యేలా చూసుకోవాలి. ఇక మిగిలిన 20 శాతం డబ్బును లాభదాయకంగా ఉండే పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం, అందులో నుంచే కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా జమ చేసుకోవడం.. ఇలా తమకున్న ఆలోచనల్ని బట్టి పొదుపు-మదుపు చేస్తే.. విలాసవంతంగా డబ్బు ఖర్చు పెట్టే సమస్యకు చెక్‌ పెట్టచ్చు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండానూ జాగ్రత్తపడచ్చు.

చిన్న లక్ష్యాలు.. పెద్ద మార్పులు!

ప్రతి ఒక్కరికీ జీవితంలో కొన్ని వ్యక్తిగత లక్ష్యాలుంటాయి. వాటిలో కొన్ని డబ్బుతో ముడిపడి ఉంటాయి. అయితే ఇలాంటి లక్ష్యాలతోనూ విలాసవంతమైన కోరికలు, ఆలోచనలకు అడ్డుకట్ట వేయచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో దీర్ఘకాలిక లక్ష్యాలు కాకుండా.. స్వల్పకాలిక లక్ష్యాలు సత్ఫలితాలిస్తాయంటున్నారు. ఇల్లు, ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు కావాల్సిన డౌన్‌ పేమెంట్‌ మొత్తాన్ని సమకూర్చుకోవడం, అత్యవసర నిధి ఏర్పాటుచేసుకోవడం, వెకేషన్‌ కోసం డబ్బు దాచుకోవడం.. వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఐదేళ్లు, ఆ లోపు కాలపరిమితి ఉండేలా ఆయా లక్ష్యాల్ని నిర్దేశించుకొని ఒక్కొక్కటి పూర్తిచేస్తూ పోతుంటే.. వృథా ఖర్చులు తగ్గుతాయి.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పైగా ఇలాంటి స్వల్పకాలిక లక్ష్యాల్ని పూర్తిచేయడం సులువవుతుంది కూడా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్