డబ్బు విషయంలో.. ఈ పొరపాట్లు వద్దు!

సానుకూల ఆలోచనలు సానుకూల ఫలితాల్నిస్తాయంటారు. మనం చేసే పనులు, ఎంచుకున్న లక్ష్యాల పరంగానే కాదు.. డబ్బుకూ ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు....

Updated : 26 Feb 2024 21:05 IST

సానుకూల ఆలోచనలు సానుకూల ఫలితాల్నిస్తాయంటారు. మనం చేసే పనులు, ఎంచుకున్న లక్ష్యాల పరంగానే కాదు.. డబ్బుకూ ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. ఆర్థిక విషయాల్లో పాజిటివ్‌ మైండ్‌సెట్‌తో ఉండడం వల్ల డబ్బు సమస్యల్లేకుండా ముందుకు సాగడంతో పాటు భవిష్యత్తుకు ఆర్థిక భరోసా అందించచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

పోలికలొద్దు!
కొంతమంది ప్రతి విషయంలో ఎదుటివారితో పోల్చుకుంటుంటారు. అవి వస్తువులైనా, మరేదైనా సరే.. తమకు ఉండి ఇతరులకు లేని వాటిని పక్కన పెట్టి.. ఇతరుల వద్ద ఉన్న వాటి పైనే దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలో తమ ఆర్థిక స్థోమతనూ లెక్క చేయరు. అవసరానికి మించి అప్పులు చేయడానికీ వెనకాడరు. దీనివల్ల డబ్బు వృథా అవడంతో పాటు మానసిక సంతోషం కూడా దూరమవుతుంది. కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం మాని.. ఆర్థికంగా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ముందు పరిశీలించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే మనకొచ్చే ఆదాయాన్ని బట్టి.. ఖర్చులు, పొదుపు-మదుపులు ప్లాన్‌ చేసుకుంటే అనవసరంగా అప్పులపాలు కావాల్సిన ముప్పు తప్పుతుంది. ఇలా ఉన్నంతలోనే సానుకూల ఆలోచనలు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులూ ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చు.

సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాకే..!
ఇల్లు, కారు.. వంటివి కొనడం ప్రతి ఒక్కరికీ కల. ఇందుకోసం పైసా పైసా కూడబెట్టి మరీ డబ్బు దాచుకుంటుంటారు. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటారు. ఆఖరికి ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇష్టపడి కొనుక్కున్న ఇల్లే తలకు మించిన భారమవుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే.. ముందుగా మన ఆర్థిక పరిస్థితుల్ని బట్టి సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకోవాలంటున్నారు నిపుణులు. డబ్బు విషయంలో ఇదీ ఓ సానుకూల ఆలోచనే అంటున్నారు. అలాగని ఇల్లు కొనడం/కట్టుకోవడం తప్పు కాదు.. అయితే ఈ క్రమంలో మన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎంత పెద్ద ఇల్లు కొనాలో బేరీజు వేసుకోవడం, గొప్పలకు పోకుండా.. మన వద్ద ఉన్న డబ్బును బట్టే ఇంటీరియర్‌ చేయించుకోవడం, ఇతర వస్తువులు కొనుక్కోవడం మంచిది. ఇలా ఒక లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత.. వెంటనే మరో లక్ష్యాన్ని పూర్తి చేయడం కాకుండా కొన్ని రోజులు ఆగి.. పరిస్థితులు కాస్త కుదుటపడ్డాక దానిపై దృష్టి పెట్టడం వల్ల డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు రావు.. తద్వారా ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నెమ్మదిగా మన భవిష్యత్‌ లక్ష్యాలను పూర్తిచేసుకోవచ్చు.

ఈ పొరపాట్లు వద్దు!
డబ్బు విషయంలో కొంతమంది మహిళలు చేసే కొన్ని పొరపాట్లు కూడా ఆర్థిక పరంగా వారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో డబ్బు వ్యవహారాలన్నీ తమ భర్తలు/ఇతర కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టడం, కుటుంబం కోసం డబ్బు పొదుపు చేయడం మగవాళ్ల బాధ్యత అని భావించి తమ సంపాదనను అనవసరంగా ఖర్చు చేయడం, తమకంటూ ప్రత్యేకంగా పొదుపు-మదుపులు చేసుకోకుండా.. భాగస్వామిపై ఆధారపడడం.. నిజానికి ఇలాంటివన్నీ ఆలోచిస్తే చిన్న విషయాలే అనిపిస్తాయి.. కానీ సమయం వచ్చినప్పుడు అనిపిస్తుంటుంది.. ‘అప్పుడే జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలన్నీ వచ్చేవి కాదు కదా!’ అని. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పొరపాట్లేవీ చేయకుండా.. ముందుగానే ప్లాన్‌ ప్రకారం సానుకూల ఆలోచనలతో ముందుకు సాగడం, తమకంటూ కొంత డబ్బు వెనకేసుకోవడం.. వంటివి చేస్తే భవిష్యత్తులో ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం రాదు.

అలాంటి వాతావరణం ముఖ్యం!
మనం ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. మన మనసు మనల్ని ప్రతికూల ఆలోచన వైపు లాగుతుంటుంది. ఇందుకు మన చుట్టూ ఉండే వ్యక్తులు, పరిస్థితులే కారణం. ఆర్థిక విషయంలో మనకంటూ సొంత ప్రణాళికలు, లక్ష్యాలున్నప్పటికీ.. మనపై ఈర్ష్యాద్వేషాలతో ఇతరులు చెప్పే మాటలు, చేతలు ఒక్కోసారి మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. స్థోమతకు మించి ఖర్చు పెట్టేలా, అనవసర జల్సాలకు ప్రేరేపించేందుకు కారణమవుతాయి. దీనివల్ల కూడా సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల మాటలు పట్టించుకోకుండా ఉండడంతో పాటు.. ఆర్థిక విషయాల్లో సానుకూల సలహాలిచ్చే వ్యక్తులుండేలా జాగ్రత్తపడడం, అలాంటి వారితోనే స్నేహం చేయడం, పాజిటివిటీని నింపే వాతావరణం ఉండేలా చూసుకోవడం.. ఇవన్నీ ముఖ్యమే అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్