అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారా?

స్నేహమంటే ప్రాణమిస్తాం.. వారేం చేసినా ఫ్రెండ్సే కదా అని భరిస్తాం.. అయితే ఈ అలసత్వమే కొంతమంది మధ్య స్నేహబంధాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనం వారితో స్నేహంగానే మెలిగినా.. అవతలి వారు స్వార్థపూరిత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు.

Updated : 10 Oct 2023 20:49 IST

స్నేహమంటే ప్రాణమిస్తాం.. వారేం చేసినా ఫ్రెండ్సే కదా అని భరిస్తాం.. అయితే ఈ అలసత్వమే కొంతమంది మధ్య స్నేహబంధాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనం వారితో స్నేహంగానే మెలిగినా.. అవతలి వారు స్వార్థపూరిత ధోరణితో వ్యవహరించే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి వారు మీతో పని ఉన్నంత సేపు బాగానే ఉన్నా.. అవసరం తీరిపోయాక మిమ్మల్ని దూరం పెట్టచ్చు. కాబట్టి ‘వాడుకొని వదిలేసే’ వ్యక్తిత్వం ఉన్న ఇలాంటి వారి ప్రవర్తనను ఆదిలోనే గుర్తించి, పలు జాగ్రత్తలు తీసుకుంటే.. ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం రాదంటున్నారు నిపుణులు.

ఇలా వ్యవహరిస్తున్నారా?

స్నేహితులంటే.. అవసరాల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. కానీ తమ స్వార్థం కోసం అవతలి వారిని వాడుకొని వదిలేసే వ్యక్తిత్వం ఉన్న వారు.. తమకు కావాల్సినప్పుడు మీరు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అదే మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు ముందుకు రారు.. సరికదా సాకులు చెప్పి మరీ తప్పించుకుంటుంటారు.

ఎంతసేపూ వాళ్లు చెప్పిందే మీరు వినాలని, ఏదో ఒకటి చేసి వారిని సమస్యల నుంచి గట్టెక్కించాలని ప్రాధేయపడుతుంటారు. అదే మీకు వారి సహాయం కావాల్సి వచ్చినప్పుడు మాత్రం.. మీరు చెప్పే విషయాలేవీ వారు వినిపించుకోరు.. ఒకవేళ విన్నా ‘అబ్బే అదంత పెద్ద సమస్యేమీ కాదు.. లైట్‌ తీస్కో!’ అంటూ ఉచిత సలహాలిస్తుంటారు. అంటే.. మీ సమస్యలు, బాధలు వారికి లెక్కలేదన్నమాట!

ఆర్థిక ప్రయోజనాల కోసం స్నేహితుల్ని వాడుకునే వారూ లేకపోలేదు. ఇదే విషయంలో మీకు అవసరం వస్తే మాత్రం వారు మొహం చాటేస్తుంటారు. కాబట్టి ‘ఫ్రెండే కదా.. తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తుందిలే!’ అని ఎంతపడితే అంత ఇస్తే.. ముందు ముందు మీరే నష్టపోయే ప్రమాదం ఉంది.

ఎంత ప్రాణ స్నేహితులైనా.. సహాయం పొందినప్పుడు థ్యాంక్స్‌ చెప్పడం, మరో రకంగా సహాయపడడం.. ఇలా ఏదో ఒక రకంగా కృతజ్ఞత తెలుపుతుంటారు. కానీ ఇలాంటి కృతజ్ఞతా భావం స్వార్థపరుల్లో ఇసుమంతైనా కనిపించదట! అందుకే ఇలా మీతో అవసరం తీరాక మొహం చాటేసే వారికి.. మరోసారి దూరంగా ఉంటే మంచిదంటున్నారు నిపుణులు. అయినా మొహమాటం లేకుండా మీ సహాయం కోరితే ‘నో’ చెప్పడానికి వెనకాడకూడదంటున్నారు.

అవతలి వారిని వాడుకొని వదిలేసే స్వార్థపరులు.. ఎదుటివాళ్లు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డా, జీవితంలో అభివృద్ధి సాధిస్తున్నా.. అంతెందుకు.. కాస్త మంచి బట్టలు కట్టుకుని బాగా రడీ అయినా ఓర్వలేకపోతారు. మాటలు, చేతలతో పరోక్షంగా వారి మూడ్‌ని చెడగొట్టే దాకా వదిలిపెట్టరు. ఇలా అవతలి వారు బాధ పడుతుంటే లోలోపల ఆనందిస్తారు.

ఆరోగ్యపరంగా, మానసికంగా, ఎమోషనల్‌గా ఎవరి పరిమితులు వారికి ఉంటాయి. నిజమైన స్నేహితులైతే మీ పరిమితుల్ని గౌరవిస్తారు. అదే స్వార్థపరులకు వీటితో సంబంధం ఉండదు. వారి అవసరాల కోసం మీ పరిమితుల్ని లెక్కచేయకుండా మరీ మీ సహాయం కోసం బలవంతపెడతారు.

ముల్లును ముల్లుతోనే..!

అయితే ఇలాంటి వారి ప్రవర్తన వల్ల మీ స్నేహబంధం దెబ్బతినడంతో పాటు.. మీ ఇతర స్నేహాల పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే ఎదుటివారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వారిని సాధ్యమైనంత దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు.

చాలా విషయాల్లో మనం మన స్నేహితులకు ‘నో’ చెప్పడానికి సంకోచిస్తాం. కానీ ఎదుటివారిలో స్వార్థపూరిత ధోరణి, మిమ్మల్ని అవసరానికి వాడుకొని వదిలేసే ప్రవర్తన.. వంటివి కనిపిస్తే మాత్రం ‘ఇక మా వల్ల కాదని’ మొహమ్మీదే చెప్పేయడం మంచిది.

ఎదుటివారు వాళ్ల అవసరం కోసమే మీతో స్నేహంగా మెలుగుతున్నట్లు మీరు గుర్తిస్తే.. వారి విషయంలో కొన్ని హద్దులు పెట్టుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇకపై ఆర్థికంగా, ఇతర విషయాల్లో వారికి సహాయపడకుండా ఉండాలన్న కచ్చితమైన నియమాలు పెట్టుకోవాలంటున్నారు.

మీ విషయాల్ని వారు అలక్ష్యం చేస్తే.. ఇకపై మీరూ అలాగే ప్రవర్తించండి. ఇలా కొన్నిసార్లు ముల్లును ముల్లుతోనే తీయడం వల్ల సమస్య పరిష్కారమవుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా అవతలి వారే స్వయంగా మీకు దూరమవుతారు.

అనుబంధాల్లో ఏ సమస్యకైనా కమ్యూనికేషన్‌ను మించిన పరిష్కారం మరొకటి లేదు. కాబట్టి మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారన్న సందేహం వచ్చినప్పుడు.. మీ ఫీలింగ్స్‌ని, వారి వల్ల మీరు పడుతోన్న బాధను నేరుగా వారితోనే చెప్పి చూడండి. మారితే సరే సరి.. లేదంటే వాళ్లను మీ జీవితంలో నుంచి తొలగించడానికి వెనకాడకూడదు.

స్నేహితుల మధ్య దాపరికాలుండవు.. అయితే మీతో స్వార్థపూరితంగా వ్యవహరించేవారితో మీ వ్యక్తిగత, కెరీర్‌ సంబంధిత విషయాలేవీ పంచుకోకపోవడమే మంచిది. ఇదీ ఒక రకంగా వారిని దూరం పెట్టడం లాంటిదే!

అవతలి వారు చేసిన మోసానికి కొంతమంది గిల్టీగా ఫీలవుతారు.. అభద్రతా భావానికి లోనవుతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కాబట్టి ఎవరో చేసిన తప్పుకు మీరు ఫీలవ్వాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ మంచి కోరే వారితో ఎక్కువ సమయం గడపడం, మీ బాధను వారితో పంచుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.

స్వీయ ప్రేమను పెంచుకోవడం, నచ్చిన అంశాలపై దృష్టి పెట్టడం వల్ల కూడా మనలో పాజిటివిటీ పెరుగుతుంది. ఈ సానుకూల దృక్పథమే ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా నిలబడగలిగేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్