Published : 22/11/2022 19:57 IST

గొడవ పడి మూడ్ పాడైందా?

ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గొడవలకు దారితీస్తుంటాయి. భిన్న వ్యక్తిత్వాలు కూడా అందుకు కారణం కావచ్చు. అయితే చాలామంది వాగ్వాదం జరిగిన తర్వాత కూడా పదే పదే అవే ఆలోచనలతో ఇబ్బంది పడుతుంటారు. ‘నా మూడంతా పాడైపోయింది’ అని బాధపడుతుంటారు. ఈ క్రమంలో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చంటున్నారు మానసిక నిపుణులు. మరి, అవేంటో చూద్దాం రండి...

ధ్యానం చేయండి..

ఎవరితో అయినా వాగ్వాదం జరిగిన తర్వాత చాలామందిలో ఆ కోపం అలానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దానిని ఇతరులపై కూడా చూపిస్తుంటారు. ఈ క్రమంలో శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చు. ప్రాణాయామం, యోగా వంటివి ఈ కోవకే చెందుతాయి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా ఒత్తిడి కలిగించే కార్టిసాల్‌ హార్మోన్‌ తీవ్రతను తగ్గిస్తుంది. కోపం వచ్చినప్పుడు కండరాలు పట్టేస్తుంటాయి. ఈ వ్యాయామాలు చేయడం వల్ల అవి తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.

ఆ ప్రదేశాన్ని ఊహించుకోండి...

కొంతమంది అప్పుడప్పుడు తమకు నచ్చిన ప్రదేశాలను ఊహించుకుంటారు. ఈ క్రమంలో వారు తాము అక్కడ ఎలా ఎంజాయ్‌ చేస్తామో ఊహించుకుంటూ స్వాంతన పొందుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. మీరు కూడా గొడవ జరిగిన తర్వాత మీకు నచ్చిన ప్రదేశాన్ని ఊహించుకోండి. ఆ ప్రదేశం గుడి, బీచ్‌, జలపాతం, పార్క్‌.. ఏదైనా కావచ్చు.

అలా నచ్చిన ఆహారంతో...

ప్రయాణాలు చేసినప్పుడు శరీరం అలసటగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు ప్రత్యేకించి చలి కాలంలో అయితే గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది. అలాగే ఏదైనా వాగ్వాదం జరిగిన తర్వాత గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేయండి. ఆ తర్వాత నచ్చిన వంటకంతో ఆహారం తీసుకుంటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. అదే సమయంలో నచ్చిన సినిమా చూస్తే జరిగిన గొడవ సంగతి మర్చిపోయి మంచి మూడ్‌లోకి ఇట్టే వచ్చేస్తారు.

దానిని పక్కన పెట్టండి...

మనుషుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. ఒకవేళ జరిగిన దానిలో మీరే కరెక్ట్‌ అని భావిస్తే అవతలి వ్యక్తి ఎక్కడ తప్పు చేస్తున్నారో ఆలోచించండి. ఈ చిన్న జీవితంలో గొడవల వల్ల సాధించేది ఏమీ ఉండదని గమనించండి. కాబట్టి, వాళ్లే ముందు మాట్లాడాలనే ఈగోని పక్కన పెట్టి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకరికొకరు తమ సమస్యల గురించి వివరంగా చెప్పుకోలేకపోవడం వల్లే ఈ ప్రపంచంలో సగం గొడవలు జరుగుతున్నాయని నిపుణులు అంటుంటారు. కాబట్టి, గొడవ జరిగిన తర్వాత అవతలి వ్యక్తి వైపు నుంచి ఆలోచించి ఆ సమస్యను అక్కడితో ముగించే ప్రయత్నం చేయండి. హ్యాపీగా ఉండండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి