Published : 28/02/2023 00:59 IST

Katya Coelho: సింధు,సానియాల్లా నిలవాలనీ!

‘దీనిలో అమ్మాయిల్లేరు’ విండ్‌ సర్ఫింగ్‌ నేర్చుకోవాలనుకున్నప్పుడు కాత్యాకి అందరూ చెప్పిన మాట ఇది. అయితే ఏంటి? నేను ప్రారంభిస్తా అంటూ నిర్భయంగా అలలతో పోటీపడే ఈ ఆటలో అడుగు పెట్టిందామె. దేశం నుంచి మొదటి మహిళా విండ్‌ సర్ఫర్‌గా పేరు తెచ్చుకోవడమే కాదు.. ఏషియన్‌ గేమ్స్‌కీ అర్హత సాధించింది.

‘నాన్నా.. ఎలా అనిపించింది? సముద్ర నీటిలో.. అలలతో పోటీపడుతూ దూసుకెళుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది? అందరికంటే వేగంగా ఎలా దూసుకెళ్లావ్‌’ అంటూ తండ్రి డొనాల్డ్‌ కోల్హో ఎప్పుడు విండ్‌ సర్ఫింగ్‌ రేసులో పాల్గొన్నా కాత్యా కోల్హో ఆశ్చర్యంగా చూడటమే కాదు. తన సందేహాలన్నీ చకచకా బయటపెట్టేసేది. ఈమెది గోవా. నాన్న విండ్‌ సర్ఫర్‌. దేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఎప్పుడు పోటీలు జరిగినా వీళ్లమ్మ కాత్యానీ తన తోబుట్టువులనీ వెంటపెట్టుకొని వెళ్లేది. అందరు పిల్లల్లాగే నీళ్లంటే ఇష్టపడే కాత్యా నెమ్మదిగా దానిపై దూసుకెళ్లే సర్ఫింగ్‌పై మనసు పారేసుకుంది.

‘నాతోపాటు అన్నయ్యకీ ఈ క్రీడపై ఆసక్తి కలగడంతో నాన్న తనకి నేర్పడం మొదలుపెట్టారు. నేనూ నేర్చుకుంటా అని పట్టు పట్టాకే.. నా ఆసక్తి చూడటం వరకూ కాదని అర్థమైందాయనకి. అప్పటి నుంచి నాకూ శిక్షణ ఇచ్చారు’ అని గుర్తుచేసుకుంటుంది 23 ఏళ్ల కాత్యా. నేర్చుకోవడం ప్రారంభించిన ఏడాదికే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. 14 ఏళ్లకే యూత్‌ ఒలింపిక్స్‌లో పాల్గొని ‘అతి పిన్న సెయిలర్‌’గా నిలిచింది. తన కెరియర్‌లో ఇప్పటివరకూ జాతీయ స్థాయిలో 10, రెండు ఏషియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో బంగారు పతకాలు, గతేడాది ఒక వెండి పతకం గెలిచింది. అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున పోటీ చేసిన తొలి మహిళా విండ్‌ సర్ఫర్‌గా నిలిచింది.

తాజాగా ఆర్మీ యాటింగ్‌ నోడ్‌ సంస్థ విండ్‌ సర్ఫింగ్‌ పోటీలు నిర్వహించింది. దీనిలో గెలిచిన వారికి ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. ఐక్యూ ఫాయిల్‌ కేటగిరీలో అర్హత సాధించడమే కాదు సీనియర్‌ నేషనల్స్‌లో బంగారు పతకాలు కొల్లగొట్టి ఏషియన్‌ గేమ్స్‌కు అర్హత సాధించింది. ‘నా కెరియర్‌లో ఇది మరచిపోలేని అనుభవం. ఏషియన్‌ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్న ఆలోచనే గర్వంగా ఉంది’ అనే కాత్యా మొదట విండ్‌ సర్ఫింగ్‌లో చేరినప్పుడు ఎంతోమంది నిరాశపరిచారు. దేశంలో ఈ క్రీడకి అంత గుర్తింపు లేదు. పైగా దీన్ని ఎంచుకుంటున్న అమ్మాయిలే లేరని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. వాళ్లకి ‘అందరూ వెళ్లే దారిలో వెళితే గొప్పేముంది? బ్యాడ్మింటన్‌కి సింధూ, టెన్నిస్‌కి సానియా.. ఇలా కొన్ని ఆటల పేర్లు చెప్పగానే క్రీడాకారుల పేర్లెలా గుర్తొస్తాయో.. విండ్‌ సర్ఫింగ్‌ అంటే నా పేరు గుర్తుకొచ్చేలా చేయాలను కున్నా’నంటుంది కాత్యా. ఏషియన్‌ గేమ్స్‌లో పతకంతో ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటోంది. ఆల్‌ ద బెస్ట్‌ చెబుదామా మరి?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి