డౌటే వద్దు.. వీటిలో మనమే టాప్!

కొన్ని సందర్భాల్లో పురుషుల కన్నా సమర్థంగా పని చేయగలిగే సత్తా ఉన్నా వివిధ కారణాల వల్ల మహిళల ప్రతిభ మరుగున పడిపోతుంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులలో అయినా సరే.. కొన్ని పనులను పురుషుల కంటే మహిళలే నేర్పుగా చేయగలరంటున్నారు నిపుణులు.

Updated : 16 Mar 2024 15:38 IST

కొన్ని సందర్భాల్లో పురుషుల కన్నా సమర్థంగా పని చేయగలిగే సత్తా ఉన్నా వివిధ కారణాల వల్ల మహిళల ప్రతిభ మరుగున పడిపోతుంటుంది. అయితే ఎలాంటి పరిస్థితులలో అయినా సరే.. కొన్ని పనులను పురుషుల కంటే మహిళలే నేర్పుగా చేయగలరంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకోవాలనిపిస్తోందా? అయితే ఇది చదివేయండి మరి..

ఒత్తిడిని అదుపు చేసుకోగలరు..

ఏదైనా బాధ కలిగించే సంఘటన జరిగినప్పుడు మహిళలు వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతమాత్రాన మహిళలు బలహీన మనస్కులని ముద్ర వేసేయడం సరికాదు. క్లిష్ట సమయాల్లో పురుషుల కన్నా మహిళలే సమర్థంగా ఆలోచించగలరు. దీని వెనక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. మనం ఎప్పుడైనా ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలై దానిని నియంత్రిస్తుంది. ఇది పురుషుల శరీరంలో కన్నా మహిళల శరీరంలో అధికంగా ఉత్పత్తి అవుతుంది. అందుకే మగవారితో పోలిస్తే వారు తక్కువ సమయంలో ఒత్తిడిని అదుపు చేసుకోగలరు. అంతేకాకుండా సమాన స్థాయిలో ఒత్తిడికి గురైన స్త్రీపురుషులిద్దరికీ ఒకే రకమైన ప్రశ్నలు సంధిస్తే.. మహిళలే సరైన సమాధానాలు చెప్పగలరని ఒక పరిశోధనలో కూడా తేలింది.

భావవ్యక్తీకరణ..

‘నలుగురు ఆడవాళ్లు ఒక చోట చేరితే ఎక్కడ లేని కబుర్లు చెప్పుకుంటారు..' అని చాలామంది అంటూ ఉంటారు. నిజమే.. ఇది వారి భావవ్యక్తీకరణకు ఒక నిదర్శనం. పురుషులతో పోలిస్తే మహిళలు తమ అభిప్రాయాలను బాగా వెలిబుచ్చగలరు. అంతేకాకుండా స్త్రీలు ఎదుటివారు తమతో ఎలా మాట్లాడుతున్నారనే దాని గురించి క్షణాల్లో అర్థం చేసుకొని స్పందించగలరు. అలాగే మగవారి కంటే ఆడవారిలో మెదడు ఏ మాట మాట్లాడాలి? ఏది మాట్లాడకూడదు? అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుందట. అందుకే మహిళలు మాట్లాడే మాటల్లో వివాదాస్పదమైన అంశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు.

ఆర్థిక వ్యవహారాలు..

ఏ సమయంలో ఎలా, ఎంత ఖర్చు పెట్టాలి అనే అంశంపై పురుషుల కన్నా మహిళలకే అవగాహన ఎక్కువగా ఉంటుందట. అంతేకాదు తాము ఖర్చు పెడుతున్న ప్రతి పైసా సద్వినియోగం అవుతుందో లేదో కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారట. అందుకే ఆర్థిక నిర్వహణ మహిళల చేతుల్లో ఉంటే ఆ కుటుంబాలు ఎంతో అభివృద్ధిని సాధించడం మనం చూస్తూనే ఉంటాం.

మల్టీటాస్కింగ్‌లో సిద్ధహస్తులు..

మహిళలు ఒకేసారి భిన్నమైన పనులను సమర్థంగా చేయగలరు. ఉదాహరణకు గృహిణి విషయంలోనే చూస్తే.. ఒక పక్క వంట చేస్తూనే పిల్లలను స్కూలుకి వెళ్లడానికి తయారు చేస్తుంది. టీవీ చూస్తూనే చీరకు అందమైన ఎంబ్రాయిడరీ కుడుతుంది. సాయంత్రం సమయంలో వంట చేస్తూనే పిల్లల చేత హోంవర్కు చేయిస్తూ ఉంటుంది. అదే పురుషుల విషయానికి వస్తే మల్టీటాస్కింగ్‌లో కాస్త వెనకబడే ఉంటారంటున్నారు నిపుణులు. ఎందుకంటే మహిళలు చేసినంత సమర్థంగా వాళ్లు ఎక్కువ పనులు ఒకేసారి పూర్తి చేయలేరట.

అద్భుతమైన జ్ఞాపకశక్తి!

ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో మహిళ ఠక్కున చెప్పగలదు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా మహిళలు కీలక విషయాలను ఎంత మాత్రం మర్చిపోరు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ మహిళల్లో అలా జరగదట. అంతేకాకుండా ఎంత బాధలో ఉన్నప్పటికీ స్త్రీలు ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ గుర్తుపెట్టుకొని మరీ తీసుకురాగలరట!

ఇవే కాదు.. ఆలోచనాధోరణి, ప్రవర్తన, బాధ్యతాయుతంగా మెలగడం.. మొదలైన చాలా విషయాల్లో మహిళలే సమర్థులు. కావాలంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.. మీకే అర్థమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్