Updated : 08/02/2023 08:23 IST

కష్టాలు దాటి సారథులయ్యారు

నాయకత్వం అంత తేలిగ్గా దక్కేదికాదు. అవమానాలు, అడ్డంకులు ఎన్నొచ్చినా ఎదురుతిరిగి నిలవగలగాలి. అలా నిలిచి శభాష్‌ అనిపించుకున్న వాళ్లే వీళ్లు! త్వరలో ప్రారంభంకానున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌లో కొన్ని దేశాల సారథుల స్ఫూర్తి గాథలివీ...


తిరస్కరణలే రాటుదేల్చాయి

‘తనేమైనా హర్భజన్‌ సింగా? మహిళా క్రికెటరేగా!’ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ని పంజాబ్‌ పోలీసు విభాగంలోకి తీసుకోమన్నప్పుడు అక్కడి పైఅధికారి అన్న మాటలివి! అప్పటికే హర్మన్‌ వరల్డ్‌కప్‌లో ఆడింది కూడా. పంజాబ్‌లోని ధారాపూర్‌కు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న కోరిక నెరవేర్చడానికి హర్మన్‌ క్రీడాకారిణి అయ్యింది. ఆయనలానే ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ మొదలుపెట్టినా.. టీవీలో సెహ్వాగ్‌ ఆట చూశాక మనసు క్రికెట్‌ వైపు మళ్లింది. నాన్నే మొదటి కోచ్‌. 20 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించింది. కుటుంబానికి తన అండ అవసరమైనప్పుడు ప్రభుత్వ కొలువుకు ప్రయత్నిస్తే అన్నీ తిరస్కరణలే. ఆ అవమానాలే హర్మన్‌లో నిరూపించుకోవాలన్న కసిని రేపాయి. బ్యాట్‌తోపాటు బంతితోనూ సత్తా చాటింది. మూడేళ్లకే మిథాలీ స్థానంలో కెప్టెన్‌ పగ్గాలు అందుకుంది. 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడి తన పేరు దేశమంతా మారుమోగేలా చేసింది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో సారథి తనే. టీ20లో సెంచరీ సాధించిన, 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ క్రీడాకారిణి ఆమె. అర్జున అవార్డునీ అందుకుంది. ‘మనం ఏమవగలమని నమ్ముతామో అదే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది’ అనే సూత్రాన్ని నమ్మే హర్మన్‌ అండర్‌19 అమ్మాయిల స్ఫూర్తితో ప్రపంచకప్‌ సాధించడమే లక్ష్యంగా తన సేనను నడిపిస్తోంది.


ఆమె ప్రోత్సాహంతోనే..

క్రికెట్‌ను ప్రేమించే దేశాల్లో బంగ్లాదేశ్‌ కూడా ఒకటి. దాన్ని కెరియర్‌గా ముఖ్యంగా అమ్మాయి ఎంచుకున్నప్పుడే బోలెడు ఆంక్షలు. నిగర్‌ సుల్తానాకు అవి బంధువులు, చుట్టుపక్కల వాళ్ల నుంచి వచ్చాయి. రెండేళ్ల వయసు నుంచే బంతి, బ్యాటంటే మక్కువ. వీళ్లది షేర్పూర్‌ అనే చిన్న పట్టణం. ‘క్రికెట్‌.. మగవాళ్ల ఆట’ అంటూ నిగర్‌ మనసు మళ్లించడానికి చాలామంది ప్రయత్నించారు. స్కాలర్‌ విద్యార్థి. మార్కులు తగ్గినప్పుడు విమర్శలూ వచ్చాయి. కానీ ఆమె తల్లి తనకు అండగా నిలిచింది. తన కల నెరవేర్చడానికి రూపాయి రూపాయి కూడబెట్టిందా కుటుంబం. 2013లోనే నేషనల్‌ క్యాంపుకి పిలుపు వచ్చినా జాతీయ జట్టులో చోటు దక్కలేదు. అయినా నిరాశ కోల్పోకుండా ఆటతోనే అవకాశాలు వచ్చేలా చేసుకుంది. 2015లో టీమ్‌లోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. కెప్టెన్‌ స్థాయికి ఎదిగింది.


అమ్మయ్యాకా అదే జోష్‌తో...

15 ఏళ్లకే మైదానంలో అడుగు పెట్టి  సుడిగాలి క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంది పాకిస్థానీ కెప్టెన్‌ బిస్మా మారుఫ్‌. కశ్మీరీ మూలాలున్న కుటుంబం. తల్లిదండ్రులిద్దరూ చదువుకొన్నవాళ్లు. దాంతో బిస్మాని డాక్టర్‌ చేయాలని కలలు కన్నారు. కానీ స్కూల్‌ రోజుల్లోనే బిస్మా మనసంతా క్రికెట్‌తో నిండిపోయింది. ఆ రంగంలో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. చెలరేగి ఆడింది. విజయాలపై విజయాలు నమోదు చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే టీ20 కెప్టెన్‌గా ఎదిగింది. క్రీడాకారిణులకు కుటుంబ జీవితం కష్టమే అనే మాటలని ఖండిస్తూ వివాహ జీవితానికీ ప్రాధాన్యం ఇచ్చింది. పాప ఫాతిమా పుట్టిన ఆరునెలలకే తనని చంకనెత్తుకుని మైదానంలో సాధన మొదలుపెట్టింది. మునుపటి హుషారుతో పరుగుల తుఫానైంది. ‘పదహారేళ్ల అనుభవం నాది. గతంలో పోలిస్తే క్రీడా సంఘాలు మహిళలకు అనుకూలంగా చేస్తున్న పాలసీల వల్లే మాలాంటి తల్లులు తిరిగి ఆటలోకి రావడం సాధ్యమవుతోంది’ అనే బిస్మాని ఎంతోమంది క్రీడాకారిణులు వ్యక్తిగత, క్రీడా జీవితాన్ని సమన్వయం చేసుకోవడంలో స్ఫూర్తిగా తీసుకుని మైదానంలో అడుగుపెడుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి