Pappu Srinidhi: కరవు సీమలో కుంకుమ పువ్వు

కుంకుమ పువ్వు... ఆ పేరు వింటే గుర్తుకొచ్చేది కశ్మీరం. అక్కడి మంచు కొండల్లో మాత్రమే సాగయ్యే ఈ పంట.. కరవు సీమగా పేరొందిన రాయలసీమలోనూ పండుతోందంటే నమ్ముతారా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు పప్పు శ్రీనిధి.

Updated : 29 Mar 2023 07:38 IST

అంకుర విజయం

కుంకుమ పువ్వు... ఆ పేరు వింటే గుర్తుకొచ్చేది కశ్మీరం. అక్కడి మంచు కొండల్లో మాత్రమే సాగయ్యే ఈ పంట.. కరవు సీమగా పేరొందిన రాయలసీమలోనూ పండుతోందంటే నమ్ముతారా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు పప్పు శ్రీనిధి. ఎవరూ ధైర్యం చేయని సాహసాన్ని చేసి, ఉత్పత్తులను మార్కెట్‌లోకీ తీసుకొచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

మాది అన్నమయ్య జిల్లా చిప్పిలి గ్రామం. అమ్మ భార్గవి, నాన్న శ్రీకాంత్‌రెడ్డి. బెనారస్‌ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్‌ పూర్తిచేసి, ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరా. దేశంలో కుంకుమ పువ్వుకు ప్రత్యేక స్థానముంది. కశ్మీర్‌లో పండినా కన్యాకుమారి వరకు అక్కడి రైతులే సరఫరా చేయాలి. అంత భారీగా పంట సాగు అవడం లేదు. అందుకే మార్కెట్‌లో నకిలీ సమస్య. సాంకేతికత పెరిగిన నేటి రోజుల్లో ఇక్కడెందుకు నాణ్యమైన కుంకుమపువ్వు పండించకూడదన్న ఆలోచన వచ్చింది. బెనారస్‌లోని వ్యవసాయ పట్టభద్రులు, ఆచార్యులతో చర్చించా. కశ్మీర్‌ వెళ్లి, అక్కడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా. చిప్పిలి వాతావరణానికి అనుగుణంగా ఏ మార్పులు చేయాలో ఓ అంచనాకు వచ్చా. కశ్మీర్‌, బెనారస్‌, అలహాబాద్‌, తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిబ్బంది సాయంతో సాగుకు శ్రీకారం చుట్టా. ఇందులో నా భర్త శ్రీనాథ్‌రెడ్డి సహకారమూ ఎంతో!

పది లక్షలతో..

అత్యంత చలి ప్రదేశంలోనే కుంకుమ పువ్వు మొక్కలు పెరుగుతాయి. అందుకని చిప్పిలిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూ.10 లక్షలతో శీతలగది ఏర్పాటు చేశాం. ఎయిర్‌ కూలింగ్‌ సిస్టం ద్వారా అక్కడి శీతోష్ణస్థితిని సృష్టించగలిగాం. ఆపై 2021 ఆగస్టులో కశ్మీర్‌ నుంచి 3.5 క్వింటాళ్ల కుంకుమ పువ్వు విత్తనాలను తీసుకొచ్చి, విత్తాం. ఒక్కో మొక్క నుంచి దాని జీవితకాలంలో 200- 250 గ్రాముల కుంకుమ తీగ దిగుబడిగా వస్తోంది. దాన్నే మనం కుంకుమ పువ్వుగా పిలుస్తాం. క్వింటా నాణ్యమైన విత్తనానికి రూ.30 వేలు నుంచి రూ.50 వేల వరకూ వెచ్చించాలి. విత్తనాలు, రవాణాకు కలిపి రూ.1.2లక్షల వరకూ ఖర్చుచేశా. విత్తనం ఏడు గ్రాముల బరువుంటేనే ఉత్పత్తి ఆశాజనకంగా ఉంటుంది. ఆగస్టు నుంచి నవంబరు నెలల్లోనే పువ్వు వస్తుంది. ఆ తర్వాత విత్తనం నిద్రావస్థలో ఉంటుంది. ఇలా దాదాపు ఆరేళ్ల వరకు ఉత్పత్తి ఉంటుంది. ఏడాది తర్వాత తల్లి విత్తనం నుంచి అయిదు వరకు పిల్ల విత్తనాలొస్తాయి. వాటిని వేరు చేసుకుని కొత్త మొక్కలుగా వేసుకోవచ్చు. ఇలా దిగుబడితోపాటు విత్తనాల ద్వారా కూడా సంపాదించుకోవచ్చు.

పసిపిల్లల్లా..

పువ్వుదశలో రోజూ సూర్యోదయ, సూర్యాస్తమయాల తర్వాత వికసించిన పూలను గది నుంచి వేరుచేసి వాటిల్లోని తీగలు, రేకలను సేకరించి భద్రపరుస్తాం. అలా తీసిన కుంకుమ పువ్వుకు మార్కెట్‌లో గ్రాము రూ.600 వరకు పలుకుతోంది. వీటిని అగరొత్తులు, మందులు, సౌందర్య లేపనాల తయారీలో వాడతారు. క్యాన్సర్‌కీ ఔషధంగా సాయపడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇక గర్భవతులకు కుంకుమ పువ్వు పాలల్లో కలిపివ్వడం మనకు సాధారణమే! ఏడాదిలో మొదటి పంట చేతికొచ్చింది. భారత ప్రభుత్వ సుగంధ ద్రవ్యాల విభాగం, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా గుర్తింపు వచ్చాక మార్కెట్‌లోకీ తీసుకొచ్చాం. ఈ కుంకుమ పువ్వు మొక్కలను పసిపిల్లల్లా చూసుకోవాలి. ప్రతి గంటా వాతావరణ పరిస్థితులను గమనించుకోవాలి. అంత సున్నితమైన పంట ఇది. అయినా విజయవంతంగా పండించగలిగా. తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ పార్లమెంటులో మా కృషిని మెచ్చుకోవడం మా కష్టానికి గుర్తింపుగా అనిపించింది. చాలా సంతోషమేసింది కూడా.

- గుండ్రాతి రాజేష్‌గౌడ్‌, అన్నమయ్య జిల్లా


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్