కలలు నెరవేరే మార్గాలేమిటో తెలుసా?

మన కలలు నెరవేర్చుకోవాలన్నా.. ఉన్నతి సాధించాలన్నా మనం శారీరకంగా, మానసికంగా.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం ఎంతో అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మనం అన్నింటా శక్తిమంతులవుతాం.

Updated : 16 Mar 2024 15:30 IST

మన కలలు నెరవేర్చుకోవాలన్నా.. ఉన్నతి సాధించాలన్నా మనం శారీరకంగా, మానసికంగా.. ఆరోగ్యంగా, దృఢంగా ఉండడం ఎంతో అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యంతోనే మనం అన్నింటా శక్తిమంతులవుతాం.

అయితే ఇది సాధ్యం కావాలంటే కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా తయారు కావాలి. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. అలాగే ఏ వయసులో ఉన్న వారు ఆ వయసుకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

పోషకాహారంతో మొదలు..

ఏ వయసులో ఉన్న మహిళలైనా సరే.. మంచి పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇందులో భాగంగా తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, బీన్స్, పెరుగు, మొలకెత్తిన గింజలు.. వంటి ప్రొటీన్లు ఎక్కువగా లభించే పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. వీటివల్ల శరీరంలో ఎక్కువ మొత్తంలో శక్తి ఉత్పత్తవుతుంది. అంతేకాకుండా బరువు అదుపులో ఉండి చురుగ్గా ఉండడంతో పాటు ఏ పనైనా శ్రద్ధగా చేసుకోగలుగుతారు.

అలాగే మహిళలు నెలసరి సమయంలో కూడా ఎక్కువ శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో ఐరన్ ఎక్కువగా లభించే మొలకెత్తిన గింజలు, బాదం, రెడ్ మీట్.. వంటివి తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

ఇక గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత.. మొదలైన సందర్భాల్లో కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా శక్తిమంతంగా ఉండడానికి డాక్టర్ సలహాతో మంచి పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి.

మహిళలు పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. వంటివి రోజూ ఇష్టం వచ్చినట్లుగా ఎప్పుడు పడితే అప్పుడు చేయడం కాకుండా.. వాటికంటూ ఒక కచ్చితమైన సమయం నిర్దేశించుకోవాలి. అలాగే ఒకేసారి ఎక్కువ తినడం కాకుండా.. కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బయట దొరికే స్నాక్స్, జంక్‌ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. వీటన్నిటినీ క్రమం తప్పకుండా పాటిస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం.. శరీరానికి శక్తీ లభిస్తాయి.


వ్యాయామం మానద్దు..

శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావడానికి వ్యాయామం ఎంతగానో సహకరిస్తుంది. వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు బాగా సరఫరా అవుతాయి. తద్వారా గుండె, వూపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అలాగే కండరాలు దృఢంగా తయారవడంతో పాటు శరీరానికి శక్తి అందుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

ఎక్సర్‌సైజ్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలాగంటే.. వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

మీరెప్పుడైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు వ్యాయామం చేశారా? ఒత్తిడిలో ఉన్నప్పుడు వ్యాయామమేంటి? అంటారా.. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ అరగంట పాటు వ్యాయామం చేయడం ద్వారా మెదడులో విడుదలయ్యే కొన్ని రకాల రసాయనాల వల్ల మనసు రిలాక్సవుతుంది. దీంతో పాటు శరీరంలో కొత్త శక్తి ఉత్పత్తవుతుంది. కాబట్టి రోజూ ఎదురయ్యే ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడాన్ని రోజువారీ పనుల్లో భాగం చేసుకోవాలి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం అలసిపోయినట్త్లె నిద్ర కూడా సుఖంగా, ప్రశాంతంగా పడుతుంది.


వైద్య పరీక్షలు.. మరవద్దు!

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే చాలామంది ఆడవాళ్లు ఒంట్లో బాగానే ఉంది కదా.. ఇప్పుడు వైద్య పరీక్షలెందుకు అనే ధోరణిలో ఆలోచిస్తారు. కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం తప్పనిసరి. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే రకరకాల ఆరోగ్య సమస్యల గురించి అవగాహన పెంచుకుని అవి రాకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

బీపీ, మధుమేహం.. వంటివి యవ్వనంలో ఉన్నప్పుడు రాకపోయినా వయసు పెరిగే కొద్దీ వేధిస్తుంటాయి. కాబట్టి ముందు నుంచీ వీటిపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

దీంతో పాటు సంవత్సరానికోసారి దంత పరీక్ష చేయించుకోవడం, దంతాలను శుభ్రం చేయించుకోవడం, రెండేళ్లకోసారి కంటి పరీక్షలు; రోగనిరోధక శక్తి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఉపకరించే పరీక్షలు; రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తపడడానికి మమోగ్రామ్; పెల్విక్ ఎగ్జామ్, పాప్‌స్మియర్; ఎముకలకు సంబంధించిన పరీక్షలు.. మొదలైనవన్నీ నిర్ణీత సమయం ప్రకారం చేయించుకోవడం మాత్రం తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఫలితంగా ఆరోగ్యంపై సరైన అవగాహన ఏర్పడుతుంది.

ఆందోళన వద్దు..

ఎలాంటి సమస్యలు, ఒత్తిళ్లు లేనప్పుడు మనసు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు. ఎప్పుడైతే ఆనందంగా జీవితం గడుపుతుంటామో అన్ని రోజులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. అలాకాకుండా అనవసరమైన వాటికి ఆందోళన చెందడం, మానసిక ఒత్తిడి, ఆదుర్దా.. వంటి వాటి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా క్షీణించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండడం వల్ల ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు.

ఆధ్యాత్మిక చింతనతో..

ఆధ్యాత్మిక చింతన ద్వారా కూడా ప్రశాంతంగా ఉండచ్చు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మానసికంగానూ దృఢంగా ఉండచ్చు. ఇందుకోసం రోజూ రాత్రి పడుకోవడానికి ముందు ప్రశాంతమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని కాసేపు ధ్యానం చేయడం.. ఆ రోజు మీ ద్వారా ఏ విషయంలో అయినా పొరపాట్లు జరిగి ఉన్నట్లయితే మళ్లీ అలాంటివి చేయకుండా ఉండడానికి అవసరమైన జాగ్రత్తల గురించి ఆలోచించడం.. మనసును దృఢపరచుకోవడం.. వంటివి చేయాలి.

వీటితో పాటు ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్