వీళ్లు... మళ్లీమళ్లీ వాడేస్తున్నారు!

డెనిమ్‌... నేటి యువత వార్డ్‌రోబ్‌లో తప్పక కనిపించే ఫ్యాబ్రిక్‌. వాళ్లే కాదు, అందులో ఉండే రకరకాల షేడ్స్, వస్త్ర నాణ్యత కారణంగా పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరూ జీన్స్‌కి ఫిదానే. కానీ, ఈ కూల్, క్యాజువల్‌ లుక్‌ వెనుక పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావం ఎంతో.

Updated : 05 Jun 2024 07:49 IST

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

డెనిమ్‌... నేటి యువత వార్డ్‌రోబ్‌లో తప్పక కనిపించే ఫ్యాబ్రిక్‌. వాళ్లే కాదు, అందులో ఉండే రకరకాల షేడ్స్, వస్త్ర నాణ్యత కారణంగా పిల్లల నుంచీ పెద్దల వరకూ అందరూ జీన్స్‌కి ఫిదానే. కానీ, ఈ కూల్, క్యాజువల్‌ లుక్‌ వెనుక పర్యావరణంపై పడే ప్రతికూల ప్రభావం ఎంతో. అందుకే డెనిమ్‌ జీన్స్‌లను రీసైకిల్‌ చేస్తూ పర్యావరణహితం కోసం సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు.... వ్యాపారంగానూ మలుచుకుని విజయం సాధిస్తున్నారు సౌమ్య కల్లూరి, అమృతలు.

‘ద్విజ్‌’తో... పునరుజ్జీవం

మనం వాడిపారేసే పాత జీన్సు ఓ అందమైన బొమ్మలానో, బ్యాగులానో తయారైతే ఎలా ఉంటుంది? ఊహించుకోండి. ఈ ఊహే కాకినాడకు చెందిన సౌమ్య కల్లూరిని వ్యాపారం వైపు మళ్లించింది. ముంబయిలో ‘ద్విజ్‌’ అనే సంస్థను ప్రారంభించి పాత జీన్స్‌లకు ప్రాణం పోసేలా చేసింది. ‘‘ద్విజ్‌ అంటే పునరుజ్జీవం అని అర్థం. అనేక రకాల డెనిమ్‌ దుస్తులు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, దాన్ని వాడాలా లేదా? వాడితే ఎన్ని రోజులు వాడాలి? అనేది మనచేతిలోనే ఉంది. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్‌ ఫ్యాషన్‌ కారణంగా చాలా దుస్తులు కుప్పలు తెప్పలుగా మిగిలిపోతున్నాయి. నిజానికి ఒక జత జీన్స్‌లో ఉండే కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ 33నుంచి 80కేజీల కార్బన్‌డైఆక్సైడ్‌కు సమానమని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే అలాంటి డెనిమ్‌ దుస్తులను మేము షేడ్స్, సైజులు, మందం, వస్త్ర రకాన్ని బట్టి వేరుచేసి ఉంచుతాం. వాటిని ఎటువంటి రసాయనాలు లేకుండా శుభ్రపరుస్తాం. పాతవి, చిరిగిన డెనిమ్స్‌ను బ్యాగులుగా, జ్యుయెలరీగా, గృహాలంకరణలుగా, యోగా మ్యాట్‌లు, బొమ్మలుగా తయారుచేస్తాం. డెనిమ్‌ ఒక్కటే కాదు పీఈటీ ఫెల్ట్‌ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి సెమీ వాటర్‌ప్రూఫ్‌ బ్యాగులూ తయారుచేస్తాం. దానివల్ల వాడిన తర్వాత వాటిని వేరే ఉత్పత్తులతో  కలిపి తేలిగ్గా రీసైకిల్‌ చేసుకోవచ్చు’’ అంటోంది సౌమ్య. ఇప్పటివరకూ ఈమె 8500ల జీన్స్‌లనూ, సుమారు 5వేల మీటర్ల ఇండస్ట్రియల్‌ డెనిమ్‌నూ రీసైకిల్‌ చేసింది. జర్మనీలో మెకానికల్‌ ఇంజినీరింగ్, కమర్షియల్‌ వెహికల్‌ టెక్నాలజీలో మాస్టర్స్‌ చేసిన సౌమ్య... జాన్‌డీర్‌ సంస్థలో లైఫ్‌ సైకిల్‌ అసెస్‌మెంట్‌(ఎల్‌సీఏ) మీద పనిచేసింది. అప్పుడే ఆమెకు సస్టెయినబిలిటీ మీద ఆసక్తి కలిగి, 2018లో రూ.6లక్షలతో ‘ద్విజ్‌’ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ వేదికగా తన ఉత్పత్తులు విక్రయిస్తోంది.

ఆ నీటి వృథా తగ్గిస్తూ..!

జీన్స్‌ను అప్‌సైకిల్‌చేసి వాటిని పేపర్ల రూపంలోకి మార్చాలనే ఉద్దేశంతో ‘ఇన్‌స్పైర్‌డ్‌ ఎట్‌ ఫికా’లో వర్క్‌షాపులను నిర్వహిస్తోంది టెక్స్‌టైల్‌ డిజైనర్‌ అమృత. ‘‘చాలామంది దగ్గర కామన్‌గా కనిపించేది డెనిమ్‌ దుస్తులే. కానీ, వదులైందనో, బిగుతుగా మారిందనో లేదా మరకలు అంటాయనో వాటిని కొద్దిరోజులు వాడి పక్కన పెట్టేస్తుంటారు. అయితే, డెనిమ్‌లో వాడే ప్రధాన మెటీరియల్‌ పత్తి. దీన్ని పండించడానికి చాలా నీరు అవసరం అవుతుంది. ఒక జత జీన్స్‌ తయారవడానికి సుమారు 2900 గాలన్ల నీరు అవసరమవుతుందట. అదనంగా, రంగులద్దే ప్రక్రియలో కఠినమైన రసాయనాలూ నీటి ప్రవాహాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగానే డెనిమ్‌ జీన్స్‌లను పేపర్‌ రూపంలోకి మారుస్తున్నా. వాటితో అట్టపెట్టెలూ, డెలివరీ బ్యాగులూ తయారుచేయొచ్చు. 90శాతం డెనిమ్‌ను కాటన్‌తోనే తయారుచేస్తారు. కాబట్టి, దీన్ని వేరే రీసైకిల్డ్‌ పేపర్లతో పాటు కలిపి నానబెట్టడం, చింపడం, రుబ్బడం వంటివి తేలిక. ఇక బరువైన, లిక్రా లేని నాన్‌ స్ట్రెచబుల్‌ జీన్సులను మాత్రమే రీసైకిల్‌ చేయగలం. అందుకే అటువంటివి ఎంచుకుంటా. పర్యావరణం మీద డెనిమ్‌ దుస్తులు ఎంత ప్రభావం చూపిస్తున్నాయనేది తెలుసుకోవాలంటే ముందు ఆ పర్యావరణాన్ని ప్రేమించాలి. అప్పుడే జీన్స్‌ని అప్‌సైక్లింగైనా, రీసైక్లింగైనా చేయగలం’’ అంటోంది అమృత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్