కళతో జీవితాన్ని దిద్దుకొని..

ఆ క్షణంలోనే విపరీతమైన ఆనందం.. వెంటనే లోకంలో బాధంతా తనదే అన్నంత ఏడుపు! శరీరాన్ని పదునైన వస్తువులతో గాయం చేసుకోవడం.. ఆ నొప్పిలో ఆనందాన్ని వెతుక్కోవడం. ఏడవడం, భయపడటం.. చుట్టూ ఉన్నవాళ్లంతా తనని చూసి జాలి పడుతోంటే సంతోషించడం.. వినడానికే కొత్తగా ఉన్నా మానసిక సమస్యలకు రూపాలే ఇవి.

Updated : 29 Dec 2022 00:23 IST

ఆ క్షణంలోనే విపరీతమైన ఆనందం.. వెంటనే లోకంలో బాధంతా తనదే అన్నంత ఏడుపు! శరీరాన్ని పదునైన వస్తువులతో గాయం చేసుకోవడం.. ఆ నొప్పిలో ఆనందాన్ని వెతుక్కోవడం. ఏడవడం, భయపడటం.. చుట్టూ ఉన్నవాళ్లంతా తనని చూసి జాలి పడుతోంటే సంతోషించడం.. వినడానికే కొత్తగా ఉన్నా మానసిక సమస్యలకు రూపాలే ఇవి. వీటితో ఏళ్లుగా పోరాటం చేస్తోంది దేవశ్రీ.

పంతొమ్మిదేళ్ల వరకూ దేవశ్రీ కూడా అందరు అమ్మాయిల్లాగే నవ్వుతూ తుళ్లుతూ ఉండేది. ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్‌లో చేరింది. విజయవంతంగా పూర్తిచేసుకొని సమాజంలోకి అడుగుపెట్టాలని కలలు కంటోన్న తనకు అనుకోకుండా ఓ కుదుపు. కళాశాల యాజమాన్యం తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమెకు డిగ్రీ పట్టా నిరాకరించారు. ఎంత ప్రాధేయపడినా ఫలితం లేదు. తోటివాళ్లంతా కెరియర్‌లో ముందుకెళుతోంటే తను మాత్రం నిస్సహాయ స్థితిలో ఆగిపోయింది. ‘నా జీవితం ఏమవుతుంద’న్న ఆలోచన ఆమెకు ఆందోళన, ఒత్తిడి, బైపోలార్‌ డిజార్డర్‌ వంటి మానసిక సమస్యలను తెచ్చిపెట్టింది.

దేవశ్రీ చంద్రాకర్‌ది పుణె. సివిల్‌ సర్వీసెస్‌ రాసి, ప్రజలకు సేవ చేయాలన్నది తన లక్ష్యం. దానికి దూరమవుతున్న కొద్దీ మానసిక సమస్యలు పెద్దవయ్యాయి. తనను తాను గాయపరచుకోవడం, గదిలో ఉండిపోయి రోజుల తరబడి ఏడవడం.. తననలా చూడలేక అమ్మానాన్న వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. అయినా తన పరిస్థితి మెరుగవలేదు. కొద్దిరోజులకు అమ్మానాన్నల్ని తనెంత ఇబ్బంది పెడుతోందో తెలిసొచ్చింది దేవశ్రీకి. తన పరిస్థితి గురించి తెలుసుకుంది. తనలాంటి వాళ్ల కథలు చదివాక మారడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిన్నప్పుడు తనకు డ్రాయింగ్‌ అంటే చాలా ఇష్టం. దాన్ని మళ్లీ ప్రారంభించింది. ఎన్నో ప్రయోగాలు చేసింది. ఏ శిక్షణా లేకుండానే రెండేళ్లలో సొంత సంస్థ ‘సిరి’ని ప్రారంభించే స్థాయికి ఎదిగింది. ఆన్‌లైన్‌ పరిజ్ఞానంతో పెయింటింగ్‌, గృహాలంకరణ వస్తువులు, రెజిన్‌ జ్యువెల్లరీ.. ఇలా నచ్చినవన్నీ చేసుకుంటూ వచ్చింది. కోర్టులో కేసు వేసి ఏడేళ్లు పోరాడి ఇటీవలే తన డిగ్రీ తాను పొందింది కూడా.

‘ఇప్పటికీ అప్పుడప్పుడూ అటాక్‌లు వస్తుంటాయి. కానీ చాలావరకూ నయమైంది. కళే దానికి కారణం. నాలో మార్పు గమనించాక ఇతరులకూ సాయపడాలనుకున్నా. ఎన్‌జీఓలతో కలిసి మానసిక సమస్యలపై అవగాహన కలిగిస్తున్నా. డిప్రెషన్‌లోకి వెళ్లిన వారికి నన్నే ఉదాహరణగా చూపి ‘నేను బాగైనప్పుడు మీరూ అవ్వగల’రంటూ ప్రోత్సహిస్తున్నా’నని ఆనందంగా చెబుతోన్న 27 ఏళ్ల దేవశ్రీ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చదువుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్నవారికి పెయింటింగ్‌ కూడా నేర్పుతోంది. తన జీవితాన్నే ‘ఆర్ట్‌’గా మలిచి మానసిక సమస్యలపై అందరికీ అవగాహన  కలిగించడం, కొంతమందినైనా ఆ నరకం నుంచి బయటపడేయడం లక్ష్యమంటున్న ఈమెను అభినందించాల్సిందే కదూ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్