అమెరికా ప్రథమ మహిళను మెప్పించిన ‘జీనియస్‌’ గీతాంజలి!

వయసుతో సంబంధం లేకుండా, రంగమేదైనా నేటి యువత అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రపంచమంతా దాసోహమంటోన్న స్టెమ్‌లోనూ కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. తమ ప్రతిభకు గుర్తింపుగా అరుదైన అవార్డులు/రివార్డులు అందుకుంటున్నారు. 17 ఏళ్ల ఇండో అమెరికన్‌ గీతాంజలి రావు ఇందుకు తాజా ఉదాహరణ.

Published : 14 Oct 2023 12:24 IST

(Photos: Twitter)

వయసుతో సంబంధం లేకుండా, రంగమేదైనా నేటి యువత అద్భుతాలు సృష్టిస్తున్నారు. ప్రపంచమంతా దాసోహమంటోన్న స్టెమ్‌లోనూ కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తున్నారు. తమ ప్రతిభకు గుర్తింపుగా అరుదైన అవార్డులు/రివార్డులు అందుకుంటున్నారు. 17 ఏళ్ల ఇండో అమెరికన్‌ గీతాంజలి రావు ఇందుకు తాజా ఉదాహరణ. తన సృజనాత్మకతతో ఇప్పటికే పలు కొత్త ఆవిష్కరణలు/యాప్‌లకు తెరతీసిన ఈ అమ్మాయి.. నీటి శుద్ధిని అంచనా వేసే మరో పరికరాన్ని అభివృద్ధి చేసింది. సమాజ హితం కోరి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తాను చూపిన ఈ ప్రతిభను అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ ప్రశంసించారు. ఇటీవలే ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవా’న్ని పురస్కరించుకొని వైట్‌హౌస్‌లో 15 మంది ఇలాంటి యంగ్‌ ఇన్నొవేటర్స్‌ని సత్కరించగా.. వారిలో గీతాంజలి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ ఇన్నొవేటర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

ఆ 15 మందిలో గీత కూడా!

ఈతరం అమ్మాయిలు స్వదేశంలోనే కాదు.. విదేశాల్లో స్థిరపడ్డా అక్కడా తమ ప్రతిభ చాటుకుంటున్నారు. తమ సృజనాత్మకతతో అక్కడి సమాజంలో మార్పు తీసుకొస్తున్నారు.. ప్రజల జీవితాల్ని మరింత సులభతరం చేస్తున్నారు. అలాంటి యంగ్‌ ఇన్నొవేటర్స్‌ని ఈ ఏటి ‘అంతర్జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా సత్కరించాలనుకుంది అమెరికా ప్రభుత్వం. ఈ ఆలోచనతోనే వైట్‌హౌస్‌లో ‘గర్ల్స్‌ లీడింగ్‌ ఛేంజ్‌’ అనే కార్యక్రమాన్ని తొలిసారి నిర్వహించారు. తమ ప్రతిభాపాటవాలతో అమెరికా వ్యాప్తంగా మార్పు తీసుకొస్తోన్న 15 మంది బాలికలు/యువతుల్ని ఎంపిక చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వీరిలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల గీతాంజలీ రావు కూడా ఒకరు. నీటి శుద్ధిని అంచనా వేసే ‘టెథిస్‌’ అనే పరికరాన్ని రూపొందించినందుకు గాను.. అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ గీతాంజలిని సత్కరించారు. దీంతో ఈ యంగ్‌ ఇన్నొవేటర్‌ పేరు మరోసారి విశ్వవ్యాప్తమైంది.

‘టెథిస్‌’.. ఎలా పని చేస్తుందంటే?

భారతీయ మూలాలున్న గీతాంజలి ప్రస్తుతం కొలరాడో పట్టణంలోని లోన్‌ ట్రీ అనే ప్రాంతంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. జన్యుశాస్త్రం, మహమ్మారి వ్యాధుల అధ్యయనంపై ఆసక్తి చూపే ఆమె.. ప్రస్తుతం ఓవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు ‘కొలరాడో యూనివర్సిటీ’లో వీటిపై అధ్యయనం చేస్తోంది. నాలుగేళ్ల వయసులో తన అంకుల్‌ ఇచ్చిన సైన్స్‌ కిట్‌తో స్ఫూర్తి పొంది.. స్టెమ్‌లోకి అడుగుపెట్టిన గీత.. పెరిగి పెద్దయ్యే క్రమంలో సమాజంలో ఉన్న పలు సమస్యలపై అవగాహన పెంచుకుంది. అలా తన 10 ఏళ్ల వయసులో ‘ఫ్లింట్‌ నీటి సంక్షోభం’ గురించి తెలుసుకుందామె. 2014లో ఫ్లింట్‌ నగరంలో తాగు నీటిలో సీసం కలవడం, ఫలితంగా ఆ నీరు కలుషితమవడంలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై అధ్యయనం చేసిన గీత.. దీనికి పరిష్కారంగా ‘టెథిస్‌’ అనే పరికరాన్ని రూపొందించింది. కార్బన్‌ నానోట్యూబ్స్‌ సహాయంతో నీటిలోని సీసం స్థాయుల్ని గుర్తించి.. నీటి శుద్ధిని అంచనా వేసే పరికరమిది. ఇక ఈ గణాంకాల్ని స్మార్ట్‌ఫోన్‌లో చూసుకునే విధంగా ఓ యాప్‌నూ అభివృద్ధి చేసిందామె.

ఒక్క పరికరం.. ఎన్నెన్నో అవార్డులు!

ఇలా తన ప్రతిభకు, సృజనాత్మకతకు గుర్తింపుగా 2017లోనే ‘డిస్కవరీ ఎడ్యుకేషన్‌ 3ఎం యంగ్‌ సైంటిస్ట్‌ ఛాలెంజ్‌’లో గెలుపొందిన గీత.. 25 వేల డాలర్ల నగదు బహుమతి అందుకుంది. ఆ మరుసటి ఏడాది ‘యూఎస్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ’ వారు ‘ప్రెసిడెంట్స్‌ ఎన్విరాన్‌మెంటల్‌ యూత్‌ అవార్డు’తో ఆమెను సత్కరించారు. ఇక 2020లో టైమ్‌ పత్రిక తొలిసారి ప్రవేశపెట్టిన ‘కిడ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్నీ దక్కించుకుందీ యంగ్‌ సైంటిస్ట్‌. ఆ సమయంలో ప్రముఖ హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ గీతను వర్చువల్‌గా ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఇక తాజాగా వైట్‌హౌస్‌ కూడా ఆమె ప్రతిభను సత్కరించి మరింత ప్రోత్సహించింది.

సైన్స్‌తో సమస్యలకు పరిష్కారం!

‘నాకు చిన్నప్పటి నుంచి సైన్స్‌ అంటే ఆసక్తి. సమాజంలో మార్పు తీసుకురావడానికి స్టెమ్‌ను ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచన నాకు రెండు, మూడు తరగతుల్లో ఉన్నప్పుడే మొదలైంది. ఇలాంటి వినూత్న పరికరాలతో అందరి ముఖాల్లో సంతోషాన్ని నింపాలన్న ఆశయంతోనే ముందుకెళుతున్నాను. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటన్నింటికీ శాస్త్ర సాంకేతికతతో పరిష్కారం చూపచ్చు. ఉదాహరణకు కలుషితమైన నీరు తాగడం వల్ల చాలామంది ఓపియాడ్‌ లాంటి రుగ్మతల బారిన పడుతున్నారని మా పరిశోధనల్లో స్పష్టమైంది. దీంతో పాటు డ్రగ్స్ వాడకం, సైబర్‌ వేధింపులు.. వంటి సమస్యల్ని కూడా సాంకేతికతతో అధిగమించచ్చు. నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా.. గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం.. ఇదే నా ప్రయోగ విధానం. సమాజంలో ఉన్న ప్రతి సమస్యనూ మనం పరిష్కరించకపోవచ్చు.. కానీ ఏ సమస్య అయితే మనల్ని బాగా కదిలిస్తుందో దాని పైనే దృష్టి పెట్టాలన్నది నా లక్ష్యం. చుట్టూ ఉన్న సమస్యల్ని పారదోలడానికి.. సృజనాత్మకత, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆసక్తి కనబరిచే యువతతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆశయంగా పెట్టుకున్నా. నేను చేయగలిగానంటే...మీలో ఎవరైనా చేయగలరు..’ అంటోందీ యువ శాస్త్రవేత్త.

వక్త.. రచయిత్రి!

కేవలం టెథిస్‌ అనే పరికరమే కాదు.. గతంలో ‘కైండ్లీ’ పేరుతో ఓ యాప్‌నూ అభివృద్ధి చేసింది గీతాంజలి. సాంకేతిక పరిజ్ఞానానికి కృత్రిమ మేధను జోడించి అభివృద్ధి చేసిన ఈ యాప్‌ సహాయంతో ఆదిలోనే సైబర్‌ వేధింపులకు అడ్డుకట్ట వేయచ్చంటోంది ఈ టీనేజ్‌ సెన్సేషన్‌. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా నిర్వహిస్తోన్న ‘స్కౌటింగ్‌ స్టెమ్‌ ప్రోగ్రామ్‌’లో ఎన్‌రోల్‌ చేసుకున్న గీత.. ‘స్కౌట్స్‌’ సభ్యురాలిగానూ కొనసాగుతోంది. ఈ యువ సైంటిస్ట్‌ రచయిత్రి కూడా! ఆమె రాసిన ‘యంగ్‌ ఇన్నొవేటర్స్‌ గైడ్‌ టు స్టెమ్‌’ అనే పుస్తకాన్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టెమ్‌ బోధన ఉన్న పలు స్కూళ్లలో బోధనాంశంగా ఉపయోగిస్తున్నారు. ఇక ‘టెడెక్స్‌’ వేదికపై పలుమార్లు ప్రసంగించిన గీత.. స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు స్టెమ్‌ పాఠాలు బోధిస్తూ స్ఫూర్తి నింపుతోంది. 11 ఏళ్ల వయసులోనే ఫోర్బ్స్ ‘30 అండర్‌ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న ఈ ఇండో అమెరికన్‌.. భవిష్యత్తులో ఎపిడెమియాలజిస్ట్‌ (వ్యాధుల వ్యాప్తి, అందుకు గల కారణాలపై పరిశోధన చేయడం) కావడమే తన లక్ష్యమంటోంది. ఇలా తన ప్రతిభ, సృజనాత్మకత, పరిశోధనలకు గుర్తింపుగా ప్రఖ్యాత ‘మార్వెల్‌’ సంస్థ ‘జీనియస్‌ గీతాంజలి’ పేరుతో గీతాంజలి పోలికలతో ఓ సూపర్‌ హీరో కార్టూన్‌ను రూపొందించడం విశేషం. ఇక ఖాళీ సమయాల్లో బేకింగ్‌ చేయడానికి ఇష్టపడే గీతకు.. భారతీయ శాస్త్రీయ నృత్యం, సంగీతమన్నా మక్కువట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్