Social Stars 2021 : ఒక్క వీడియోతో క్లిక్కయ్యారు!

ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ట్యాలెంట్‌ దాగుంటుంది. అయితే దాన్ని బహిర్గతం చేస్తూ తమను తాము నిరూపించుకున్న వాళ్లే హీరోలవుతారు.

Updated : 08 Dec 2022 15:59 IST

(Photo: Instagram)

ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ట్యాలెంట్‌ దాగుంటుంది. అయితే దాన్ని బహిర్గతం చేస్తూ తమను తాము నిరూపించుకున్న వాళ్లే హీరోలవుతారు. అలాంటి కొంతమంది యువ ప్రతిభావనులు తమ ట్యాలెంట్‌తో ఈ ఏడాది సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ సృష్టించారు. తమ వీడియోలు, వెబ్‌సిరీస్‌లతో యువతను ఉర్రూతలూగించారు. ఏడాది చరమాంకానికి చేరుకున్న సందర్భంగా ఈ సంవత్సరం సోషల్‌ మీడియాలో బాగా పాపులరైన కొంతమంది అమ్మాయిల గురించి తెలుసుకుందాం రండి..

ఓవర్‌నైట్‌ క్రష్‌.. అనన్య!

సినిమాల్లోకి రావాలన్న తపన చాలామందికి ఉంటుంది.. అయితే అందులో క్లిక్కయ్యే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు.. తెలుగమ్మాయి అనన్య కూడా ఆ కోవకే చెందుతుంది. ఇప్పటికే పలు వెబ్‌సిరీస్‌లు/లఘుచిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆమె.. ఈ ఏడాది ‘30 వెడ్స్‌ 21’ అనే వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంది. అప్పుడే కాలేజీ చదువు పూర్తిచేసుకొన్న 21 ఏళ్ల అమ్మాయికి.. 30 ఏళ్ల ఐటీ నిపుణుడితో పెళ్లవుతుంది.. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య సాగే అనుబంధం, ప్రేమకథ.. వంటి కోణాల్లో యువతను ఆకట్టుకునేలా ఈ వెబ్‌సిరీస్‌ను తీర్చిదిద్దారు దర్శకుడు పృథ్వీ వనం.

అందులో మేఘన పాత్రలో లీడ్‌ రోల్‌ పోషించి.. తన అందం, అభినయంతో కుర్రకారు మతిపోగొట్టింది అనన్య. అదెంతలా అంటే.. ‘అబ్బా.. ఏముందిరా ఈ అమ్మాయి!’ అనేంతలా. ఇక ఈ వెబ్‌సిరీస్‌లో చైతన్య మదాడి అనన్యకు జంటగా నటించాడు. మేలో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌ అప్పట్లో యూట్యూబ్‌లో లక్షల కొద్దీ వ్యూస్‌తో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఈ లఘుచిత్రాన్ని 1.2 కోట్ల మందికిపైగా వీక్షించారంటేనే.. ఇది ఎంత ఫీల్‌గుడ్‌ సిరీసో అర్థం చేసుకోవచ్చు.


ఆమె పాట వినని వారు లేరు!

కొంతమంది పాడితే వినాలనిపిస్తుంది.. మరికొంతమంది పాడితే మనల్ని మనమే మర్చిపోయి పాటలో లీనమవుతుంటాం.. పాట పూర్తయినా ఆ బాణీల్నే పదే పదే హమ్‌ చేస్తుంటాం.. తన గొంతుతో అంతటి మాయను సృష్టించింది శ్రీలంక గాయని యొహానీ దిలోకా డిసిల్వా. ‘మాణికే మాగే హితే’ అంటూ సింహళ భాషలో పాట రాసి.. తన అద్భుతమైన గొంతుతో దాన్ని మరెంతో అద్భుతంగా మలిచింది. ఇలా తాను మగతగా పాడుతుంటే మైమరచిపోని మనసు లేదంటే అది అతిశయోక్తి కాదు. ఒక్కసారి కాదు.. ఇదే పాటను వందలు, వేల సార్లు విన్న వాళ్లూ ఎందరో!

భాషలు వేరైనా సంగీతానికి హద్దుల్లేవంటూ నిరూపించిన ఈ గీతానికి కేవలం సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఫిదా అయిపోయారు. మాధురీ దీక్షిత్‌, పరిణీతి చోప్రా, టైగర్‌ ష్రాఫ్‌.. వంటి నటీనటులైతే ఏకంగా ఈ పాటకు స్టెప్పులు కూడా వేశారు. ఇక ఈ పాట హిందీ వెర్షన్‌ను ‘Thank God’ అనే బాలీవుడ్‌ సినిమాలో పాడే అవకాశాన్ని సొంతం చేసుకుందీ శ్రీలంక సెన్సేషన్‌. తద్వారా త్వరలోనే హిందీ చిత్ర పరిశ్రమలోకీ అడుగుపెట్టనుంది. ఇక ఈ పాట వివిధ భాషల్లోకి తర్జుమా అవడమే కాదు.. దీనిపై వచ్చిన కవర్‌ సాంగ్స్‌కు లెక్కేలేదు. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ పాటకు, యొహానీ గొంతుకు లక్షల కొద్దీ లైకులు, కోట్ల కొద్దీ వ్యూస్‌ దక్కాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ పాట రెండు కోట్ల వ్యూస్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.


మల్టీ ట్యాలెంటెడ్‌.. మీతిక!

సంగీతం, నృత్యం, కామెడీ స్కిట్స్‌.. ఇలా ఒకటా, రెండా తనలో లేని ట్యాలెంట్‌ లేదని నిరూపిస్తోంది లక్నోకు చెందిన మీతికా ద్వివేది. చిన్నతనం నుంచే సంగీతం అంటే ప్రాణం పెట్టే ఆమె.. ఇందులో శిక్షణ కూడా తీసుకుంది. అంతేనా.. అద్భుతమైన హాస్యచతురతతో నలుగురినీ నవ్వించడంలోనూ ఆమె దిట్టే. ఇలా తనలోని విభిన్న ట్యాలెంట్లను బయటపెట్టడానికి ‘ది సౌండ్‌ బ్లేజ్‌’ పేరుతో ఇన్‌స్టా ఖాతాను తెరిచింది. ఈ వేదికగా పాపులర్‌ పాటల్ని తనదైన శైలిలో పాడుతూ, సొంతంగా కామెడీ స్కిట్స్‌ చేస్తూ.. వాటిని వీడియోల్లో బంధిస్తూ.. ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోంది మీతిక.

ఈ క్రమంలో అనుబంధాలు, చుట్టూ జరిగే విషయాల్నే తన స్కిట్స్‌ కోసం ఎంచుకొని కామెడీ పండిస్తోన్న ఆమె వీడియోలకు సామాన్యులే కాదు.. ప్రియాంక చోప్రా, అర్బాజ్‌ ఖాన్‌ వంటి నటీనటులు కూడా ఫిదా అవుతున్నారు. ఇలా కేవలం ఇన్‌స్టాలోనే కాదు.. ఇదే పేరుతో యూట్యూబ్‌లోనూ అదరగొడుతోందీ టీనేజ్‌ సంచలనం. ప్రస్తుతం ఈ యంగ్‌ ట్యాలెంట్‌ను ఇన్‌స్టాలో రెండు మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మరోవైపు తన యూట్యూబ్‌ ఛానల్‌కు 45 వేల మందికిపైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతోన్న మీతిక.. తన తల్లి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చానని, భవిష్యత్తులో మీడియా/జర్నలిజం రంగంలో స్థిరపడాలని ఉందని చెబుతోంది.


పాటతో.. అందంతో..!

ఓ అందమైన పాటను మరో అందమైన అమ్మాయి తన గొంతులో వినిపిస్తే.. ఎంత అద్భుతంగా ఉంటుందో పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్‌ క్రియేటర్‌, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ దననీర్‌ మొబీన్‌ నిరూపించింది. 2017లో విడుదలైన పాకిస్థానీ చిత్రం ‘పంజాబ్‌ నహీ జౌంగీ’ సినిమాలోని ‘యే దిల్‌’ అనే పాటను ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించకుండా (Acapella Version) తన అద్భుతమైన గొంతులో హమ్‌ చేస్తూ పాడి వీడియో రూపొందించింది. ఈ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయడంతో ఒక్క పాటతోనే ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది మొబీన్‌. తన తియ్యటి గాత్రానికి ఒక్క పాకిస్థాన్‌ ఏంటి.. ఇటు ఇండియన్స్‌, అటు ఇతర దేశస్థులూ ఫిదా అయిపోయారు. ‘చాలా అద్భుతంగా పాడుతున్నారు.. ఇంకా ఇలాంటి పాటల వీడియోలు చేయచ్చుగా!’ అనే ప్రశంసలతో కామెంట్ల సెక్షన్‌ నిండిపోయింది.

ఇలా తన గాత్రానికే కాదు.. తన అందంతోనూ కుర్రకారును ఆకట్టుకుంటోందీ పాక్‌ టీనేజర్‌. ప్రస్తుతం ఇన్‌స్టా వేదికగా బ్యూటీ, కుకరీ, ఫ్యాషన్‌.. వంటి వీడియోలు, వాటికి సంబంధించిన కంటెంట్‌ని క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేస్తోన్న ఆమె ఇన్‌స్టా పేజీకి ప్రస్తుతం 1.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్