‘ఫోర్బ్స్‌’ జాబితాలో మెరిసిన రష్మిక.. అనుష్క.. సీతాలక్ష్మి.!

ఆసక్తి ఉన్న రంగాల్ని ఎంచుకొని రాణించే అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే వీరిలోనూ కొందరు తమ సృజన, ప్రతిభతో సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ‘30 అండర్‌ 30’ జాబితాలో చోటిచ్చింది ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌.

Published : 17 Feb 2024 13:14 IST

(Photos: Instagram)

ఆసక్తి ఉన్న రంగాల్ని ఎంచుకొని రాణించే అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే వీరిలోనూ కొందరు తమ సృజన, ప్రతిభతో సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి ‘30 అండర్‌ 30’ జాబితాలో చోటిచ్చింది ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌. ‘అసాధారణ వ్యక్తులు’ పేరుతో ఇటీవలే విడుదల చేసిన ఈ జాబితాలో విభిన్న రంగాలకు చెందిన 30 మంది యువ ప్రతిభావంతులు స్థానం సంపాదించారు. వారిలో వెండితెర ముద్దుగుమ్మ రష్మికతో పాటు మరికొంతమంది అమ్మాయిలూ ఉన్నారు.

కోడింగ్‌ను ఎంజాయ్ చేస్తా!

సమస్య ఏదైనా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో పరిష్కరించుకోవచ్చంటోంది జంషెడ్‌పూర్‌ అమ్మాయి స్పృహ విశ్వాస్‌. కృత్రిమ మేధనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చూపిస్తోంది. వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా రాణించేది. 13 ఏళ్లకే ‘అంతర్జాతీయ వ్యాసరచన పోటీ’లో గెలిచి వ్యాపార దిగ్గజం రతన్‌ టాటాను కలుసుకొనే అరుదైన అవకాశం అందుకుంది. లలిత కళల్లో ప్రతిభ చూపి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో లెక్కలేనన్ని అవార్డులూ ఒడిసిపట్టిందామె. ఇన్ని నైపుణ్యాలున్నా టెక్నాలజీ రంగంలోనే స్థిరపడాలనుకుంది స్పృహ. ఈ మక్కువతోనే టీనేజ్‌ వయసు నుంచే కోడింగ్‌పై పట్టు పెంచుకున్న ఆమె.. ఐఐటీ ముంబయిలో ‘మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌-మెటీరియల్‌ సైన్సెస్‌’ విభాగంలో సీటు సంపాదించుకుంది. అయితే రెండేళ్లు పూర్తయ్యాక చదువు ఆపేసి.. వివిధ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో కోడ్‌ డిజైన్‌ చేయడం నేర్చుకుంది. ఆపై ముంబయిలోని ‘BRND స్టూడియో’ అనే డిజైనింగ్‌ ఏజెన్సీలో పనిచేస్తూ.. 20కి పైగా స్టార్టప్స్‌కి యాప్స్‌ డిజైన్‌ చేసిచ్చిందీ యువ టెకీ. ఇలా కోడింగ్‌, డిజైనింగ్‌పై ఆమెకున్న లోతైన అవగాహనే ‘ఆగ్నిటో’ అనే ఆరోగ్య సంస్థలో ‘చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌’గా ఉద్యోగాన్ని కట్టబెట్టాయి. దేశ ఆరోగ్య రంగంలోనే తొలి వాయిస్‌ ఆధారిత యాప్‌ ఇది. 2020 నుంచి ఈ సంస్థలో పనిచేస్తోన్న స్పృహ.. వైద్యులు, వైద్య నిపుణుల కోసం ఏఐతో పలు వాయిస్‌ ఆధారిత ఉత్పత్తుల్ని డిజైన్‌ చేసింది. వాయిస్‌ను సందేశం రూపంలో అందించేలా రూపొందించిన ఈ టూల్స్‌ని ప్రస్తుతం 20 దేశాల్లో, 350కి పైగా ఆస్పత్రుల్లో ఉపయోగిస్తున్నారు. ‘ఎప్పుడూ క్రియేటివ్‌గా ఆలోచించడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతా. ఇక కోడింగ్‌ చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తా..’ అంటోందీ టెక్‌ లవర్.


‘మనీ’ గురూ!

ఆర్థిక విషయాలకు ఆడవాళ్లు ఆమడ దూరంలో ఉంటారంటారు. కానీ అవే ఆర్థిక విషయాల్ని అందరికీ అరటి పండు ఒలిచిపెట్టినట్లు సరళంగా వివరిస్తోంది అనుష్క రాథోడ్‌. ఈమెది సూరత్. చామనఛాయ కారణంగా చిన్నతనం నుంచీ పలు విమర్శల్ని ఎదుర్కొంది అనుష్క. ‘నువ్వు మీ ఇంట్లో వాళ్లలా ఎందుకు లేవు?’ అని బంధువులే మొహమ్మీద అనేసరికి ఎంతో బాధపడేదామె. అయితే ఇలాంటి విమర్శల్ని చదువుతోనే తిప్పికొట్టాలని నిర్ణయించుకున్న ఆమె.. పుస్తకాల్లో ఉన్న పాఠాలతో పాటు బయటి ప్రపంచం గురించి తెలుసుకోవడానికి మక్కువ చూపేది. ఈ క్రమంలోనే ఆర్థిక, వ్యాపార అంశాల్ని నేర్చుకోవడానికి, వాటి గురించి మాట్లాడడానికి ఆసక్తి చూపేది అనుష్క. ఈ అంశాలపై లోతుగా పరిశోధనలు చేసి.. మరింత పట్టు పెంచుకున్న ఆమె.. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో ఇంటర్న్‌షిప్స్‌ కూడా చేసింది. ఆపై ట్యాక్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ పూర్తి చేసి మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్దామనుకున్న ఆమె ప్లాన్‌ను కొవిడ్‌ తిప్పికొట్టింది. అయినా నిరాశ పడకుండా తనకు తెలిసిన ఆర్థిక, వ్యాపార అంశాల్ని సోషల్‌ మీడియా వీడియోల రూపంలో అందరికీ అందించడం మొదలుపెట్టిందామె. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, వ్యాపార వ్యూహాలు, ప్రపంచ ఆర్థిక ప్రగతి.. ఇలా మన చుట్టూ ఏం జరుగుతోందన్న సమగ్ర సమాచారాన్ని అందరికీ చేరువ చేయడంతో పాటు ఆయా విషయాలపై నిపుణులతోనూ సలహాలిప్పిస్తోంది అనుష్క. ఒక్కో మెట్టూ ఎక్కుతూ దేశంలోనే పాపులర్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరుతెచ్చుకున్న ఈ యూత్‌ ఐకాన్‌ను ఇన్‌స్టాలో 8.5 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ‘ఎవరిలానో ఉండాలనుకోవడం, ఎవరి మెప్పో పొందాలనుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. స్వీయ ప్రేమను పెంచుకుంటూ, మనసుకు నచ్చిన పని చేసినప్పుడే నలుగురిలో స్ఫూర్తి నింపగలం!’ అంటూ తన మాటలతోనూ అమ్మాయిల్లో ప్రేరణ కలిగిస్తోందీ కంటెంట్‌ క్రియేటర్.


‘శ్రీవల్లి’ తఢాఖా!

సినిమా రంగంలో రాణించడమంటే అంత ఆషామాషీ విషయం కాదు. అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అందాల తార రష్మిక వంద శాతం సక్సెసైందని చెప్పచ్చు. 2016లో ‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చక్కనమ్మ.. అనతి కాలంలోనే స్టార్‌ నటిగా ఎదిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో వరుస అవకాశాల్ని అందుకుంటోంది. ‘పుష్ప’తో పాన్‌ ఇండియా స్టార్‌గానూ పేరుతెచ్చుకున్న మన శ్రీవల్లి.. ‘యానిమల్‌’తో మరో సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ‘పుష్ప-2’తో పాటు ‘గర్ల్‌ఫ్రెండ్‌’, ‘ఛావా (హిందీ)’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తనపై వచ్చే విమర్శల్నీ తనదైన రీతిలో తిప్పికొడుతుంటుంది. ఇక గతేడాది రష్మిక డీప్‌ఫేక్‌ వీడియో వైరలవడం, ఆ సమయంలోనూ పాజిటివిటీతో ముందుకు సాగడం ఎంతోమంది అమ్మాయిల్లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాయని చెప్పచ్చు. ఇప్పటికే ఓ వీగన్‌ బ్యూటీ బ్రాండ్‌లో పెట్టుబడులు పెట్టిన రష్మిక.. త్వరలోనే సొంతంగా ఓ వ్యాపారాన్నీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందట! వినోద రంగంలో రష్మికతో పాటు బాలీవుడ్‌ నటి రాధికా మదన్‌ కూడా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది.


సీతాలక్ష్మి.. ది యంగ్‌ లీడర్!

దేశంలోనే ప్రముఖ పెట్టుబడి సంస్థ ‘అజీం ఇన్వెస్ట్‌’కు ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతోంది ముంబయికి చెందిన 29 ఏళ్ల సీతాలక్ష్మి నారాయణన్‌. 17 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థకు ఉపాధ్యక్షురాలిగా గతేడాది ఏప్రిల్‌లో పగ్గాలందుకొని.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచిందామె. 2021లో ఇన్వెస్ట్‌మెంట్‌ అసోసియేట్‌గా ఈ కంపెనీలో చేరిన ఆమె.. తన వ్యాపార నైపుణ్యాలతో రెండేళ్లలోనే వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయికి ఎదిగింది. ఇలా ఈ మూడేళ్లలో సంస్థ వివిధ కంపెనీల్లో 300 మిలియన్‌ డాలర్ల పెట్టుబడుల్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించింది సీతాలక్ష్మి. దేశ ఆర్థికాభివృద్ధిలో MSME ఫైనాన్సింగ్‌, సప్లై చెయిన్‌ ఫైనాన్సింగ్‌, డబ్బు నిర్వహణ.. వంటి విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయంటోన్న ఆమె.. భవిష్యత్తులో సొంతంగా ఓ ఈక్విటీ సంస్థను ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది.


హర్డిల్స్‌లో ఆమెకు తిరుగులేదు!

పేద కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనుకోవడమంటే ఆకాశాన్ని అందుకునే సాహసం చేయడమే! కానీ ఈ ప్రయత్నంలో నూటికి నూరు శాతం సక్సెసైంది విశాఖకు చెందిన జ్యోతి యర్రాజి. చదువుకోమంటే ఆటల్ని ఎంచుకున్న ఆమె.. స్కూల్లో పీఈటీ ప్రోత్సాహంతో రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, హర్డిల్స్‌లో పట్టు సాధించింది. ఆఖరికి హర్డిల్స్‌నే తన కెరీర్‌గా మార్చుకున్న ఆమె.. ఈ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాల పంట పండిస్తోంది.. మరోవైపు తన తల్లిదండ్రులకూ పేరుప్రఖ్యాతులు తీసుకొస్తోంది. ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో పాటు, గాయాలతోనూ సతమతమైన ఆమె.. అన్నింటినీ అధిగమించి ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో రజత పతకం అందుకుంది. ప్రస్తుతం దేశంలోనే వేగవంతమైన హర్డ్‌లర్‌గా పేరుతెచ్చుకున్న జ్యోతి.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం తృటిలో చేజార్చుకుంది. అయినా నిండైన ఆత్మవిశ్వాసంతో పోటీలకు సిద్ధపడతానని, ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యంగా చెబుతోందామె. క్రీడల్లో జ్యోతితో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్టీపుల్‌ఛేజ్‌ అథ్లెట్‌ పారుల్‌ ఛౌదరి కూడా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్