Beat Boxing: వీళ్ల బీట్స్‌కి తిరుగులేదు..!

డీజే సంగీతం వినగానే మనసు హుషారెత్తిపోతుంది.. ఏ మూడ్‌లో ఉన్నా కాలు కదపాలనిపిస్తుంది.. మరి, అలాంటి సంగీతాన్ని ప్లే చేయడానికి ప్రత్యేకమైన వాయిద్య పరికరాలు కావాలి. కానీ వాటి అవసరం లేకుండా కేవలం నోరు, గొంతు, ముక్కుతోనే డీజే బీట్స్‌ సృష్టిస్తున్నారు....

Published : 09 Dec 2022 12:44 IST

(Photos: Screengrab)

డీజే సంగీతం వినగానే మనసు హుషారెత్తిపోతుంది.. ఏ మూడ్‌లో ఉన్నా కాలు కదపాలనిపిస్తుంది.. మరి, అలాంటి సంగీతాన్ని ప్లే చేయడానికి ప్రత్యేకమైన వాయిద్య పరికరాలు కావాలి. కానీ వాటి అవసరం లేకుండా కేవలం నోరు, గొంతు, ముక్కుతోనే డీజే బీట్స్‌ సృష్టిస్తున్నారు కొందరు యువతులు. డ్రమ్‌ మెషీన్‌ నుంచి వచ్చే ఎంతటి కఠినమైన బీట్‌ అయినా అలవోకగా అనుకరిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఇలా బీట్‌ బాక్సింగ్‌లో తమదైన ముద్ర వేస్తూ.. సోషల్‌ మీడియా స్టార్స్‌గా రాణిస్తోన్న కొందరమ్మాయిల అంతరంగమిది.

ఆర్ధ్రా సాజన్

తపన, పట్టుదల ఉంటే ఎంతటి కఠినమైన అంశాన్నైనా ఇట్టే నేర్చేసుకోవచ్చని నిరూపించింది కేరళ తిరువనంతపురంకు చెందిన ఆర్ధ్రా సాజన్‌. మిమిక్రీపై మక్కువతో నాలుగేళ్ల క్రితం సొంతంగా బీట్‌ బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకున్న ఆమె.. నోరు, గొంతు, ముక్కుతో ఒకేసారి ఐదు శబ్దాల్ని పలికించగలదు. ‘వ్యక్తుల్ని అనుకరించడం, ప్రకృతిలో వినిపించే శబ్దాల్ని నా గొంతులో వినిపించడమంటే నాకు చాలా ఇష్టం. 2017లో నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ‘కేరళ స్టేట్‌ స్కూల్‌ ఆర్ట్స్‌ ఫెస్టివల్‌’లో పాల్గొని సత్తా చాటా. ఆపై జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో నిర్వహించిన పోటీల్లో వరుసగా రెండుసార్లు మిమిక్రీ టైటిల్స్‌ సొంతం చేసుకున్నా..’ అంటోంది ఆర్ధ్ర.

పలువురు సెలబ్రిటీల గొంతుల్ని అనుకరిస్తూ.. సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ కేరళ కుట్టి.. Prasitha Chalakkudy అనే గాయని పాడిన జానపద పాటకు తన బీట్‌ బాక్సింగ్‌ నైపుణ్యాలతో నేపథ్య సంగీతాన్ని అందించింది. అప్పట్లో ఈ పాట సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది. లక్షల కొద్దీ వ్యూస్‌ను, వేల కొద్దీ అభిమానుల్ని సంపాదించింది. ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా, అటు ప్రపంచ వేదికలపై, పలు టీవీ షోలలోనూ తన బీట్‌ బాక్సింగ్‌ నైపుణ్యాలతో సత్తా చాటిన ఆర్ధ్ర.. ఈ క్రమంలో ఏఆర్‌ రెహమాన్‌, అర్మాన్‌ మాలిక్‌, శంకర్‌ మహదేవన్‌.. వంటి మేటి సంగీత దర్శకులతో పనిచేసింది. కీబోర్డ్‌, వేణువు, డ్రమ్స్‌, హార్మోనికా, Kazoo (ఆఫ్రికా సంగీత వాయిద్య పరికరం).. వంటి సంగీత వాయిద్య పరికరాల్ని వాయించడంలోనూ ఆమె దిట్ట. ప్రస్తుతం ఓవైపు తన బీట్‌ బాక్సింగ్‌ నైపుణ్యాలను వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో ప్రదర్శిస్తూనే.. మరోవైపు అక్కడి ఓ స్వచ్ఛంద సంస్థలో మానసిక వైకల్యాలున్న చిన్నారులకు సంగీత పాఠాలు చెబుతోందీ ట్యాలెంటెడ్‌ గర్ల్‌. ఇక దేశంలోనే తొలి మహిళా ఫ్లూట్‌ బాక్సర్‌గా పేరు గాంచిన ఆర్ధ్ర తన అరుదైన నైపుణ్యాలతో గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు సంపాదించుకుంది.


నిమిషా పాటిల్

బీట్‌ బాక్సింగ్‌ అంటే ఏంటో తెలియకముందే తనకు ఈ కళ పరిచయమైందంటోంది నిమిషా పాటిల్‌. చిన్న వయసు నుంచే మిమిక్రీని ఇష్టపడిన ఆమె.. వివిధ రకాల శబ్దాల్ని, లయల్ని అనుకరించేది. ఈ క్రమంలోనే ఓసారి ‘పెంటాటోనిక్స్‌’ అమెరికన్‌ బీట్‌ బాక్సింగ్‌ గ్రూప్‌ ప్రదర్శించిన బీట్‌ బాక్సింగ్‌ వీడియో ఆమె కంట పడింది. వాళ్ల నైపుణ్యాలు ఆమెను కట్టిపడేశాయి. అప్పుడే దీన్నే తన కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్న నిమిషా.. కాలేజీలో చదువుకుంటూనే ‘అస్లీ బాత్‌’ అనే సంగీత బృందంలో చేరింది. ఈక్రమంలో తన నైపుణ్యాల్ని మరింతగా మెరుగుపరచుకొని.. వివిధ పోటీల్లో నాలుగుసార్లు ‘ఉత్తమ బీట్‌ బాక్సర్‌’గా అవార్డులు అందుకుంది. స్వయానా బయోమెడికల్‌ ఇంజినీర్‌ అయిన నిమిషా.. బీట్‌ బాక్సింగ్కి సంబంధించి కొన్ని పరిశోధనలు కూడా చేసింది. పలు వేదికల పైన దీని గురించి ప్రసంగించి బీట్‌ బాక్సింగ్‌పై చాలామందిలో అవగాహన పెంచింది.

‘బీట్‌ బాక్సింగ్‌.. చాలా కెరీర్స్‌ మాదిరిగానే ఇదీ పురుషాధిక్యత ఉన్న రంగమే! నేను దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు చాలామంది నేను ఇందులో రాణించలేమో అన్నట్లుగా చూసేవారు. కానీ నా ప్రదర్శనలు నాపై నాకు ఆత్మవిశ్వాసం పెంచడమే కాదు.. ఇటువైపు రావాలనుకునే ఎంతోమంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపాయి. తొలుత కొన్ని బృందాలతో కలిసి బీట్‌ బాక్సింగ్‌ చేసేదాన్ని. కానీ ఆ తర్వాత ‘Nimitz Beatbox’ పేరుతో సొంతంగా ఓ సోషల్‌ మీడియా వేదికను సృష్టించుకున్నా. #TongueTwistTuesday హ్యాష్‌ట్యాగ్తో వారానికో కొత్త బీట్‌ను రూపొందించడం మొదలుపెట్టా. మొదట్లో ‘అమ్మాయిని.. ఇందులో రాణించలేనేమో’నని సందేహించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది. సోలోగానే ఈ రంగంలో కొనసాగాలని ఉంది.. నా నైపుణ్యాలతో మరింతమందిని ఈ రంగంలోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నా..’ అంటోంది నిమిషా.


కృతీ యారాది

ఎలాంటి సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించకుండా కేవలం నోరు, గొంతు, ముక్కుతోనే సరికొత్త బీట్స్‌ సృష్టించడం చూసి ఆశ్చర్యపోతాం. ఇది చాలా కష్టమనుకుంటాం. కానీ ముచ్చటగా మూడు పదాలు తెలిస్తే.. బీట్‌ బాక్సింగ్‌ చాలా తేలిగ్గా నేర్చేసుకోవచ్చంటోంది యువ బీట్‌ బాక్సర్‌ కృతీ యారాది. సరికొత్త బీట్స్‌తో వీడియోలు సృష్టిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ పదిహేనేళ్ల అమ్మాయి.. ఇటీవలే నీళ్లు తాగేటప్పుడు వచ్చే శబ్దాన్ని అనుకరిస్తూ ఓ వీడియో రూపొందించింది. అది వైరలవడం, లక్షల కొద్దీ వ్యూస్‌ సంపాదించుకోవడంతో మరోసారి పాపులరైంది కృతి.

‘చాలామంది బీట్‌ బాక్సింగ్‌ అంటే కష్టమనుకుంటారు. కానీ బూట్స్‌, అండ్‌, క్యాట్స్‌.. ఈ మూడు పదాలు తెలిస్తే ఈ నైపుణ్యాల్ని సులభంగా నేర్చేసుకోవచ్చు..’ అంటూ ఔత్సాహిక బీట్‌ బాక్సర్స్‌లో ప్రేరణ కలిగిస్తోన్న ఈ ట్యాలెంటెడ్‌ గర్ల్‌.. చాలా బీట్స్‌ని నోటితోనే పలికించడంలోనూ దిట్ట. ఇక ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌.. వంటి హస్తకళల్లోనూ ప్రవేశమున్న కృతి.. తాను రూపొందించిన టోటె బ్యాగ్స్‌, క్యాప్స్‌, పెయింటింగ్స్‌.. వంటివన్నీ తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ప్రదర్శిస్తుంటుంది.


ఆకాంక్ష శెట్టి

సాధారణంగానే బీట్‌ బాక్సింగ్‌ చేయడం కష్టమనుకుంటే.. ఇటు హార్మోనికా అనే సంగీత వాయిద్య పరికరాన్ని వాయిస్తూనే.. మరోవైపు బీట్‌ బాక్సింగ్‌ చేయగల అరుదైన నైపుణ్యాల్ని తన సొంతం చేసుకుంది బెంగళూరుకు చెందిన కళాకారిణి ఆకాంక్ష శెట్టి. ఇలా ఈ రెండింటి కలయికతో తాను రూపొందించిన వీడియోల్ని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేయగా.. అవి వైరల్‌గా మారడంతో తన నైపుణ్యాల గురించి అందరికీ తెలిసింది. ఇలా బీట్‌ బాక్సర్‌గానే కాదు.. తన ఫ్యాషనబుల్‌ దుస్తులతో, అందంతోనూ నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది ఆకాంక్ష. ప్రయాణాలన్నా ఈ ముద్దుగుమ్మకు మహా ఇష్టం. అందుకే తాను పర్యటించిన ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని కూడా ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుందామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్