అప్పుడు ఆ అవస్థ భరించే కంటే చావే మేలనిపించేది..!

అనారోగ్యపూరిత జీవనశైలి, ఆహారపుటలవాట్లు, కుటుంబ చరిత్ర.. ఇలా పలు కారణాల వల్లే క్యాన్సర్‌ వస్తుందనుకుంటాం. ఈ క్రమంలో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం.. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉన్నా, కుటుంబ చరిత్ర లేకపోయినా.. ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉందంటున్నారు జెరోదా సీఈఓ నితిన్‌ కామత్‌ సతీమణి సీమా పాటిల్‌....

Updated : 11 Apr 2024 20:38 IST

(Photos : seema.page)

అనారోగ్యపూరిత జీవనశైలి, ఆహారపుటలవాట్లు, కుటుంబ చరిత్ర.. ఇలా పలు కారణాల వల్లే క్యాన్సర్‌ వస్తుందనుకుంటాం. ఈ క్రమంలో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం.. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉన్నా, కుటుంబ చరిత్ర లేకపోయినా.. ఈ మహమ్మారి సోకే ప్రమాదం ఉందంటున్నారు జెరోదా సీఈఓ నితిన్‌ కామత్‌ సతీమణి సీమా పాటిల్‌. తననే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. రెండో దశ రొమ్ము క్యాన్సర్‌ నుంచి బయటపడిన ఆమె.. తన క్యాన్సర్‌ అనుభవాల్ని ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్‌ వేదికగా పంచుకున్నారు. ‘జీవితం ఎంత చిన్నదో అంత విలువైందని తన క్యాన్సర్‌ ప్రయాణమే తనకు తెలియజేసింద’ని చెబుతోన్న సీమా క్యాన్సర్‌ జర్నీ ఆమె మాటల్లోనే..!

మా నాన్న ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. పదవీ విరమణ తర్వాత బెళగామ్‌లో స్థిరపడ్డాం. అక్కడే నా చదువు పూర్తయింది. ఎయిర్‌ హోస్టెస్‌ కావాలనేది నా చిన్ననాటి కల. దీన్ని సాకారం చేసుకోవడానికే బెంగళూరు వచ్చాను. తొలుత కొన్నాళ్ల పాటు కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం చేశా. ఇక్కడే నితిన్‌ను కలిశాను. తొలిచూపులోనే ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టింది. ఆపై ఎయిర్‌ దక్కన్‌ క్యాబిన్‌ క్రూలో పనిచేసే అవకాశం తలుపు తట్టింది. కొన్నాళ్లకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో అవకాశం రావడంతో ఐదేళ్ల పాటు సింగపూర్‌లోనే ఉన్నాను. ఇలా దూరమైనా మా ప్రేమ మరింత దృఢపడింది. 2008లో ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 2011లో ఇండియాకు తిరిగొచ్చాక నితిన్‌ ప్రారంభించిన జెరోదా సంస్థలో చేరాను. 2015లో మా బాబు కియాన్‌ పుట్టాడు. ప్రస్తుతం మేము ముగ్గురం మా అత్తమామలతో బెంగళూరులోనే ఉంటున్నాం.

ఆ సందేహమే నిజమైంది!
కెరీర్‌కి ఎంత ప్రాధాన్యమిస్తానో.. వ్యక్తిగత జీవితానికీ అంతే సమయమిస్తా. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయను. ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటిస్తా. క్రమం తప్పకుండా వ్యాయామాలూ చేస్తాను. ఇక రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్స్‌ అస్సలు మిస్సవ్వను. అయితే పూర్తి బాడీ చెకప్‌లో మమోగ్రామ్‌ ఉండదు. కానీ గతంలో ఓసారి వక్షోజాల ఆకృతిలో తేడాను గమనించా.. బ్రెస్ట్‌ఫీడింగ్‌ వల్లేనేమో అనుకొని వెనక్కి తగ్గినా.. ఓసారి మమోగ్రామ్‌ చేయించుకుంటే సందేహం తీరుతుంది కదా అనిపించింది. నా సందేహమే నిజమైంది.. కుడి రొమ్ములో చిన్న గడ్డ ఉందని తేలింది. ఆపై బయాప్సీ, ఇతర పరీక్షల్లో అది క్యాన్సర్‌ కణతి అని నిర్ధారణ అయింది. 2021 నవంబర్‌లో నాకు రెండో దశ రొమ్ము క్యాన్సర్‌ అని వైద్యులు తేల్చారు. అయితే ఈ విషయాన్ని ముందు జీర్ణించుకోలేకపోయాను. కానీ ఆ తర్వాత రియలైజ్‌ అయ్యాను. క్యాన్సర్‌ చికిత్స ఎక్కడ తీసుకోవాలన్న నిర్ణయంపై నేను, నితిన్‌ చాలా చర్చించాం. దేశ, విదేశీ క్యాన్సర్‌ ఆస్ప్రతులకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నాం. కానీ ఆఖరికి ఇండియాలోనే ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరాను.

ఆపరేషన్‌తో ఆగిపోలేదు!
తొలుత మాస్టెక్టమీ ఆపరేషన్‌ చేసి నా కుడి రొమ్మును తొలగించారు. ఆ సమయంలో ఎంతో మానసిక వేదనకు లోనయ్యా. అప్పుడు డాక్టర్లే నాలో ఆత్మవిశ్వాసం నింపారు. సుమారు మూడు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో పలు ప్రతికూల ఆలోచనలతో నా మనసు కకావికలమయ్యేది. ప్రతి క్షణం నితిన్‌ నా పక్కనే ఉంటూ నాలో ధైర్యం నింపేవాడు.. నా మనసును పాజిటివిటీ వైపు మళ్లించేవాడు. అయితే మాస్టెక్టమీతోనే నా శరీరంలో క్యాన్సర్‌ ఆనవాళ్లు తొలగిపోలేదు. ఈ మహమ్మారి లింఫ్‌ నోడ్లకూ విస్తరించడంతో ఒక దాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆపై క్యాన్సర్‌ తిరిగి సోకే ప్రమాదం ఉండడంతో 4 కీమోథెరపీ సెషన్స్‌, రేడియేషన్‌ చికిత్సలూ అవసరమయ్యాయి. కీమో కంటే ముందు ఎడమ భుజం వద్ద మరో చిన్న ఆపరేషన్‌ చేసి ఓ పరికరాన్ని అమర్చారు. కీమో మందుల్ని నేరుగా శరీరంలోకి ప్రవేశపెట్టే పోర్ట్‌ అది. ఇక కీమో సెషన్స్‌లో భాగంగా జుట్టు రాలుతుందని డాక్టర్లు ముందే చెప్పారు. నాకు పొడవాటి జుట్టంటే చాలా ఇష్టం. కీమో ప్రభావం జుట్టుపై పడకుండా చేసే ఆప్షన్స్‌ కోసం వెతకగా.. ఐస్‌ క్యాప్‌ చక్కటి ప్రత్యామ్నాయ మార్గంలా కనిపించింది. కానీ డాక్టర్‌ అది అంతగా వర్కవుట్‌ కాదని చెప్పడంతో వెనక్కి తగ్గాను.. బాయ్‌ కట్‌ హెయిర్‌స్టైల్‌తో తొలి కీమో సెషన్‌కి హాజరయ్యా.

చనిపోవడం మేలనిపించేది!
ఇక కీమో థెరపీలో భాగంగా.. మందుల ప్రభావంతో ఒక రకమైన మత్తు నన్ను ఆవరించేది. దీంతో తొలి రెండు రోజులు అసలు నా శరీరంలో ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. కానీ మూడో రోజు నుంచి దాని తాలూకు దుష్ప్రభావాలు నన్ను అతలాకుతలం చేశాయి. బలహీనత, కీళ్ల నొప్పులు, విరేచనాలు, వికారం, రుచి కోల్పోవడం, ఒక్కోసారి మలబద్ధకం.. ఇలా సమస్యలన్నీ ఒకేసారి నాపై మూకుమ్మడిగా దాడి చేశాయనిపించింది. ఇలా ఏడు రోజులు ఇబ్బంది పడ్డా. ఒక్కోసారి ఈ అవస్థ భరించే కంటే చనిపోవడమే బెటరేమో అనిపించింది. కానీ రెండోసారి చికిత్సకు వెళ్లినప్పుడు నాకు నేనే సర్దిచెప్పుకున్నా.. పాజిటివిటీని నా మనసులో నింపుకొన్నా. నిరాశతో సోఫాలో కూర్చోవడానికి బదులు కాస్త అటూ ఇటూ తిరుగుతూ ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించా. దీనికి తోడు నితిన్‌ నాలో ధైర్యం నూరిపోయడంతో మరింత వేగంగా కోలుకోగలిగాను.

నితిన్‌.. నా బలం!
మన సమాజంలో క్యాన్సర్‌పై ఉన్న భయాలు, అపోహల గురించి నితిన్‌, నేను ఎప్పుడూ చర్చించుకునేవాళ్లం. వాటిని దూరం చేయడానికి మా వంతు ప్రయత్నం చేయాలనుకునేవాళ్లం. కీమోలో భాగంగా నా జుట్టు రాలిపోతున్నప్పుడు విగ్గుతో కవర్‌ చేసుకోవాలనుకున్నా. కానీ క్యాన్సర్‌ అపోహల్ని దూరం చేయాలనుకున్న మేమే ఇలా చేయడం సరికాదనిపించింది. అందుకే గుండు చేయించుకున్నా. నాలో మనోస్థైర్యం నింపడానికి నితిన్‌ కూడా గుండు చేయించుకున్నాడు. నా జుట్టు తిరిగి పెరిగే వరకూ తను గుండులోనే ఉన్నాడు. ఇక నా కొడుకూ నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు అండగా నిలిచాడు. ఇక క్యాన్సర్‌ నుంచి కోలుకునే క్రమంలో ఆహార నియమాల్లో పలు మార్పులు చేర్పులు చేసుకున్నా. నడక, ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడం.. వంటి వ్యాయామాలూ సాధన చేయడం ప్రారంభించా. సుమారు రెండేళ్ల పాటు ఈ మహమ్మారితో నేను చేసిన పోరాటం నాకు జీవితం విలువను తెలియజేసింది. జీవితం ఎంత చిన్నదో.. అంత విలువైందన్న సత్యం బోధపడింది. ఈ క్రమంలోనే నాకు నచ్చింది చేయాలని, హ్యాపీగా ఉండాలని డిసైడయ్యా. అందుకే ప్రపంచంలో నాకు నచ్చిన ప్రదేశాల్ని చుట్టొచ్చా.. ఎన్నో విషయాలు తెలుసుకున్నా.
ఇక చివరగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే క్యాన్సర్‌ మహమ్మారి బయటపడచ్చు.. కాబట్టి రెగ్యులర్‌ చెకప్స్‌ తప్పనిసరి! అలాగే చక్కటి ఆహార నియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం.. మన సంపూర్ణ ఆరోగ్యంలో ఈ మూడూ కీలకం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్