Israel Embassy: బీజింగ్‌లో ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సిబ్బందిపై దాడి

చైనాలో ఇజ్రాయెల్‌ ఎంబసీ ఉద్యోగిపై దాడి జరిగింది. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించినట్లు ఇజ్రాయెల్‌ ఎంబసీ తెలిపింది.

Updated : 13 Oct 2023 20:00 IST

బీజింగ్: ఇజ్రాయెల్‌ - హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులపై దాడులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ముగ్గురు ఇజ్రాయెల్‌ పర్యాటకులను ఈజిప్టులో ఓ పోలీసు కాల్చి చంపాడు. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ఉద్యోగిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈ ఘటన ఎంబసీ పరిసర ప్రాంతాల్లో జరగలేదని, దీనిపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం గాయపడిన ఉద్యోగి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది. గాజాపై దాడికి నిరసనగా విదేశాల్లోని ఇజ్రాయెల్‌ పౌరులపై దాడులు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆ దేశం ప్రకటించిన కొద్ది సేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. 

హమాస్‌ మిలిటెంట్ల దాడి విషయంలో చైనా వైఖరిపై ఇజ్రాయెల్‌ తీవ్ర నిరాశకు గురైందని ఆ దేశ రాయబార కార్యాలయం తెలిపింది. మహిళలు, పిల్లలను అతి క్రూరంగా హమాస్ హత్య చేసిందని, ఆ దాడిని చైనా ఖండించకపోవడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని చైనా మిడిల్‌ ఈస్ట్‌ వ్యవహారాల ప్రతినిధికి తెలిపామని ఇజ్రాయెల్‌ రాయబారి రఫీ హర్పాజ్‌ వెల్లడించారు. అంతకముందు చైనా.. ఇజ్రాయెల్‌ - హమాస్‌లు చర్చలతో సమస్యలను పరిష్కరించుకుని.. శాంతిని నెలకొల్పడానికి కృషి చేయాలని కోరింది. ఘర్షణల్లో అమాయకులైన పౌరులు బలి కాకుండా ఇరు పక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. 

ఆరు రోజుల్లో ఆరు వేల బాంబులు.. ఇజ్రాయెల్‌ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగిస్తోందని ఆరోపణలు!

హమాస్‌పై దాడి చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా, బ్రిటన్‌, భారత్‌ సహా పలు దేశాలు మద్దతు తెలిపాయి. మరోవైపు హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై సిరియా, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ దాడులు చేస్తున్నాయి. ఈ దాడులకు ఇజ్రాయెల్‌ సైన్యం దీటుగా బదులిస్తోంది.  ఇప్పటి వరకు ఇరువైపులా దాడుల్లో 2,800 మంది మరణించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గాజాపై గ్రౌండ్ ఆపరేషన్‌కు ఇజ్రాయెల్‌ సిద్ధమవుతోంది. దీంతో ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పౌరులు ఆ ప్రాంతాన్ని వీడాలని ఐడీఎఫ్‌ ఆదేశాలు జారీ చేసింది. హమాస్‌ మిలిటెంట్లు వారిని కవచాలుగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని, రాబోయే రోజుల్లో గాజా నగరంపై ఐడీఎఫ్‌ దాడులు పెంచనుందని, ఇందులో అమాయకులైన పౌరులకు నష్టం కలగకూడదని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని