Israel - Hamas: ఆరు రోజుల్లో ఆరు వేల బాంబులు.. ఇజ్రాయెల్‌ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగిస్తోందని ఆరోపణలు!

గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దళం భీకర దాడులు చేస్తోంది. ఆరు రోజుల వ్యవధిలో ఆరు వేలకు పైగా బాంబులను గాజాపై జార విడినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. 

Published : 13 Oct 2023 16:48 IST

టెల్‌ అవీవ్: హమాస్‌ మిలిటెంట్ల ఏరివేత లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ (Israel) బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు గాజాలోని 3,600 హమాస్‌ స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరు రోజుల్లో నాలుగు వేల టన్నుల బరువున్న ఆరు వేల బాంబులను గాజాపై జారవిడిచినట్లు తెలిపింది. మరోవైపు యుద్ధంలో ఇజ్రాయెల్‌ వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు ఉపయోగిస్తోందని న్యూయార్క్‌కు చెందిన హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ అనే సంస్థ ఆరోపించింది. ఇవి పౌరులపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ సైన్యం మాత్రం గాజాలో వైట్ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగించలేదని తెలిపింది. 

అక్టోబరు 10న లెబనాన్‌పై, అక్టోబరు 11న గాజాపై ఇజ్రాయెల్‌ ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన వీడియోలను పరిశీలించామని, వాటిలో వైట్ పాస్ఫరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని హ్యుమన్‌ రైట్స్ వాచ్‌ తెలిపింది. గతంలో 2008-09లో గాజాపై ఉపయోగించిన వైట్‌ పాస్ఫరస్‌ బాంబులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నామని 2013లో ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తాజాగా మరోసారి ఇజ్రాయెల్‌ వీటిని గాజాపై ప్రయోగించిందని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. 

ఇజ్రాయెల్‌ దాడుల్లోనే.. 13 మంది బందీలు మృతి: హమాస్‌

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంలో తమ సైన్యంపై రష్యా వైట్‌ పాస్ఫరస్‌ బాంబులు ప్రయోగించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. యుద్ధంలో ఇలాంటి బాంబులు భారీగా పొగను సృష్టిస్తూ.. కాంతిని వెదజల్లుతాయి . బంకర్‌లు, భవనాలను నాశనం చేసేందుకు పాస్ఫరస్‌ బాంబులను ఉపయోగిస్తారు. అయితే, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, దీర్ఘ కాలిక రోగాలకు కారణమవుతాయని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వీటి వినియోగంపై ఎలాంటి నిషేధం లేకపోవడంతో కొన్ని దేశాలు శత్రువులపై దాడులు చేసేందుకు వినియోగిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని