Israel - Hamas: హమాస్‌ దాడి.. టెస్లా సాయంతో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి.. మస్క్‌ రియాక్షన్‌ ఇదే

ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్ల దాడి సమయంలో ఓ వ్యక్తి టెస్లా కారు సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ స్పందించారు.

Updated : 15 Oct 2023 14:51 IST

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌ (Israel)పై హమాస్‌ మిలిటెంట్లు దాడి చేసి మారణహోమం సృష్టించారు. మహిళలు, పసిపిల్లలను అతిక్రూరంగా హతమార్చారు. ఈ నేపథ్యంలో హమాస్‌ దాడి నుంచి టెస్లా కారు సాయంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వివరాలను ఇజ్రాయెల్‌ ఫ్రీడమ్‌ పార్టీ నేత గిలాద్‌ ఆల్పర్‌ తన ఎక్స్ (గతంలో ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు. బాధితుడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ‘హమాస్‌ దాడిని మొదట ఎదుర్కొన్న ఓ వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకునేందుకు టెస్లా కారు సాయపడిన తీరు అద్భుతం’ అంటూ గిలాద్‌ పోస్టు చేశారు. వివరాలు ఆ వ్యక్తి మాటల్లోనే..

‘‘హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశారని తెలియగానే.. అత్యవసర బృందం సభ్యులకు అధికారుల నుంచి పిలుపు వచ్చింది. అందులో నేను సభ్యుణ్ని. దీంతో వెంటనే నా టెస్లా మోడల్‌ 3 (Tesla Model 3) కారులో అసెంబ్లీ పాయింట్‌కు బయలుదేరాను. రోడ్డుపై వెళుతున్న సమయంలో నన్ను పది అడుగుల దూరం నుంచి హమాస్‌ మిలిటెంట్లు చూశారు. వాళ్లు పెద్ద మిషిన్‌ గన్‌లతో పికప్‌ ట్రక్కులో వస్తున్నారు. నన్ను చూసిన వెంటనే ముందుగా నా కారు ముందు, కుడి వైపు కాల్పులు జరిపారు. నేను డ్రైవ్‌ చేస్తుంది ఎలక్ట్రిక్‌ కారు అనే విషయం వాళ్లకి తెలియదు. దాంతో ముందు కారు ఇంజిన్‌, కుడివైపు డీజిల్ ట్యాంకు ఉంటాయని భావించి కాల్పులు జరిపారు. కానీ, టెస్లా కార్లకు ముందు స్టోరేజ్‌ ఉంటుంది. కాల్పులు జరిగినా నేను ఆగకుండా మరింత వేగంగా కారును ముందుకు పోనివ్వడంతో.. టైర్లు, కారు ముందువైపు ఉన్న అద్దం, కుడివైపు డోర్‌పై కాల్పులు జరిపారు. దీంతో నా కాలు, తలకు బుల్లెట్‌ గాయాలయ్యాయి. నేను కారు వేగాన్ని మరింత పెంచాను. కొద్ది దూరం నన్ను వాళ్లు వెంబడించినప్పటికీ.. టెస్లా వేగాన్ని అందుకోలేకపోయారు. టైర్లు దెబ్బతిన్నా.. టెస్లాలోని డ్యూయల్‌ మోటార్‌ ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ యాక్టివేట్‌ కావడంతో కారు ఎక్కడా ఆగకుండా ముందుకు సాగింది. అలా, శరీరం నుంచి రక్తం కారుతున్నా.. కారును డ్రైవ్‌ చేసుకుంటూ దగ్గర్లోని ఆసుపత్రికి చేరుకున్నాను’’ అని సదరు వ్యక్తి చెప్పినట్లు గిలాద్‌ తెలిపారు. 

ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా.. మధ్యధరా సముద్రంలోకి మరో విమాన వాహక నౌక

ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే, ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అతన్ని కారు నుంచి బయటికి తీసేందుకు అద్దాలు పగలగొట్టాల్సి వచ్చిందని సహాయక బృందాలు తెలిపాయి. కారుపై సుమారు 100కు పైగా బుల్లెట్‌ రంధ్రాలున్నాయని, విండ్‌ షీల్డ్‌ గట్టిగా ఉండటంతో అతనికి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, దీనిపై టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్ (Elon Musk) స్పందించారు. అతను ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని