France : ఉన్నత విద్య చదవాలనుకుంటే.. ఫ్రాన్స్‌ స్వాగతమంటోంది!

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) ఫ్రాన్స్‌ (France) పర్యటనలో అనేక ఒప్పందాలు కుదిరాయి. అందులో భాగంగా భారతీయ విద్యార్థులకు (Indian Students) ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తామని ఫ్రాన్స్‌ ప్రకటించింది. 

Published : 04 Sep 2023 17:16 IST

దిల్లీ : ఫ్రాన్స్‌లో (France) ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు (Indian Students) ఆ దేశం తీపికబురు చెప్పింది. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇటీవల ఫ్రాన్స్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi).. ఆ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఆదేశాల మేరకు ఆ దేశ రాయబార కార్యాలయం కార్యాచరణ ప్రారంభించింది. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల కాల పరిమితితో కూడిన షెంజెన్‌ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ చర్య ద్వారా ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం అవుతాయని ఆకాంక్షిస్తోంది.

భూమికి సురక్షితంగా చేరిన నలుగురు వ్యోమగాములు..!

భారతీయ విద్యార్థుల కోసం ఫ్రాన్స్‌ ‘ఇంటర్నేషనల్‌ క్లాసెస్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఫ్రెంచ్‌ భాష, ఇతర విద్యా విభాగాల్లో సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. ‘పారిస్‌లో అధ్యక్షుడు మేక్రాన్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి మా బృందాలు రెట్టింపు కృషి చేస్తున్నాయి. ఫ్రాన్స్‌ సమ్మిళిత, విభిన్నమైన దేశం. భారతీయ విద్యార్థులతో మా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, ప్రపంచ స్థాయి విద్యావకాశాలను పంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నాం. ఫ్రాన్స్‌ ఎల్లప్పుడూ మీకు స్నేహితుడిలా ఉంటుంది. అద్భుతమైన విద్యా జీవితాన్ని అందించేందుకు కావాల్సినంత సహాయం చేస్తుందని’ భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్‌ తెలిపారు. 

త్వరలో ఫ్రెంచ్‌ రాయబార కార్యాలయం చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ముంబయి నగరాల్లో ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహించనుంది. అక్టోబర్‌ నెలలో ఆ కార్యక్రమాలు జరగనున్నాయి. 40కి పైగా ఫ్రెంచ్‌ ఉన్నత విద్యాసంస్థల ప్రతినిధులు వాటికి హాజరు కానున్నారు. విద్యార్థులు సరైన కోర్సు ఎంచుకోవడానికి, తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేయడానికి వారు కావల్సిన తోడ్పాటునందిస్తారని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని