నార్వే రచయిత ఫాసేకు నోబెల్‌

తన నాటకాలు, విశిష్ట వచన శైలితో అవ్యక్తాన్ని వ్యక్తీకరించడంలో సిద్ధహస్తుడైన నార్వే దేశ రచయిత, 64 ఏళ్ల యోన్‌ ఫాసేకు ఈ ఏటి నోబెల్‌ సాహిత్య బహుమతిని ప్రదానం చేయనున్నట్లు నోబెల్‌ సాహిత్య పురస్కార కమిటీ గురువారం ప్రకటించింది.

Updated : 06 Oct 2023 06:06 IST

సాహిత్య విభాగంలో ఎంపిక

నన్ను నోబెల్‌ వరించిందనే వార్త వినడానికి దశాబ్ద కాలం నుంచి మానసికంగా సన్నద్ధుడినై ఉన్నా. తీరా ఆ వార్త చెవిన పడ్డాక ఆశ్చర్యపోయా. అదే సమయంలో ఆశ్చర్యపోనూలేదు. ఇది అచ్చమైన సాహిత్యానికి లభించిన బహుమతి.

 ఫాసే


స్టాక్‌హోం: తన నాటకాలు, విశిష్ట వచన శైలితో అవ్యక్తాన్ని వ్యక్తీకరించడంలో సిద్ధహస్తుడైన నార్వే దేశ రచయిత, 64 ఏళ్ల యోన్‌ ఫాసేకు ఈ ఏటి నోబెల్‌ సాహిత్య బహుమతిని ప్రదానం చేయనున్నట్లు నోబెల్‌ సాహిత్య పురస్కార కమిటీ గురువారం ప్రకటించింది. మానవుల్లోని అభద్రత, ఆదుర్దాలను ఫాసే రచనలు బలంగా వ్యక్తీకరిస్తాయని వివరించింది. ఇంతవరకు 40 నాటకాలు, నవలలు, బాలల పుస్తకాలు, కథానికలు, కవితలు, వ్యాసాలు రచించిన ఫాసే 1969లో నోబెల్‌ సాహిత్య బహుమతి పొందిన ఐరిష్‌ రచయిత శామ్యూల్‌ బెకెట్‌ నుంచి స్ఫూర్తి పొందానంటారు. ఫాసేతో కలిపి ఇప్పటిదాకా నలుగురు నార్వేజియన్‌ రచయితలను నోబెల్‌ సాహిత్య బహుమతి వరించింది. ఆ దేశంలో రెండు అధికార లిఖిత శైలుల్లో ఒకటైన నైనార్‌స్క్‌ శైలిని అనుసరించి నోబెల్‌ పొందిన రెండో రచయిత ఫాసేనే. 54 లక్షల జనాభా గల నార్వేలో అధికార రచనా శైలుల్లో ఒకటైన బోక్మాల్‌ను అధికారికంగానూ, పత్రికల్లోనూ ఉపయోగిస్తారు. నైనార్‌స్క్‌ శైలిని దేశంలో 10% మంది, అదీ పశ్చిమ నార్వే గ్రామాల్లోనే ఉపయోగిస్తారు. ఫాసేకి లభించిన బహుమతి ఒక మైనారిటీ వర్గ భాషకు లభించిన పురస్కారమని ప్రశంసలు వినవస్తున్నాయి. ఫాసే తొలి నవల ‘రెడ్‌, బ్లాక్‌’ 1983లో, తొలి నాటకం ‘సమ్‌ వన్‌ ఈజ్‌ గోయింగ్‌ టు కమ్‌’ 1992లో ప్రచురితమయ్యాయి. ఫాసే విరచిత ‘ది నేమ్‌, డ్రీమ్‌ ఆఫ్‌ ఆటమ్‌, అయాం ది విండ్‌’ వంటి నాటకాలు అమెరికా, ఐరోపాలలో విస్తృతంగా ప్రదర్శితమయ్యాయి.

ఫాసే పదాలను చాలా క్లుప్తంగా, పొందికగా వాడతారని గయ్‌ పుజే అనే బ్రిటిష్‌ అధ్యాపకుడు వివరించారు. ‘ఆయన రచనల్లో సరళమైన భావ వ్యక్తీకరణలు తిరిగితిరిగి దర్శనమిస్తాయి. ఈ పునరుక్తులు క్రమంగా లోతైన అర్థాన్ని సంతరించుకుని, వాటి అంతరార్థమేమిటా అని చదువరిని గాఢాలోచనలోకి నెడతాయి’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని