కుంగుబాటుకు గుండె జబ్బుతో లంకె

కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

Published : 26 Apr 2024 05:22 IST

దిల్లీ: కుంగుబాటు, గుండె జబ్బుకు ఒకేరకమైన జన్యువులు కారణం కావొచ్చని ఫిన్లాండ్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో ఒక రుగ్మత ఉన్నవారికి రెండోది కూడా తలెత్తే ముప్పు ఎందుకు ఉంటుందన్నది ఇది తేటతెల్లం చేస్తోందని వివరించింది. ఇలాంటి జన్యు లంకె ఉండొచ్చని 1990ల నుంచి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కుంగుబాటు సమస్య ఉన్నవారికి గుండె జబ్బు ముప్పు ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు ఇప్పటికే తేల్చాయి. ఈ మానసిక రుగ్మతకు త్వరగా సమర్థ చికిత్స ఇస్తే గుండె సంబంధ సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చు. అలాగే గుండె జబ్బు ఉన్నవారు కుంగుబాటు బారినపడే అవకాశం కూడా ఉంది. కుంగుబాటు బాధితులు సాధారణంగా సరైన ఆహారం తీసుకోరు. వ్యాయామం కూడా చేయరు. ఈ రెండు రుగ్మతలకు మధ్య లంకెకు ఇది కూడా ఒక కారణమే. కుంగుబాటు, గుండె జబ్బులకు మధ్య మరింత లోతైన సంబంధం ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇన్‌ఫ్లమేషన్‌ వంటి అనేక జీవ ప్రక్రియలపరంగానూ వీటి మధ్య సారూప్యతలు ఉండొచ్చని చెప్పారు. దీన్ని నిగ్గు తేల్చేందుకు శాస్త్రవేత్తలు 900 మంది స్త్రీ, పురుషుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. వీరి వయసు 34 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుంది. రక్త నమూనాల్లో జన్యు వ్యక్తీకరణలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. 256 జన్యువులతో కూడిన ఒక సమూహం వారిని ఆకర్షించింది. కుంగుబాటు, గుండె ఆరోగ్యం విషయంలో వీటి వ్యక్తీకరణలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యక్తీకరణల స్థాయి పెరిగినా, తగ్గినా ఈ వ్యాధుల ముప్పు పెరుగుతుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని