గురుపత్వంత్‌పై హత్యాయత్నం వెనుక ‘రా’!

సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్‌ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది.

Published : 30 Apr 2024 04:37 IST

భారత ప్రభుత్వ పెద్దల అనుమతీ ఉంది
‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక పరిశోధనాత్మక కథనం

వాషింగ్టన్‌: సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో భారత్‌ గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక సోమవారం ఒక కథనం ప్రచురించింది. ఆ అధికారి పేరును విక్రమ్‌ యాదవ్‌గా గుర్తించినట్లు వెల్లడించింది. అమెరికాలోని సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జె) సంస్థ అధికార ప్రతినిధి గురుపత్వంత్‌ సింగ్‌ ఖలిస్థానీల కీలక నేత. భారత ప్రభుత్వం అతనిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్‌ను భారత గూఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు విస్మయం వ్యక్తం చేశారని ఆ కథనం పేర్కొంది. అయితే, అమెరికా నిఘా విభాగాలు గురుపత్వంత్‌పై హత్యాయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపింది. ‘రా’ ఉన్నతాధికారుల అనుమతితోనే విక్రమ్‌ యాదవ్‌ ఆ పనికి సిద్ధమయ్యారని, అందువల్ల ఈ హత్యాయత్నంలో వారి ప్రమేయం కూడా ఉంటుందని అమెరికా నిఘా, గూఢచర్య వర్గాలు భావిస్తున్నట్లు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం పేర్కొంది. భారత ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి కూడా గురుపత్వంత్‌ను హతమార్చే పథకం సమాచారం తెలుసునని, అందుకు కొన్ని ఆధారాలను కూడా అమెరికా సంస్థలు కొంతమేరకు గుర్తించినట్లు వెల్లడించింది. జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌కు ఈ విషయం తెలిసే అవకాశం ఉన్నా, అందుకు కచ్చితమైన ఆధారాలు లేవని అమెరికా అధికారులను ఉటంకిస్తూ కథనం పేర్కొంది. విదేశాల్లోని తమ శత్రువులను నిర్మూలించేందుకు కొన్ని దేశాల ప్రభుత్వాలు వివిధ చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై పరిశోధనల క్రమంలోనే గురుపత్వంత్‌ సింగ్‌పై హత్యాయత్నం వివరాలను, ఆధారాలను సేకరించే యత్నం జరిగిందని అమెరికన్‌ బిలియనీర్‌, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రిక తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని