ఘనంగా పుతిన్‌ ప్రమాణస్వీకారం

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు.

Published : 08 May 2024 05:57 IST

రష్యా అధ్యక్షుడిగా అయిదోసారి బాధ్యతల స్వీకరణ
2030 వరకూ పదవిలో ఉండే అవకాశం

మాస్కో: ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. క్రెమ్లిన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. దీంతో మరో ఆరేళ్లు (2030 వరకు) దేశాధినేతగా ఆయన కొనసాగనున్నారు. రష్యా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఎరుపు రంగులో ఉన్న ‘రాజ్యాంగం’ మీద ప్రమాణం చేసిన పుతిన్‌..దాన్ని పరిరక్షిస్తానన్నారు. దీంతో 24 ఏళ్లుగా రష్యా అధినేతగా కొనసాగుతున్న ఆయన.. ఆధునిక రష్యాను అత్యధిక కాలం పాలించిన స్టాలిన్‌ రికార్డును తిరగరాయనున్నారు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిసే సమయంలో జర్మనీలో సోవియట్‌ యూనియన్‌ గూఢచారిగా ఉన్న పుతిన్‌, దేశాధ్యక్షుడిగా ఎదగడమే కాకుండా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన వ్యక్తిగా నిలవనున్నారు. పుతిన్‌ మరో ఆరేళ్లపాటు అధికారంలో ఉండనున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌తో యుద్ధానికి నిధులు సమకూర్చడానికి పన్నులను పెంచడం, సైన్యంలో చేరడానికి మరింత మందిని ఒత్తిడి చేయడం వంటి నిర్ణయాలను తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..

1999లో బోరిస్‌ ఎల్సిన్‌ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక తాత్కాలిక అధ్యక్షుడిగా పుతిన్‌ నియమితులయ్యారు. 2000 సంవత్సర ఎన్నికల్లో అధికారికంగా దేశాధ్యక్షుడయ్యారు. రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు మాత్రమే ఉన్నత పదవిని చేపట్టడానికి అవకాశం ఉండగా, దాన్ని సవరించి మరో రెండుసార్లు అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం అయిదోసారి పదవిని చేపట్టారు. 2030 వరకు అధినేతగా కొనసాగనున్నారు. ఆ తర్వాత మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకూ పుతిన్‌ అర్హుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని