Ukraine Crisis: నీస్టర్‌ నదిపై వంతెన ధ్వంసం

రష్యా మళ్లీ దాడులను ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతమే లక్ష్యంగా సోమవారం క్షిపణులతో విరుచుకుపడింది! ఒడెస్సాకు పశ్చిమాన నీస్టర్‌ నదిపై ఉన్న అత్యంత వ్యూహాత్మక వంతెనను పుతిన్‌ సేనలు తునాతునకలు చేశాయి. ఒడెస్సాలోని పలు ప్రాంతాల అనుసంధానానికి ఇది అత్యంత కీలకమైన వంతెన. దీన్ని ధ్వంసం చేయడం ద్వారా రొమేనియా నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సరకులు సరఫరా కాకుండా రష్యా అడ్డుకున్నట్టయింది. ఉక్రెయిన్‌లోని మొత్తం 38 లక్ష్యాలపై

Updated : 03 May 2022 05:55 IST

రొమేనియా నుంచి ఉక్రెయిన్‌కు నిలిచిన ఆయుధాల సరఫరా
డాన్‌బాస్‌ లక్ష్యంగా కొనసాగిన మాస్కో దాడులు...
మేరియుపొల్‌ ఉక్కు కర్మాగారం నుంచి పౌరులకు విముక్తి

జపోరిజియా: రష్యా మళ్లీ దాడులను ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతమే లక్ష్యంగా సోమవారం క్షిపణులతో విరుచుకుపడింది! ఒడెస్సాకు పశ్చిమాన నీస్టర్‌ నదిపై ఉన్న అత్యంత వ్యూహాత్మక వంతెనను పుతిన్‌ సేనలు తునాతునకలు చేశాయి. ఒడెస్సాలోని పలు ప్రాంతాల అనుసంధానానికి ఇది అత్యంత కీలకమైన వంతెన. దీన్ని ధ్వంసం చేయడం ద్వారా రొమేనియా నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సరకులు సరఫరా కాకుండా రష్యా అడ్డుకున్నట్టయింది. ఉక్రెయిన్‌లోని మొత్తం 38 లక్ష్యాలపై సోమవారం తాము క్షిపణులతో దాడులు చేసినట్టు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. జపోరిజియా సమీపంలోని మందుగుండు సామగ్రి డిపోను ధ్వంసం చేశామని, స్లోవాన్స్క్‌లో మిగ్‌-29 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ప్రకటించింది. తూర్పు ప్రాంతంలో దాడులను ముమ్మరం చేసేందుకు వీలుగా... మేరియుపొల్‌ నుంచి రష్యా తన బలగాలను తరలిస్తున్నట్టు ఉక్రెయిన్‌ సైనిక వర్గాలు తెలిపాయి. లుహాన్స్క్‌లో జరిగిన తాజా దాడుల్లో ముగ్గురు పౌరులు మరణించగా, ఓ చిన్నారి సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.

పది వారాలుగా బిక్కుబిక్కుమంటూ...

మేరియుపొల్‌లోని అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం భూగర్భాన పది వారాలుగా బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్న పౌరులకు భారీ ఊరట లభించింది! సైనిక చర్య ఆరంభంలోనే పుతిన్‌ సేనలు మేరియుపొల్‌ను చుట్టుముట్టి భీకర దాడులకు పాల్పడ్డాయి. దీంతో చాలామంది అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారం పరిసరాల్లోకి తరలివెళ్లారు. వారాల తరబడి దాడులు కొనసాగుతుండటంతో వీరి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. వీరందర్నీ బయటకు తీసుకొచ్చేందుకు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోరియో గుటెరస్‌ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. కర్మాగారం నుంచి కొంతమందిని సోమవారం జపోరిజియాకు తరలించారు. వీరిలో వృద్ధులు, చిన్నారులు ఉండటం గమనార్హం. ఇన్నాళ్లూ సరైన ఆహారం, మందులు, విద్యుత్తు లేక తీవ్ర అగచాట్లు పడ్డామని; నీళ్లు తాగి బతికామంటూ పలువురు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉక్కు కర్మాగారం నుంచి కొంతమంది బయటకు వెళ్లిన తర్వాత రష్యా సేనలు ఆ ప్లాంటుపై దాడులు చేసినట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. అక్కడ బంకర్ల కింద ఇప్పటికీ వందల మంది తలదాచుకుంటున్నారని, వీరిలో పదుల సంఖ్యలో చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్‌ నేషనల్‌ గార్డ్‌ ఆపరేషన్‌ బ్రిగేడ్‌ కమాండర్‌ డెనిష్‌ ష్లేగా చెప్పారు. అజోవ్‌స్తల్‌లో సుమారు వెయ్యి మంది పౌరులు తలదాచుకోగా, 2 వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు మోహరించారు.

‘వంతెన ధ్వంసం ఉగ్రచర్యే...’

తూర్పు ఉక్రెయిన్‌కు రష్యా తన సైనికులను, సామగ్రిని పంపేందుకు కీలకంగా మారిన ఓ సరిహద్దు వంతెనను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు! అయితే దీన్ని కుర్స్క్‌ ప్రాంతీయ గవర్నర్‌ రోమన్‌ స్టారోవోయిట్‌ ఉగ్రవాద చర్యగా పేర్కొన్నారు. రష్యా సిబ్బంది హుటాహుటిన ఈ వంతెనకు మరమ్మతులు ప్రారంభించారు. కాగా, నల్లసముద్రంలో రష్యాకు చెందిన రెండు పెట్రోల్‌ బోట్లను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో రష్యా మోహరించిన సైనిక యూనిట్లలో నాలుగింట ఒక వంతుకుపైగా పనికిరాకుండా పోయినట్టు బ్రిటన్‌ రక్షణశాఖ పేర్కొంది.

జెలెన్‌స్కీ, పెలోసీ 3 గంటల చర్చ

రాజధాని కీవ్‌కు చేరుకున్న అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసీ... అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆదివారం రాత్రి మూడు గంటలపాటు చర్చించారు. ఆయుధాల సరఫరా, ఆర్థిక సహకారం, రష్యాపై ఆంక్షలు తదితర కీలక అంశాలపై వారు మాట్లాడుకున్నారు. పోలండ్‌లోని వార్సాలో పెలోసీ బృందం సోమవారం పర్యటించింది. కష్టంలో ఉన్న ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తున్నారంటూ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ దుడా, చట్టసభ్యులను పెలోసీ అభినందించారు.

బలవంతంగా రష్యాకు తీసుకెళ్లారు...

పెలోసీ పర్యటన నేపథ్యంలో- ‘‘క్లిష్టపరిస్థితుల్లో మా రాజధాని కీవ్‌కు వచ్చి ‘శక్తిమంతమైన సాయం’ అందిస్తున్నట్టు భాగస్వామ్య దేశాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇందుకు ఉక్రెయిన్‌ ప్రజలు రుణపడి ఉంటారు. మా దేశానికి చెందిన సుమారు 5 లక్షల మందిని వారి ఇష్టానికి విరుద్ధంగా రష్యా తమ భూభాగానికి తరలించింది. అందుకే, మేరియుపొల్‌లోని ఉక్కు కర్మాగారం నుంచి బయటకు వచ్చి, బస్సులు ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు’’ అని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.


రష్యా ఇంధన సరఫరా నిలిపేసినా మాకేం ఫర్లేదు: జర్మనీ

మాస్కో నుంచి ఇంధన సరఫరా నిలిచిపోయినా... తమకు వచ్చే ఇబ్బందేమీ లేదని జర్మనీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముందు తమ చమురు డిమాండ్‌లో 35% రష్యా నుంచి వచ్చేదని, ఇప్పుడు అది 12 శాతానికి పడిపోయిందని తెలిపింది. బల్గేరియా, పోలండ్‌లకు గ్యాస్‌ సరఫరాను నిలిపివేస్తామని రష్యా ప్రకటించిన క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌ నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు. మాస్కోపై ఆంక్షలను మరింత కఠినతరం చేయడంపైనా వారు సమాలోచనలు చేస్తున్నారు. తమ దేశంలో అణు విద్యుత్తు కర్మాగారం ఏర్పాటు నిమిత్తం రష్యా సంస్థ రోసాటోమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఫిన్లాండ్‌ సంస్థ ఫెనోవోయిమా వెల్లడించింది.

కీవ్‌లో తమ రాయబార కార్యాలయాన్ని పునఃప్రారంభిస్తున్నట్టు డెన్మార్క్‌ వెల్లడించింది. రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ట్రాన్స్‌నిస్ట్రియాకు వెళ్లవద్దని తన ప్రజలను హెచ్చరించింది. ఆ ప్రాంతానికి కూడా రష్యా దాడులను విస్తరించవచ్చన్న నివేదికలతో డెన్మార్క్‌ తన ప్రజలను అప్రమత్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని