దైవదూతగా దేవసహాయం పిళ్లై: భారతీయ సామాన్యుడికి అసామాన్య గౌరవం

పద్దెనిమిదో శతాబ్దంలో భారతదేశంలో పుట్టి, క్రైస్తవం స్వీకరించిన దేవసహాయం పిళ్లై ఇక నుంచీ దైవదూతగా గుర్తింపు పొందనున్నారు. ప్రపంచ క్రైస్తవుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వాటికన్‌ సిటీలో ఆదివారం జరిగిన ఓ ప్రత్యేక వేడుకలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అరుదైన ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ సామాన్యుడిగా దేవసహాయం చరిత్రలో నిలిచిపోతారు.

Updated : 16 May 2022 07:56 IST

వాటికన్‌ సిటీ వేడుకలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటన

వాటికన్‌ సిటీ: పద్దెనిమిదో శతాబ్దంలో భారతదేశంలో పుట్టి, క్రైస్తవం స్వీకరించిన దేవసహాయం పిళ్లై ఇక నుంచీ దైవదూతగా గుర్తింపు పొందనున్నారు. ప్రపంచ క్రైస్తవుల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన వాటికన్‌ సిటీలో ఆదివారం జరిగిన ఓ ప్రత్యేక వేడుకలో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. అరుదైన ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ సామాన్యుడిగా దేవసహాయం చరిత్రలో నిలిచిపోతారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన బిషప్‌ల కౌన్సిలుతోపాటు ‘కేథలిక్‌ బిషప్స్‌ ఆఫ్‌ ఇండియా’ సదస్సు కోరిన మీదట పరమ ప్రాప్తి (బీటిఫికేషన్‌) వేడుకకు దేవసహాయం పేరును 2004లో వాటికన్‌ సిఫార్సు చేసింది. గత కొన్నినెలలుగా కుడి మోకాలి నొప్పితో బాధపడుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌ (85) ఈ వేడుకకు వీల్‌ఛైర్‌ సహాయంతో హాజరయ్యారు. ఇదే సందర్భంగా దేవసహాయంతోపాటు మరో తొమ్మిదిమంది పేర్లను మత గురువుల జాబితాలో చేర్చారు. ఇందులో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.  ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కన్యాకుమారి జిల్లా గతంలో ట్రావెన్‌కోర్‌ రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ జిల్లాలోని నట్టాళం గ్రామంలో హిందూ నాయర్ల కుటుంబంలో 1712 ఏప్రిల్‌ 23న పుట్టిన నీలకంఠ పిళ్లై 1745లో క్రైస్తవం స్వీకరించి దేవసహాయం పిళ్లైగా మారారు. ట్రావెన్‌కోర్‌ మహారాజు మార్తాండ వర్మ కొలువులో అధికారిగా ఉన్న ఈయన మతమార్పిడి కారణంగా ఉన్నత వర్గాల ఆగ్రహానికి గురై పలు కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారు. 1752 జనవరి 14న మరణశిక్షను సైతం ఎదుర్కొని అమరుడయ్యారు. దేవసహాయం పిళ్లైను దైవదూతగా ప్రకటించిన నేపధ్యంలో కేరళ, తమిళనాడుల్లోని పలు చర్చీల్లో  భక్తులు సంబరాలు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని