ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం!

ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ విజయ పథాన పయనిస్తోంది. ఇంకా లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఫలితాల సరళిని గమనించిన ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ ఓటమిని అంగీకరించారు. అమెరికా, జపాన్‌, భారత నేతలతో మంగళవారం జరిగే శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాల్సిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ దేశంలో అనిశ్చితి ఉండకూడదు.

Published : 22 May 2022 05:50 IST

ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న అల్బనీస్‌  
ఓటమిని అంగీకరించిన మోరిసన్‌

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియా ఎన్నికల్లో విపక్ష లేబర్‌ పార్టీ విజయ పథాన పయనిస్తోంది. ఇంకా లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉన్నప్పటికీ ఫలితాల సరళిని గమనించిన ప్రధాన మంత్రి స్కాట్‌ మోరిసన్‌ ఓటమిని అంగీకరించారు. అమెరికా, జపాన్‌, భారత నేతలతో మంగళవారం జరిగే శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావాల్సిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ దేశంలో అనిశ్చితి ఉండకూడదు. ఈ దేశం ముందడుగు వేయాలి. వచ్చే వారం ముఖ్యమైన సమావేశాలు ఉన్నందువల్ల ఇక్కడి ప్రభుత్వంపై స్పష్టత ఉండాలన్నదే నా ఉద్దేశం’’ అని తెలిపారు. 2007 తర్వాత లేబర్‌ పార్టీ తొలిసారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. కడపటి వార్తలు అందేటప్పటికి మోరిసన్‌కు చెందిన లిబరల్‌ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణం 38 చోట్ల ఆధిపత్యంలో ఉంది. లేబర్‌ పార్టీ 71 స్థానాల్లో ముందంజలో ఉంది. 23 చోట్ల పోటీ హోరాహోరీగా సాగుతోంది. చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా కొన్నిచోట్ల ముందంజలో ఉన్నారు. దీంతో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని, మైనార్టీ ప్రభుత్వం ఏర్పడవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా పార్లమెంటులోని ప్రతినిధుల సభలో మొత్తం 151 స్థానాలు ఉన్నాయి. 2001 తర్వాత అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా వాసులకు ఉపశమనం కల్పించేందుకు ఆర్థిక సాయాన్ని, సామాజిక భద్రతను పెంచుతామని లేబర్‌ పార్టీ హామీ ఇచ్చింది. పక్కనే ఉన్న సాల్మన్‌ దీవుల్లో చైనా సైనిక ఉనికికి స్పందనగా పొరుగు దేశాల సైన్యాలకు శిక్షణ ఇచ్చేందుకు ‘పసిఫిక్‌ డిఫెన్స్‌ స్కూల్‌’ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. 2050 నాటికి గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను ఏకంగా 43 శాతం తగ్గిస్తామంది.

పేద కుటుంబం నుంచి..

ఆస్ట్రేలియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న అల్బనీస్‌.. పేద కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు తండ్రి అండలేదు. తల్లే ఆయనను పెంచి పెద్ద చేశారు. అంగవైకల్యం కింద వచ్చే కొద్దిపాటి పెన్షనే ఆమెకు ఆధారం. ప్రభుత్వం కల్పించిన గృహ వసతిలోనే తల్లి, కుమారుల జీవనం సాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని