Published : 28 May 2022 05:11 IST

తిరుగుబాటుదారుల అడ్డాలో ఉక్రెయిన్‌కు ఎదురు దెబ్బ!

సీవిరోడోనెట్స్క్‌ నగరంపై విరుచుకుపడ్డ పుతిన్‌ సేనలు
60% నివాస భవనాల ధ్వంసం
నలుగురి మృతి

కీవ్‌: ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని తిరుగుబాటుదారుల అడ్డాలో రష్యా పాగా వేసింది! లుహాన్స్క్‌లోని సీవిరోడోనెట్స్క్‌తో పాటు... పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతాల్లో పుతిన్‌ సేనలు శుక్రవారం ఒక్కసారిగా భీకర దాడులు చేపట్టాయి. ఈ ధాటికి సీవిరోడోనెట్స్క్‌ వణికిపోయింది. తీవ్రంగా గాయపడి నలుగురు వ్యక్తులు మృతిచెందారు. పౌరుల నివాసాలను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులకు పాల్పడినట్టు లుహాన్స్క్‌ గవర్నర్‌ సెరిహీ హైదై టెలిగ్రాంలో పోస్ట్‌ చేశారు. దాడుల తీవ్రతకు నగరంలోని 60% భవనాలు ధ్వంసమయ్యాయని, సుమారు 90% ఇళ్లు దెబ్బతిన్నాయని సీవిరోడోనెట్స్క్‌ మేయర్‌ తెలిపారు. కొముషువఖా గ్రామంపైనా మాస్కో విరుచుకుపడటంతో, అక్కడ ఓ పౌరుడు ప్రాణాలు విడిచాడు.

ఆయుధాలు లేకుండా పోరాడలేం: దిమిత్రి కులేబా

ఆయుధాలు లేకుండా పుతిన్‌ సేనలను తాము ఎదుర్కోవడం కష్టమని, సీవిరోడోనెట్స్క్‌లో రష్యా బలగాలను అడ్డుకునేందుకు వెంటనే ఆయుధాలను సరఫరా చేయాలని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా పశ్చిమ దేశాల అధినేతలకు విజ్ఞప్తి చేశారు. ‘‘మాకు భారీ ఆయుధాలు కావాలి. ఈ ఒక్క విషయంలోనే రష్యా మాకంటే బలంగా ఉంది. వారి వద్ద భారీ ఆయుధాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. వాటిని సమర్థంగా తిప్పికొట్టే ఆయుధాలు, మల్టిపుల్‌ లాంచ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ లేకుండా రష్యాను నిలువరించడం కష్టం. తూర్పు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉక్రెయిన్‌కు నిజంగా మంచి చేయాలనుకుంటే... అది ఒక్క ఆయుధాలు అందించడమే. మాకు కావాల్సినవి- ఆయుధాలు, ఆయుధాలు, ఆయుధాలు’’ అని కులేబా ఉద్ఘాటించారు. లుహాన్స్క్‌లో జెలెన్‌స్కీ సర్కారు ఆధీనంలో ఉన్న సీవిరోడోనెట్స్క్‌ను ఎలాగైనా హస్తగతం చేసుకునేందుకు రష్యా స్థిరంగా పోరాడుతోంది. ఇప్పటికే దీన్ని ముట్టడించింది.

యుద్ధారంభానికి ముందు లక్ష మంది జనాభా ఉన్న ఈ నగరంలో ప్రస్తుతం 13 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. రష్యా నిఘా, విధ్వంసక బృందం ఒకటి నగరంలోని ఓ హోటల్‌లోకి ప్రవేశించినట్టు స్థానిక మేయర్‌ ఒలెక్సాండర్‌ స్ట్రెయుక్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారులు డాన్‌బాస్‌లోని రెండు అతిపెద్ద నగరాలకు కేంద్రమైన లైమాన్‌ రైల్వే హబ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

రష్యాపై ఒత్తిడితో ప్రాణాలు నిలుస్తాయి: జెలెన్‌స్కీ

ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా వీడియో ద్వారా సందేశమిచ్చారు. రష్యాపై ఆరో దఫా ఆంక్షలు విధించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ తటపటాయిస్తుండటంపై ఆయన మండిపడ్డారు. రష్యాపై ఒత్తిడి తేవడం ద్వారా వందల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఉక్రెయిన్‌ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి కాకుండా రేవుల్లో నిలిచిపోవడానికి... పశ్చిమ దేశాలు తమపై విధించిన ఆంక్షలే కారణమంటూ మాస్కో ఆరోపించిన క్రమంలో- జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పుతిన్‌ను పొగిడే పని పెట్టుకోవద్దు..

ఉక్రెయిన్‌కు మద్దతిచ్చే దేశాలు దీర్ఘకాల పోరాటానికి సిద్ధపడాలని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ పేర్కొన్నారు. ఈ యుద్ధంలో రష్యా తోక ముడిచేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పొగిడే పని పెట్టుకోవద్దని, అసలు ఆ విషయం గురించి చర్చించనే వద్దని మిత్ర దేశాలకు సూచించారు. నాటో కూటమి దేశాలతో సమానంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలను సమకూర్చాల్సి ఉందని ట్రస్‌ పేర్కొన్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని